CM Jagan: ఇది అభిమానుల ప్రతిస్పందన

ప్రధానాంశాలు

CM Jagan: ఇది అభిమానుల ప్రతిస్పందన

తిట్లు వినలేనివారి స్పందన రాష్ట్రమంతటా కనిపించింది
వైషమ్యాలను సృష్టించి, తిట్టించి రాజకీయ లబ్ధి పొందే యత్నం
సీఎం జగన్‌ వ్యాఖ్యలు

ఈనాడు, అమరావతి: టీవీల్లో వచ్చే తిట్లు, అసభ్యపదజాలం వినలేక మనల్ని అభిమానించేవాళ్లు, ప్రేమించేవాళ్లు చూపించిన ప్రతిస్పందన రాష్ట్రమంతా కనిపించిందని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి అన్నారు. ప్రతిపక్షంలో ఉండగా ఏ రోజు ఎవరూ ఇలాంటి మాటలు మాట్లాడలేదు.. అంతటి దారుణమైన బూతులు వీళ్లే తిడతారు.. కావాలని తిట్టించి, వైషమ్యాలు సృష్టించి, తద్వారా రాజకీయ లబ్ధి పొందాలని ఆరాటం కనిపిస్తోందని విమర్శించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో బుధవారం ‘జగనన్న తోడు’ పథకం కింద 2020 నవంబరు నుంచి 2021 సెప్టెంబరు 30 వరకు రుణాలు తీసుకుని, సకాలంలో చెల్లించిన 4.50 లక్షల మంది లబ్ధిదారుల ఖాతాల్లో రూ.16.36 కోట్ల వడ్డీని కంప్యూటర్‌ బటన్‌ నొక్కి, జమ చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ‘ప్రజలు ప్రేమ, ఆప్యాయతలు చూపుతుంటే ప్రతిపక్షం జీర్ణించుకోలేకపోతోంది. అందుకే అసత్యాలు ప్రచారం చేస్తారు.

మత విద్వేషాలను రెచ్చగొట్టడానికీ వెనుకాడరు. కులాలు, మతాల మధ్య చిచ్చుపెడతారు. వ్యవస్థలను పూర్తిగా మేనేజ్‌ చేస్తున్న పరిస్థితులు మన కళ్ల ముందే కనిపిస్తున్నాయి. పేదవాడికి మంచి జరగకూడదు.. జరిగితే ఎక్కడ జగన్‌కు మంచి పేరు వస్తుందేమోనని దాన్ని ఆపేందుకు కోర్టుల్లో రకరకాల కేసులు వీళ్లే వేయిస్తారు. ఇలాంటి అన్యాయమైన పరిస్థితులున్నా దేవుడి దయ, మీ అందరి చల్లని దీవెనలతో ఈ రెండున్నరేళ్ల పరిపాలన సంతృప్తినిచ్చే విధంగా చేయగలిగాను. ఇంకా మంచి చేస్తానని తెలియజేస్తున్నాను’ అని వెల్లడించారు. ‘మీరిచ్చిన ఈ అధికారంతో ఇప్పటికే సచివాలయ, వాలంటీర్‌ వ్యవస్థను తీసుకొచ్చి, ఎక్కడ వివక్ష, అవినీతి లేకుండా నేరుగా లబ్ధిదారు ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నాం. అందరి చల్లని దీవెనలతో సాగిన పరిపాలన మీ అందరికీ నచ్చినందున పంచాయతీ ఎన్నికల నుంచి పురపాలక, పరిషత్‌, తిరుపతి ఉప ఎన్నిక ఇలా ప్రతి ఎన్నికలోనూ ప్రతిపక్షానికి స్థానమే లేకుండా చేశారు’ అని జగన్‌ పేర్కొన్నారు.  


ఏడాదికి రెండు దఫాలుగా..

‘చిరు వ్యాపారులు వడ్డీ వ్యాపారులకు దగ్గరకు వెళ్లి రూ.వెయ్యి అప్పు తీసుకుంటే సాయంత్రానికి రూ.వంద కడుతున్నారు. ఇలాంటి పరిస్థితులను పాదయాత్రలో చూశాను. వీరికి అండగా ఉండాలన్న ఉద్దేశంతో ‘జగనన్న తోడు’ పథకాన్ని గతేడాది ప్రారంభించాం’ అని సీఎం తెలిపారు. ‘ఏడాదిలో రెండు దఫాలుగా ఒకసారి డిసెంబరులోనూ, మరోసారి జూన్‌లోనూ ఈ కార్యక్రమం నిర్వహిస్తాం. రుణం తీసుకున్న వారి సంవత్సర కాలం డిసెంబరు నాటికి పూర్తయితే ఆ రుణ ఖాతా మూసేసి, వారి వడ్డీ డబ్బులు వెనక్కి ఇస్తాం. మళ్లీ కొత్తగా రుణం మంజూరు చేస్తారు. జూన్‌లోనూ ఏడాది పూర్తయిన వారికి మళ్లీ రెన్యువల్‌ చేస్తారు. సుమారు 9,05,458 మందికి రూ.10 వేల చొప్పున రూ.905 కోట్లు వడ్డీలేని రుణాలు ఇచ్చాం. వాళ్లు వడ్డీలు కడితే ప్రభుత్వం దాన్ని తిరిగిస్తుంది. ఎవరైనా రుణాలు కట్టకపోతే ఇప్పుడైనా కట్టండి.. మళ్లీ డిసెంబరు, జూన్‌లోనూ రుణాలు పొందడానికి అవకాశం ఏర్పడుతుంది. వీటిపై ఏవైనా సందేహాలుంటే 0891 2890525 నంబరుకు ఫోన్‌ చేస్తే నివృత్తి చేస్తారు. దాదాపు 5 శాతం బకాయిలు (ఎన్‌పీఏ), 11 శాతం గడువు దాటిన రుణాలు ఉన్నాయని బ్యాంకర్లు చెప్పారు. దీనిలో 100 శాతం రికవరీ ఉండాలి. గ్రామ సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లు, కలెక్టర్లు అందరూ దీనిలో భాగస్వాములవ్వాలి’ అని సూచించారు.


Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని