Attack on tdp office: ధ్వంస రచన

ప్రధానాంశాలు

Attack on tdp office: ధ్వంస రచన

తెదేపా కేంద్ర కార్యాలయంలో అల్లరి మూకల విధ్వంసం
దుడ్డుకర్రలు, రాళ్లతో బీభత్సం
కార్యాలయ సిబ్బందిపైనా దాడి.. నలుగురికి తీవ్రగాయాలు
పట్టాభి ఇంటిపై.. రాష్ట్రంలోని పార్టీ కార్యాలయాలపైనా దాడులు
నేతల ఇళ్ల ముందు ధర్నాలు
అట్టుడికిన రాష్ట్రం
రాష్ట్రపతి పాలన విధించాలని తెదేపా డిమాండ్‌  
నేడు బంద్‌కు పిలుపు

తెదేపా జాతీయ కార్యాలయంతో పాటు, పార్టీ నాయకుడు పట్టాభిరామ్‌ ఇంటిపై మంగళవారం సాయంత్రం అల్లరిమూకల దాడులు, రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల తెదేపా కార్యాలయాలపై వైకాపా నాయకులు, కార్యకర్తల దాడి యత్నాలు, తెదేపా నాయకుల ఇళ్ల ముందు ధర్నాలతో రాష్ట్రం అట్టుడికింది. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూలేని విధంగా ప్రధాన ప్రతిపక్ష పార్టీ కార్యాలయాలపై ఒక ప్రణాళిక ప్రకారం దాడులు జరగడం ప్రజల్ని తీవ్ర విస్మయానికి గురిచేసింది. ఈ ఘటనలన్నీ మంగళవారం సాయంత్రం దాదాపు ఒకే సమయంలో జరిగాయి. ఈ దాడులతో తెదేపా శ్రేణులు ఆగ్రహావేశాలతో రగిలిపోతున్నాయి. వైకాపా నాయకులు, పోలీసులు కుమ్మక్కై ఈ అరాచకానికి తెగబడ్డారని మండిపడుతున్నాయి. బుధవారం రాష్ట్ర బంద్‌కు తెదేపా పిలుపునిచ్చింది. దాడులపై రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌కు, కేంద్ర హోం మంత్రి అమిత్‌షాకు తెదేపా అధినేత చంద్రబాబు ఫోన్‌లో ఫిర్యాదు చేశారు. తెదేపా చరిత్రలో మొదటిసారి రాష్ట్రపతి పాలన విధించాలని కోరింది. రాజకీయ పార్టీల మధ్య విమర్శలు, ప్రతివిమర్శలు సహజమని, కానీ ఇలా ఒక పార్టీ కార్యాలయంపై దాడులకు పాల్పడటంతో ఒక దుష్ట సంప్రదాయానికి తెర తీసినట్టయిందని వివిధ రాజకీయ పక్షాలు ఖండించాయి. తెదేపా ఆరోపణల్ని వైకాపా ఖండించింది. తెదేపా కార్యాలయాలపై తాము దాడులు చేయలేదని, ఎవరితోనో రాళ్లు వేయించడం, భౌతికంగా ఇబ్బంది పెట్టడం తమ విధానం కాదని వైకాపా ఎమ్మెల్యేలు, నాయకులు పేర్కొన్నారు.

ఈనాడు - అమరావతి

తెదేపా కార్యాలయాలపై దాడులు రాష్ట్రంలో తీవ్ర కలకలం సృష్టించాయి. ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఏజెన్సీ ప్రాంతంలో గంజాయి విశృంఖలంగా సాగవుతోందని మాజీ మంత్రి నక్కా ఆనంద్‌బాబు సోమవారం ఆరోపణలు చేయడంతో... నర్సీపట్నం పోలీసులు హుటాహుటిన గుంటూరు వచ్చి సోమవారం అర్ధరాత్రి ఆనంద్‌బాబు ఇంటికెళ్లి నోటీసులు ఇచ్చేందుకు సిద్ధపడ్డారు. ఈ పరిణామాలపై తెదేపా నాయకుడు పట్టాభిరామ్‌ మంగళవారం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... ముఖ్యమంత్రిపైనా, ప్రభుత్వంపైనా, పోలీసులపైనా పరుష వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో విజయవాడలోని పట్టాభిరామ్‌ ఇంటిపై కొందరు దుండగులు దాడి చేసి, బీభత్సం సృష్టించారు. కాసేపటికి మంగళగిరి సమీపంలో, డీజీపీ కార్యాలయానికి అత్యంత దగ్గర్లో ఉన్న తెదేపా జాతీయ కార్యాలయంపై పదుల సంఖ్యలో దుండగులు విరుచుకుపడి విశృంఖలంగా దాడికి పాల్పడ్డారు. భయానక వాతావరణం సృష్టించారు. పార్టీ నాయకుడు దొరబాబుతో పాటు మరో ముగ్గురు కార్యాలయ సిబ్బందిని తీవ్రంగా గాయపరిచారు. ఈ దాడిని ముందే పసిగట్టిన తెదేపా కార్యాలయ వర్గాలు ఫిర్యాదు చేసినా పోలీసులు స్పందించలేదు. డీజీపీ కార్యాలయానికి కొన్ని మీటర్ల దూరంలోనే ఇంత బీభత్సం జరుగుతున్నా... పోలీసులు రాలేదు. చేయాల్సిన విధ్వంసమంతా చేసి, అల్లరిమూకలు తీరిగ్గా వాహనాలు ఎక్కి వెళ్లిపోయాక అప్పుడు పోలీసులు వచ్చారు.

తెదేపా కేంద్ర కార్యాలయంపై అల్లరి మూకలు విరుచుకుపడ్డ సమయానికే.. విశాఖ, నెల్లూరు, చిత్తూరు వంటి చోట్ల తెదేపా కార్యాలయాలపైనా, నేతలపైనా వైకాపా నాయకులు, కార్యకర్తలు దాడికి యత్నించారు. కొన్ని చోట్ల తెదేపా నాయకుల చొక్కాలు చించేయడం వంటి ఘటనలు జరిగాయి. హిందూపురంలో ఎమ్మెల్యే బాలకృష్ణ ఇంటిని వైకాపా నాయకులు ముట్టడించారు. ప్రొద్దుటూరులో మాజీ ఎమ్మెల్యే లింగారెడ్డి ఇంటి ముందు వైకాపా నేతలు ధర్నాకు దిగారు.

కేంద్ర బలగాల రక్షణ కావాలి

పార్టీ కార్యాలయంపై దాడి జరుగుతున్న సమయానికి తెదేపా అధినేత చంద్రబాబు ఉండవల్లిలోని తన నివాసంలో ఉన్నారు. దాడి సమాచారం తెలిసిన వెంటనే ఆయన డీజీపీకి ఫోన్‌ చేశారు. ఆయన స్పందించకపోవడంతో... చంద్రబాబు రాష్ట్ర గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌షాకు ఫోన్‌ చేసి పరిస్థితిని వివరించారు. పార్టీ కార్యాలయాలకు కేంద్ర బలగాల రక్షణ కోరారు. ఆయన హుటాహుటిన పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ జరిగిన బీభత్సాన్ని పరిశీలించాక... విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రపతి పాలనకు తాను వ్యతిరేకమంటూనే... ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్‌ చేశారు. బుధవారం రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చారు. తెదేపా ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ విశాఖ పర్యటన రద్దు చేసుకుని, రాత్రి 9 గంటల సమయానికి పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. పార్టీ కార్యాలయంపై దాడులకు నిరసనగా తెదేపా నాయకులు, కార్యకర్తలు జాతీయ రహదారిపై రెండు దఫాలుగా రాస్తారోకో చేశారు.

దాడుల్ని ఖండించిన విపక్ష పార్టీలు

తెదేపా కార్యాలయాలపై దాడుల్ని వైకాపా తప్ప అన్ని ప్రతిపక్ష పార్టీలు ఖండించాయి. భాజపా, కాంగ్రెస్‌, జనసేన, వామపక్ష పార్టీలు తెదేపాకి సంఘీభావం ప్రకటించాయి.

చవకబారు రాజకీయాలకు మేం వ్యతిరేకం: వైకాపా

చవకబారు, తెరచాటు రాజకీయాలకు ముఖ్యమంత్రి జగన్‌ వ్యతిరేకమని, ఆయన రాజకీయం నేరుగానే ఉంటుందని వైకాపా ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. ‘మాకు మాట్లాడే స్వేచ్ఛ లేదా అని తెదేపా నాయకులు అడుగుతున్నారు. బూతులు తిట్టడాన్నీ మాట్లాడే స్వేచ్ఛగా తెదేపా గుర్తిస్తోందా?’ అని ధ్వజమెత్తారు. బుధవారం నిరసన కార్యక్రమానికి వైకాపా పిలుపునిచ్చింది.


Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని