రుణ ఒప్పందాల్లో గవర్నర్‌ పేరును ఎలా చేరుస్తారు?

ప్రధానాంశాలు

రుణ ఒప్పందాల్లో గవర్నర్‌ పేరును ఎలా చేరుస్తారు?

‘ఏపీఎస్‌డీసీ’పై కౌంటర్‌ వేయాలని కేంద్రానికి హైకోర్టు ఆదేశం
రాష్ట్ర ఆదాయాన్ని కన్సాలిడేటెడ్‌ నిధిలో జమ చేయకపోవడం సరికాదని వ్యాఖ్య

ఈనాడు, అమరావతి: ఏపీ రాష్ట్రాభివృద్ధి కార్పొరేషన్‌ (ఏపీఎస్‌డీసీ) ఏర్పాటు, రుణాలు పొందుతున్న వ్యవహారంపై దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాల్లో కౌంటర్‌ దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశిస్తూ నోటీసులు జారీచేసింది. పన్నుల రూపంలో వస్తున్న రాష్ట్ర ప్రభుత్వ ఆదాయాన్ని కన్సాలిడేటెడ్‌ ఫండ్‌లో జమ చేయకుండా నేరుగా ఏపీఎస్‌డీసీకి మళ్లించడం సరికాదని వ్యాఖ్యానించింది. నిధుల బదిలీకి సంబంధించిన రికార్డులను కోర్టు ముందుంచాలని రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టంచేసింది. ఏపీఎస్‌డీసీ ద్వారా బ్యాంకుల నుంచి రూ.25 వేల కోట్ల రుణం తీసుకునేందుకు ప్రభుత్వం చేసుకున్న ఒప్పందంలో గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ పేరును వ్యక్తిగతంగా ఎలా చేరుస్తారని ప్రశ్నించింది. గవర్నర్‌ పేరుతో చేసుకున్న ఇలాంటి ఒప్పందం చెల్లకుండా పోయే అవకాశం ఉందంది. దావాలు, క్రిమినల్‌ కేసుల నమోదు నుంచి అధికరణ 361 ప్రకారం గవర్నర్‌కు రక్షణ ఉన్నట్లు గుర్తుచేసింది. ఒప్పందం ద్వారా గవర్నర్‌కు ఉన్న సార్వభౌమాధికారాన్ని తొలగించడం సరికాదంది. రాజకీయ నాయకులు దాఖలు చేస్తున్న ప్రజాహిత వ్యాజ్యాలను తాము నిలువరించలేమంది. ఏ పార్టీల నేతలు వ్యాజ్యాలు వేశారనే అంశంతో తమకు సంబంధం లేదని, అందులోని అంశాలను పరిగణనలోకి తీసుకొని, విచారణ చేస్తామని తెలిపింది. ప్రస్తుత విచారణను నవంబరు 15కు వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్ర, న్యాయమూర్తి జస్టిస్‌ సి.ప్రవీణ్‌కుమార్‌తో కూడిన ధర్మాసనం గురువారం ఈమేరకు ఆదేశాలిచ్చింది.

పన్నుల ద్వారా వస్తున్న ప్రభుత్వ ఆదాయాన్ని కన్సాలిడేటెడ్‌ ఫండ్‌లో జమ చేయకుండా నేరుగా ఏపీఎస్‌డీసీకి మళ్లిస్తున్నారని తెదేపా ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు హైకోర్టులో పిల్‌ వేసిన విషయం తెలిసిందే. ఏపీఎస్‌డీసీకి రుణం పొందే చట్టబద్ధ హోదా కల్పిస్తున్న ఏపీ రాష్ట్రాభివృద్ధి కార్పొరేషన్‌ చట్టం-2020లోని సెక్షన్‌ 3(3), 4లను రద్దు చేయాలని కోరుతూ విజయవాడకు చెందిన కె.హిమబిందు మరో పిల్‌ దాఖలు చేశారు. ఏపీఎస్‌డీసీ తీసుకునే రుణాల చెల్లింపు విషయమై 2020 నవంబరు 5న చేసుకున్న ఎస్క్రో ఒప్పందాన్ని సవాలు చేస్తూ తెనాలికి చెందిన ఎం.వెంకటగ్రీష్మకుమార్‌ ఇంకో పిల్‌ వేశారు.

గురువారం జరిగిన విచారణలో పిటిషనర్ల తరఫు న్యాయవాదులు బాలాజీ వడేరా, బి.నళిన్‌కుమార్‌, గూడపాటి వెంకటేశ్వరరావు వాదనలు వినిపించారు. ‘నిబంధనలకు విరుద్ధంగా ఏపీఎస్‌డీసీ ద్వారా ప్రభుత్వం రూ.25 వేల కోట్లను బ్యాంకుల నుంచి రుణం పొందింది. విశాఖలోని కలెక్టర్‌, తహసీల్దార్‌ తదితర ప్రభుత్వ కార్యాలయాలను తనఖా పెట్టారు. బ్యాంకులతో చేసుకున్న ఒప్పందంలో గవర్నర్‌ పేరును వ్యక్తిగతంగా ప్రస్తావించారు. గవర్నర్‌కు ఉన్న సార్వభౌమాధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వం వదులుకుంది. రుణం తీర్చేందుకు గవర్నర్‌ను హామీదారుగా పేర్కొన్నారన్నారు’ అని తెలిపారు. ప్రభుత్వం తరఫున ఏజీ ఎస్‌.శ్రీరామ్‌ వాదనలు వినిపిస్తూ... ప్రభుత్వానికి వచ్చే ఆదాయాన్ని మొదట కన్సాలిడేటెడ్‌ ఫండ్‌లోనే జమ చేస్తున్నామన్నారు. రికార్డులను కోర్టు ముందు ఉంచేందుకు సిద్ధమన్నారు. రాజకీయ కారణాలతో ఈ వ్యాజ్యాల్ని దాఖలు చేశారన్నారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని