ఎన్నికలు జరగని స్థానిక సంస్థలకు వచ్చే వారం నోటిఫికేషన్‌

ప్రధానాంశాలు

ఎన్నికలు జరగని స్థానిక సంస్థలకు వచ్చే వారం నోటిఫికేషన్‌

రాజకీయ పార్టీలతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ భేటీ

ఈనాడు డిజిటల్‌- అమరావతి: కోర్టు కేసులు, అభ్యర్థుల మరణం తదితర కారణాలతో నిలిచిపోయిన స్థానిక సంస్థల ఎన్నికలకు వచ్చే వారం నోటిఫికేషన్‌ వెలువడే అవకాశముంది. నవంబరు రెండో వారంలోగా ప్రక్రియ ముగిసే అవకాశమున్నట్లు సమాచారం. ఈమేరకు ఆయా రాజకీయ పార్టీలతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌(ఎస్‌ఈసీ) నీలం సాహ్ని బుధవారం విజయవాడలో సమావేశమయ్యారు. వైకాపా, తెదేపా, జనసేన, భాజపా, కాంగ్రెస్‌, సీపీఐ, సీపీఎం, ఆప్‌, ముస్లింలీగ్‌, జనతాదళ్‌(యు)ల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నీలం సాహ్ని మాట్లాడుతూ... స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు. తెదేపా ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణ రాజు మాట్లాడుతూ... నామినేషన్లు ఆన్‌లైన్‌ విధానంలో దాఖలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. గతంలో పుంగనూరు, మాచర్ల తదితర ప్రాంతాల్లో విపక్షాల నుంచి ఒక్క నామినేషన్‌ వేయలేని పరిస్థితి నెలకొందని, ఇది ఎన్నికల సంఘం వైఫల్యమేనన్నారు. ఎన్నికల బూత్‌ 200 మీటర్ల పరిధిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. గత ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఫిర్యాదులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని గుర్తుచేశారు. ‘‘ఆన్‌లైన్‌లో నామినేషన్‌ దాఖలు చేసేందుకు తెలంగాణలో యాప్‌ అభివృద్ధి చేస్తున్నారు. దాన్ని పరిశీలిస్తున్నాం. అయితే ప్రస్తుత స్వల్ప వ్యవధిలో ఈ విధానం అమలు సాధ్యం కాకపోవచ్చు. ఫిర్యాదులను మెయిల్‌, ఫోన్‌, నేరుగా కూడా చేయొచ్చు’’ అని ఎస్‌ఈసీ బదులిచ్చారు.

వ్యవస్థపై నమ్మకం పోయింది

కొందరు ఉద్యోగులు, ముఖ్యంగా వాలంటీర్లు ప్రభుత్వానికి అనుకూలంగా ప్రచారం చేస్తున్నారని సీపీఐ ప్రతినిధి అక్కినేని వనజ ప్రస్తావించారు. గత ఎన్నికల సందర్భంగా జరిగిన పరిణామాలతో తమకు వ్యవస్థపై నమ్మకం పోయిందన్నారు. ఆధారాలతో ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని ఎస్‌ఈసీ హామీ ఇచ్చారు. ఎన్నికలు నిస్పక్షపాతంగా జరిగేలా చూడాలని, ఫిర్యాదులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్‌ ప్రతినిధి ఎన్‌.నరసింహారావు కోరారు.


సీఎస్‌తో ఎన్నికల కమిషనర్‌ సమావేశం

వివిధ కారణాలతో నిలిచిపోయిన స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నీలం సాహ్ని... ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మతో వర్చువల్‌గా చర్చించారు. శాంతిభద్రతల అదనపు డీజీ రవిశంకర్‌ అయ్యన్నార్‌తోనూ మాట్లాడినట్లు అధికారులు తెలిపారు.

ఎన్నికలు నిర్వహించాల్సిన స్థానాలు: నెల్లూరు మున్సిపల్‌ కార్పొరేషన్‌, 12 మున్సిపాలిటీలు, 14 జడ్పీటీసీలు, 176 ఎంపీటీసీలు, 71 సర్పంచులు, 533 వార్డు సభ్యుల స్థానాలు.

ఎన్నికలు నిర్వహించనున్న జడ్పీటీసీ స్థానాలు: హీరా(శ్రీకాకుళం), ఆనందపురం(విశాఖపట్నం), పెనుగొండ(పశ్చిమగోదావరి), విస్సన్నపేట, జి.కొండూరు, పెడన(కృష్ణా జిల్లా), శావల్యాపురం, కారంపూడి(గుంటూరు), బంగారుపాలెం, కలకడ(చిత్తూరు), చిలమతూరు(అనంతపురం), నంద్యాల, కొలిమిగుండ్ల(కర్నూలు), లింగాల(కడప).

మున్సిపాలిటీలు: బుచ్చిరెడ్డిపాలెం(నెల్లూరు), ఆకివీడు(పశ్చిమగోదావరి), జగ్గయ్యపేట, కొండపల్లి(కృష్ణా), దాచేపల్లి, గురజాల(గుంటూరు), దర్శి(ప్రకాశం), కుప్పం(చిత్తూరు), బేతంచెర్ల(కర్నూలు), కమలాపురం, రాజంపేట(కడప), పెనుకొండ(అనంతపురం).


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని