protests arrests: నిర్బంధాల నడుమ తీవ్ర నిరసన

ప్రధానాంశాలు

protests arrests: నిర్బంధాల నడుమ తీవ్ర నిరసన

ఆంక్షల మధ్యే కొనసాగిన తెదేపా బంద్‌
ఎమ్మెల్యేలు, సీనియర్‌ నేతల గృహ నిర్బంధం

తెదేపా కేంద్ర కార్యాలయంపై అల్లరిమూకల దాడితో రాజుకున్న రాజకీయ వాతావరణం బుధవారం మరింత వేడెక్కింది. కేంద్ర కార్యాలయంలో సృష్టించిన బీభత్సం, రాష్ట్రవ్యాప్తంగా పార్టీ కార్యాలయాలపై వైకాపా నాయకుల దాడి యత్నాలకు నిరసనగా తెదేపా బుధవారం బంద్‌ నిర్వహించింది. బంద్‌ను అడ్డుకునేందుకు వివిధ జిల్లాల్లో తెదేపా ముఖ్య నేతలందర్నీ మంగళవారం రాత్రి నుంచే పోలీసులు గృహనిర్బంధంలో ఉంచారు. పోటీగా అధికార పక్షమూ నిరసనలు చేపట్టింది. సీఎం జగన్‌ను అనుచిత పదజాలంతో దూషించారంటూ పోలీసులు కేసు నమోదుచేసి పట్టాభిరామ్‌ని బుధవారం రాత్రి హైడ్రామా నడుమ అరెస్టు చేశారు. ఇంటి తలుపులు బద్దలుకొట్టి మరీ ఆయనను తీసుకెళ్లారు.

నిర్బంధాల్ని దాటి ఎగసిన నిరసన

ఈనాడు, ఈనాడు డిజిటల్‌ -అమరావతి, యంత్రాంగం: మంగళవారం అర్ధరాత్రి నుంచే ముఖ్య నాయకులు, కార్యకర్తల కదలికలపై నిఘా.. ఇంటి నుంచి అడుగు బయటపెట్టనీయకుండా గృహ నిర్బంధాలు.. నిరసన తెలియజేసేందుకు కూడా వీల్లేకుండా నాయకుల ఇళ్ల వద్ద భారీగా బలగాల మోహరింపు... వాటన్నింటినీ దాటుకుని ముందుకొస్తే అరెస్టులు.. తెదేపా కేంద్ర కార్యాలయం, ఆ పార్టీ నేతల నివాసాలపై దాడులకు నిరసనగా పార్టీ బుధవారం చేపట్టిన బంద్‌ను అడ్డుకునేందుకు పోలీసులు పెట్టిన ఆంక్షలివీ. ఇన్ని నిర్బంధాల మధ్యా తెదేపా నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేపట్టారు. ఆర్టీసీ డిపోల ఎదుట బైఠాయించి బస్సుల్ని అడ్డుకునేందుకు యత్నించారు. పలు చోట్ల వ్యాపార, వాణిజ్య సముదాయాల్ని, విద్యాసంస్థల్ని మూసివేయించారు. ర్యాలీలు, ధర్నాలు, రాస్తారోకోలు, నిరసన ప్రదర్శనలు, సీఎం దిష్టిబొమ్మల దహనాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలుచోట్ల ఉద్రిక్తతలు, తెదేపా నేతలు, పోలీసుల మధ్య వాగ్వాదాలు చోటుచేసుకున్నాయి. తెదేపా ముఖ్య నేతల అరెస్టును నిరసిస్తూ ఆ పార్టీ కార్యకర్తలు పోలీసుస్టేషన్ల వద్ద ధర్నాలు చేశారు.  

తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుణ్ని విశాఖపట్నం చినవాల్తేరులోని ఆయన నివాసంలో నిర్బంధించారు. విజయనగరంలో పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు అశోక్‌ గజపతిరాజు ఇంటి వద్ద పెద్ద ఎత్తున పోలీసుల్ని మోహరించారు. తెదేపా శ్రేణుల్ని బయటకు రానీయకుండా బంగ్లా గేటుకు తాళాలు వేసేశారు. తెదేపా కార్యకర్తలు, పోలీసులకు మధ్య తోపులాట చోటుచేసుకుంది.

ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి భవాని (రాజమహేంద్రవరం), బుచ్చయ్యచౌదరి (రాజమహేంద్రవరం గ్రామీణ), రామరాజు (ఉండి), రామానాయుడు (పాలకొల్లు), గణబాబు (విశాఖ పశ్చిమ), బెందాళం అశోక్‌ (ఇచ్ఛాపురం), వీరాంజనేయస్వామి (కొండపి)లను వారి వారి నివాసాల్లో గృహ నిర్బంధం చేశారు.

మాజీ మంత్రులు అమరనాథరెడ్డి, కళావెంకట్రావు, బండారు సత్యనారాయణమూర్తి, ఎమ్మెల్సీలు రాజసింహులు, బీటెక్‌ రవి, మాజీ ఎమ్మెల్యేలు సుగణమ్మ, లింగారెడ్డి తదితరుల్ని ఇళ్లలో నుంచి రాకుండా నిర్బంధించారు. టీఎన్‌ఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు ప్రణవ్‌గోపాల్‌ను మంగళవారం రాత్రే అరెస్టు చేసి ఎంవీపీ కాలనీ స్టేషన్‌కు తరలించారు.


నిర్బంధాల్ని దాటుకుని..

పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు, అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పోలీసుల నిర్బంధాల నుంచి చాకచక్యంగా తప్పించుకుని బయటపడ్డారు. ర్యాలీలు, నిరసన ప్రదర్శనలు, జాతీయ రహదారులపై బైఠాయింపులు చేశారు.

చింతమనేని ప్రభాకర్‌ను దుగ్గిరాలలోని ఆయన నివాసంలో పోలీసులు నిర్బంధించారు. వారి కన్నుగప్పి జగన్నాథపురంలోని వ్యవసాయ క్షేత్రానికి చేరుకున్న చింతమనేనిని పోలీసులు అక్కడా నిర్బంధించి, బలగాలను మోహరించారు.  

గుంటూరులో మాజీ మంత్రి నక్కా ఆనందబాబును ఇంటి నుంచి బయటకు రానీయకుండా అడ్డుకోవటంతో తెదేపా కార్యకర్తలు, పోలీసులకు మధ్య తోపులాట చోటుచేసుకుంది.
ఉండవల్లిలో తెదేపా మహిళా కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  పోలీసులు తమను అసభ్యపదజాలంతో తిట్టారని, దుస్తులు చించేశారని, రోజంతా వ్యానులో తిప్పడంతో ఆషా అనే కార్యకర్త స్పృహ తప్పారని వారు ఆరోపించారు.


తెదేపా కార్యాలయానికి పోలీసుల తాళం

తెదేపా నాయకులు ఆందోళన చేస్తారనే ఉద్దేశంతో పోలీసులు గుంటూరులోని ఆ పార్టీ జిల్లా కార్యాలయానికి తాళాలు వేయించారు. ‘మీ పోలీసుస్టేషన్‌కు, డీజీపీ కార్యాలయానికి మేం తాళాలు వేస్తే ఊరుకుంటారా?’ అంటూ తెనాలి శ్రవణ్‌కుమార్‌ తదితరులు నిలదీయడంతో ఉద్రిక్తత   నెలకొంది.

అనంతపురంలో జాతీయ రహదారిపై తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు కాలవ శ్రీనివాసులు బైఠాయించగా పోలీసులు అరెస్టు చేశారు. ర్యాలీగా బయల్దేరిన మాజీ మంత్రి పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్‌ను పోలీసులు అడ్డుకోవటంతో వారు రోడ్డుపై బైఠాయించారు.

విజయవాడలో మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, వైకాపా నాయకుడు పైలా సోమినాయుడు వర్గాల మధ్య స్వల్ప ఘర్షణ జరిగింది. మచిలీపట్నంలో మాజీ మంతి కొల్లు రవీంద్ర అరెస్టు సందర్భంగా తోపులాట చోటుచేసుకుంది.


రహదారులపై బైఠాయింపు

విశాఖ జిల్లా తగరపువలస, ఎలమంచిలి వద్ద జాతీయ రహదారిపై రాస్తారోకో, మానవహారం నిర్వహించారు. చిత్తూరు జిల్లా పూతలపట్టు- నాయుడుపేట జాతీయ రహదారిపై నిరసన తెలిపారు. తిరుపతిలోని ఎన్టీఆర్‌ కూడలిలో తెలుగు యువత నేతలు అర్ధనగ్న ప్రదర్శన, గాంధీ విగ్రహం వద్ద తెలుగు మహిళా నేతలు నిరసన చేపట్టారు. విజయనగరం జిల్లా పార్వతీపురంలో ప్రధాన రహదారిపై నిరసన తెలిపారు. తెనాలిలో దుకాణాలు మూయించారు. చిలకలూరిపేటలో నిరసన ప్రదర్శన చేపట్టారు. రావులపాలెంలో జాతీయరహదారిపై సీఎం దిష్టిబొమ్మ దహనం చేశారు.


ఆర్టీసీ డీపోల ఎదుట ఆందోళన

ఎంపీ రామ్మోహన్‌నాయుడు, మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి నేతృత్వంలో శ్రీకాకుళం ఆర్టీసీ బస్టాండ్‌ ఎదుట నిరసన తెలిపారు. పోలీసులు అరెస్టు చేయడంతో ఎంపీకి, పోలీసులకు వాగ్వాదం చోటుచేసుకుంది. ఒంగోలు, మార్కాపురం, కనిగిరి, కందుకూరు, తూర్పుగోదావరి జిల్లా గోకవరం తదితర డిపోల వద్ద బస్సుల్ని అడ్డుకునేందుకు తెదేపా నేతలు యత్నించారు. గుంటూరు, వినుకొండ, మద్దిలపాలెం బస్టాండ్ల వద్ద బస్సుల్ని అడ్డుకున్నారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని