దాడి ఘటనలో 70 మంది వైకాపా కార్యకర్తలపై కేసు

ప్రధానాంశాలు

దాడి ఘటనలో 70 మంది వైకాపా కార్యకర్తలపై కేసు

ఈనాడు,అమరావతి, న్యూస్‌టుడే,మంగళగిరి: తెదేపా కేంద్ర కార్యాలయంపై దాడి ఘటనలో 70 మంది వైకాపా కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదుచేశారు. తెదేపా నాలెడ్జ్‌ సెంటర్‌లో ఐటీ ఉద్యోగిగా పనిచేస్తున్న పి.సాయిబద్రీనాథ్‌ ఫిర్యాదు మేరకు ఈ కేసు పెట్టారు. నిందితుల పేర్లను మాత్రం ఎఫ్‌ఐఆర్‌లో ప్రస్తావించలేదు. తనను చంపేందుకు వైకాపా కార్యకర్తలు ప్రయత్నించారని ఫిర్యాదుదారుడు పేర్కొన్నా.. నిందితులపై హత్యాయత్నం సెక్షన్లను వర్తింపజేయలేదు. అల్లర్లకు పాల్పడ్డారని, మారణాయుధాలతో ప్రదర్శన చేశారని, అక్రమ చొరబాటుకు పాల్పడ్డారని, పలువుర్ని గాయపరిచారన్న అభియోగాలపై ఐపీసీలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదుచేశారు. ‘నేను కార్యాలయంలో ఉండగా 70 మందికి పైగా వైకాపా కార్యకర్తలు మారణాయుధాలతో ప్రవేశించారు. గేటు వద్ద ఉన్న సెక్యూరిటీ సిబ్బందిని నెట్టేసి చొరబడ్డారు. కొందరు రాళ్లు, సుత్తులు, కర్రలు, హాకీబ్యాట్లతో వచ్చి అద్దాలు, ఫర్నిచర్‌ ధ్వంసం చేశారు. అడ్డుకున్న వారిపై మారణాయుధాలతో దాడిచేశారు. రక్తమొచ్చేలా నన్ను గాయపరిచారు. చంపేందుకు ప్రయత్నించారు. దీంతో నేను స్పృహ కోల్పోయాను’ అని ఫిర్యాదులో సాయిబద్రీనాథ్‌ పేర్కొన్నారు.


వారే దాడికి దిశా నిర్దేశం చేశారు: తెదేపా ఫిర్యాదు

తెదేపా కేంద్ర కార్యాలయం సహా రాష్ట్రంలోని పలుప్రాంతాల్లో ఉన్న తమ పార్టీ కార్యాలయాలపై ఒకే సమయంలో దాడులు జరగటం వెనుక కుట్ర ఉందని, అందుకు బాధ్యులైన వారిపై కేసులు నమోదు చేయాలని కోరుతూ తెదేపా రిసెప్షన్‌ కమిటీ సభ్యుడు వి.కుమారస్వామి మంగళగిరి గ్రామీణ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తెదేపా కేంద్ర కార్యాలయంపై దాడికి కొద్దిసేపు ముందు... దాడికి పాల్పడిన వారికి ఎంపీ నందిగం సురేష్‌, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, వైకాపా నాయకుడు దేవినేని అవినాష్‌ దిశానిర్దేశం చేశారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. తెదేపా కార్యాలయంపై దాడి జరిగిన సమయంలో ఓ వ్యక్తి లోపలికి ప్రవేశించారని అతనిపై కేసు నమోదు చేయాలని కోరారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని