ప్రాంతీయ విద్యుత్‌ కమిటీల రద్దు

ప్రధానాంశాలు

ప్రాంతీయ విద్యుత్‌ కమిటీల రద్దు

కేంద్ర విద్యుత్‌శాఖ కీలక నిర్ణయం
విద్యుత్‌ సరఫరా వ్యవస్థ సత్వర అభివృద్ధికేనని వెల్లడి
ట్రాన్స్‌కోల ప్రమేయాన్ని తగ్గించేందుకేనంటున్న నిపుణులు

ఈనాడు, హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా విద్యుత్‌ సరఫరా వ్యవస్థ అభివృద్ధి, నిర్మాణాల కోసం పనిచేస్తున్న ‘ప్రాంతీయ విద్యుత్‌ కమిటీ’(సరఫరా ప్రణాళికా విభాగం)లను రద్దుచేస్తూ కేంద్ర విద్యుత్‌శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కమిటీల కారణంగా వివిధ రాష్ట్రాల మధ్య విద్యుత్‌ సరఫరా వ్యవస్థల నిర్మాణానికి అవసరమైన పనులు చేపట్టడంలో జాప్యం జరుగుతోందని, అందుకే రద్దుచేస్తున్నామని వెల్లడించింది.

తూర్పు, పశ్చిమ, ఉత్తర, దక్షిణ, ఈశాన్య భారత ప్రాంతాలకు ఈ కమిటీలు వేర్వేరుగా ఉన్నాయి. తెలంగాణ, ఏపీ ట్రాన్స్‌ల సంచాలకులు దక్షిణ భారత ప్రాంతీయ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. వీటి రద్దుతో ఇకపై అంతర్రాష్ట్ర విద్యుత్‌ లైన్ల నిర్మాణం, అభివృద్ధిలో రాష్ట్రాల ట్రాన్స్‌కోల ప్రమేయం ఏమీ ఉండదని, పూర్తిగా కేంద్రం నిర్ణయాల ప్రకారమే పనులు చేపడతారని ఓ సీనియర్‌ అధికారి వివరించారు.

దేశంలో సౌర, పవన విద్యుత్‌ వంటి ‘సంప్రదాయేతర ఇంధనం’(ఆర్‌ఈ) ఉత్పత్తి సామర్థ్యాన్ని 2030 నాటికి 4,30,000 మెగావాట్లకు పెంచాలని(ప్రస్తుతం ఇది లక్షా 3 వేల మెగావాట్లుగా ఉంది) కేంద్రం లక్ష్యంగా నిర్డేశించుకుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో కొత్తగా సౌర, పవన విద్యుదుత్పత్తి కేంద్రం నిర్మించేందుకు 18 నెలలు, దాన్నుంచి విద్యుత్‌ తీసుకోవడానికి అవసరమైన లైన్లను నిర్మించడానికి మరో 18 నుంచి 24 నెలల సమయం పడుతోంది. సాధారణంగా కేంద్ర విద్యుత్‌ మండలి.. ప్రాంతీయ విద్యుత్‌ కమిటీలతో చర్చించి అంతర్రాష్ట్ర విద్యుత్‌ సరఫరా లైన్ల వ్యవస్థల విస్తరణ ప్రణాళికను తయారుచేస్తుంది. ప్రాంతీయ కమిటీల సిఫార్సులను జాతీయ విద్యుత్‌ కమిటీ పరిశీలించి ఆమోదించాక.. కొత్త విద్యుత్‌ లైన్ల నిర్మాణం జరగాలనేది ఇంతకాలంగా ఉన్న నిబంధన. ‘ప్రాంతీయ కమిటీలను 2005లో అప్పటి అవసరాలనుబట్టి ఏర్పాటుచేశారు. ప్రస్తుతం  సంప్రదాయేతర ఇంధన కేంద్రాల నిర్మాణం శరవేగంగా జరుగుతున్నందున విద్యుత్‌ సరఫరా వ్యవస్థను వేగంగా విస్తరించాల్సి ఉంది. ప్రాంతీయ కమిటీలతో సంబంధం లేకుండా జాతీయ విద్యుత్‌ కమిటీ నిర్ణయాలు తీసుకోవాల్సి ఉన్నందునే వాటిని రద్దుచేస్తున్నట్లు’ కేంద్రం తెలిపింది.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని