‘ఆ’ పదానికి చాలా అర్థాలున్నాయి

ప్రధానాంశాలు

‘ఆ’ పదానికి చాలా అర్థాలున్నాయి

గుజరాత్‌లోని ఓ గ్రామం పేరు అదే
అమాయకుల్నీ ఇలా సంబోధిస్తారు
కొత్త భాష్యాలు చెప్పడానికి  ప్రయత్నించి భంగపడిన సీఎం
తెదేపా నేత పయ్యావుల కేశవ్‌

ఈనాడు, అమరావతి: వైకాపా నేతలు అభ్యంతరం చెబుతున్న ‘ఆ’ పదానికి చాలా అర్థాలున్నా.. కొత్త భాష్యాలు చెప్పడానికి ప్రయత్నించి ముఖ్యమంత్రి జగన్‌ భంగపడ్డారని తెదేపా ప్రధాన కార్యదర్శి పయ్యావుల కేశవ్‌ విమర్శించారు. పోలీసు అమరవీరుల దినోత్సవంలో మాట్లాడిన సీఎం.. తాము, తమ పార్టీ అనని మాటల్ని అన్నట్లుగా వక్రీకరించారన్నారు. గురువారం ఆయన తెదేపా కేంద్ర కార్యాలయంలో విలేకర్లతో మాట్లాడారు. ‘ముఖ్యమంత్రో.. నేనో చెప్పిందే అర్థం కిందకు రాదు. అది గుజరాత్‌లోని ఒక గ్రామం పేరు. బ్రిటిష్‌వారు అమాయకులను ఈ పదంతో సంబోధించేవారు. మీరు బాగున్నారా? అనే అర్థమూ ఉంది’ అని వివరించారు. ‘అన్నం పెట్టే రైతుల్ని మంత్రులు అనరాని మాటలు అన్నారు. వారిని సీఎం ఎందుకు వారించలేదు? రైతులు, వారి తల్లుల్ని మంత్రులు దూషిస్తే సీఎంకు బాధ అనిపించలేదా?’ అని నిలదీశారు.

దాడిలో 10 మంది పోలీసుల ప్రమేయం

తెదేపా కేంద్ర కార్యాలయంపై దాడిలో పదిమంది పోలీసులు ఉన్నారనే సమాచారం తమకు ఉందని కేశవ్‌ చెప్పారు. ‘డీజీపీ కార్యాలయ పీఆర్వో మా పార్టీ నాయకులకు పట్టుబడినప్పుడే.. ఎవరి ప్రమేయం ఉందో స్పష్టమైంది. అతన్ని యాంటీనక్సల్స్‌ విభాగంలో పనిచేసే వ్యక్తిగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు. ఆయనపై దాడి చేశామని తప్పుడు కేసులు పెట్టారు. ఎంత గౌరవంగా సాగనంపామో సీసీటీవీ ఫుటేజి చూస్తే తెలుస్తుంది. అది న్యాయస్థానంలో ప్రవేశపెడితే పోలీసుశాఖ తలెత్తుకోలేదు. దాడికి వచ్చినవారిని డీఎస్పీ దగ్గరుండి వాహనాల్లోకి ఎక్కించి సాగనంపడం ఏంటి?’ అని ప్రశ్నించారు. ‘లోకేశ్‌పై పెట్టిన సెక్షన్లు, నమోదుచేసిన ఎఫ్‌ఐఆర్‌ చూస్తుంటే.. పోలీసులకు భంగపాటు తప్పదనిపిస్తోంది. రాత్రి 8.30కు ఆయన కార్యాలయానికి వస్తే.. సాయంత్రం 6.30కు దాడి చేశారన్నారు. ఈ కేసు మూలాలను తేల్చడానికి అవసరమైతే సీబీఐ విచారణ చేయించాలి. అన్ని సెల్‌టవర్ల పరిధిలో కాల్‌ రికార్డ్స్‌ నమోదుచేయాలి’ అని డిమాండు చేశారు.

ఆ పోలీసులు ఏపీ పేరెందుకు చెబుతున్నారు?

మాదకద్రవ్యాల దందాలో ఏపీ పేరు ఎందుకు నానుతోందో, పక్క రాష్ట్రాల పోలీసులు పదేపదే ఏపీ పేరెందుకు చెబుతున్నారో.. ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని కేశవ్‌ డిమాండు చేశారు. ‘పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గంజాయి రవాణా, అమ్మకంపై కఠినచర్యలు తీసుకుంటుంటే.. ఈ ముఖ్యమంత్రి మాత్రం వాటి గురించి మాట్లాడేవారిపై అక్రమ కేసులు పెట్టి జైళ్లకు పంపిస్తూ రాక్షసానందం పొందుతున్నారు’ అని దుయ్యబట్టారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని