వాల్మీకి, బోయలను ఎస్టీ జాబితాలో చేర్చాలి

ప్రధానాంశాలు

వాల్మీకి, బోయలను ఎస్టీ జాబితాలో చేర్చాలి

ప్రధాని మోదీకి తెదేపా అధినేత చంద్రబాబు లేఖ

ఈనాడు డిజిటల్‌, అమరావతి: వాల్మీకి/బోయ సామాజిక వర్గాన్ని ఎస్టీ జాబితాలో చేర్చాలని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు ప్రధాని మోదీకి లేఖ రాశారు. ఇప్పటికే కర్ణాటకలో ఎస్టీల్లో చేర్చారని, ఆంధ్రప్రదేశ్‌లో వారి పరిస్థితి గందరగోళంగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఏపీలో మైదాన ప్రాంతాల్లో నివసించే వాల్మీకి/బోయలు పేదరికంతో బాధపడుతున్నారని, వీరిని ఎస్టీ జాబితాలో చేర్చాలని తెదేపా హయాంలో శాసనసభలో తీర్మానం చేసి 2017 డిసెంబరు 15న కేంద్ర ప్రభుత్వానికి పంపించినట్లు వివరించారు. ఈ ప్రతిపాదన పెండింగ్‌లోనే ఉందని, పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టి ఎస్టీలుగా గుర్తించాలని కోరారు. ‘‘రాష్ట్రంలో 2016లో వాల్మీకి/బోయ సామాజికవర్గ స్థితిగతులపై సమగ్ర అధ్యయనం చేసేందుకు ప్రొఫెసర్‌ సత్యపాల్‌ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేశాం. వారిని ఎస్టీలుగా గుర్తించడంలో ఆలస్యం జరిగిందని కమిటీ గుర్తించింది. ఏపీ ఎస్సీ,ఎస్టీ కమిషన్‌ వివిధ జిల్లాల్లో పర్యటించి ఎస్టీల్లో చేర్చాల్సిన అవసరముందని నిర్ధారించింది. 1961లో సెన్సస్‌ కమిషన్‌కు చెందిన డిప్యూటీ రిజిస్ట్రార్‌ జనరల్‌ రాయ్‌ బర్మన్‌.. ఎస్టీలుగా గుర్తించాలని సిఫారసు చేసింది. అనంతరామ్‌ కమిషన్‌ ఇదే తరహాలో సిఫారసు చేసినా ఎస్టీ జాబితాలో చేర్చలేదు. రాయలసీమ, కోస్తాంధ్రలోని వాల్మీకి/బోయలు ఒకటేనని పేర్కొంటూ 1964లో ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 1968లో వారిని ప్రాంతాలతో సంబంధం లేకుండా ఎస్టీ జాబితాలో చేర్చారు. ఏజెన్సీ ప్రాంతంలో నివసించే వారు మాత్రమే ఎస్టీ పరిధిలోకి వస్తారంటూ 1977లో అప్పటి ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. ఈ నిర్ణయం వివిధ ప్రాంతాల్లో నివసించే బోయల మధ్య విభేదాలకు దారి తీసింది. సమస్యను శాస్త్రీయంగా పరిష్కరించేందుకు తెదేపా ప్రభుత్వం ప్రయత్నించింది. వారి దశాబ్దాల పోరాటానికి సంఘీభావంగా ఎస్టీ జాబితాలో చేర్చాలని తెదేపా కృతనిశ్చయంతో ఉంది. మహర్షి వాల్మీకి జయంతి సందర్భంగా మా అభ్యర్థనకు సానుకూల స్పందన వస్తుందని ఆశిస్తున్నా’’ అని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని