Vaccination: శతకోటి టీకాభివందనం

ప్రధానాంశాలు

Vaccination: శతకోటి టీకాభివందనం

100 కోట్ల డోసుల మైలురాయి దాటిన భారత్‌
కొవిడ్‌ వ్యాక్సిన్‌ పంపిణీలో కీలక మలుపు
చరిత్రాత్మక ఘట్టంగా అభివర్ణించిన ప్రధాని మోదీ
అభినందనలు తెలిపిన భారత్‌ బయోటెక్‌
10, 13 స్థానాల్లో తెలుగు రాష్ట్రాలు

ఈనాడు, దిల్లీ: భారత్‌ మరో అధ్యాయం లిఖించింది. కొవిడ్‌ టీకా పంపిణీ కార్యక్రమం గురువారం వంద కోట్ల డోసుల మైలురాయిని అధిగమించింది. జనవరి 16న మొదలైన ఈ ప్రస్థానం... 279వ రోజున శతకోటి మలుపు చేరుకొంది. దీంతో నిత్యం సగటున 35,84,223 మందికి కొవిడ్‌ వ్యాక్సిన్‌ అందించినట్టయింది. ఇప్పటివరకూ సుమారు 70% మందికి ఒక డోసు, 31% మందికి రెండు డోసులు పూర్తయినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. కేంద్రం సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌ ప్రకారం... దేశంలో కొవిడ్‌ టీకా పొందేందుకు అర్హులైనవారి జనాభా 94,47,09,596. వీరందరికీ మొత్తం 188,94,19,192 డోసులు ఇవ్వాలి. ఈ లెక్కన ఇంకా 47.07% దూరం ప్రయాణించాల్సి ఉంది. దేశంలో అత్యధిక టీకాలు అందించిన తొలి రాష్ట్రాల్లో ఉత్తర్‌ప్రదేశ్‌, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్‌ నిలిచాయి. ఆంధ్రప్రదేశ్‌ 10వ స్థానంలో, తెలంగాణ 13వ ర్యాంకులో ఉన్నాయి.

టీకా కార్యక్రమం వంద కోట్ల మైలురాయిని దాటిన వెంటనే ప్రధాని మోదీ దిల్లీలోని రామ్‌మనోహర్‌ లోహియా ఆసుపత్రిని సందర్శించారు. అక్కడి వైద్య సిబ్బందిని అభినందించారు. దేశం శతకోటి మార్కును అధిగమించడాన్ని ఆయన చారిత్రక ఘట్టంగా అభివర్ణించారు. ‘‘భారత శాస్త్రసాంకేతిక, పారిశ్రామిక రంగాలు, 130 కోట్ల ప్రజల సంయుక్త స్ఫూర్తి సాధించిన ఘన విజయాన్ని మనమిప్పుడు చూస్తున్నాం. దేశం 100 కోట్ల డోసుల వ్యాక్సినేషన్‌ను దాటినందుకు అభినందిస్తున్నా. వైద్యులు, నర్సులు సహా ఈ గమ్యం చేరుకోవడానికి తోడ్పడిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. దేశ ప్రజలకు సురక్షిత కవచం లభించింది. ఆరోగ్య సేవలను మెరుగుపరిచేందుకు కార్పొరేట్‌, ప్రైవేటు, సామాజిక సంస్థలు ఎనలేని కృషి చేస్తున్నాయి. జిల్లాకో వైద్య కళాశాల ఏర్పాటులో ప్రైవేటు రంగానిదే కీలకపాత్ర’’ అని పేర్కొన్నారు. వ్యాక్సిన్‌ తీసుకునేందుకు ఆసుపత్రికి వచ్చిన దివ్యాంగురాలు ఛావి అగర్వాల్‌(25)... అటుగా వెళ్తున్న మోదీని చూసి ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. పట్టలేని సంతోషంతో ప్రధానిని గట్టిగా పిలిచారు! దీంతో మోదీ వెనక్కి తిరిగి చూసి, ఆమె వద్దకు వచ్చారు. కాసేపు ఛావితో ముచ్చటించారు.

ఎర్రకోట వద్ద భారీ త్రివర్ణ పతాకం

వంద కోట్ల మార్కును పురస్కరించుకుని దిల్లీలోని ఎర్రకోట వద్ద ఏర్పాటుచేసిన కార్యక్రమంలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ ప్రత్యేక గీతాన్ని, ఆడియో-విజువల్‌ చిత్రాన్ని ఆవిష్కరించారు. ప్రఖ్యాత గాయకుడు కైలాశ్‌ ఖేర్‌.. ‘టీకే సే బచా హై దేశ్‌’ అంటూ ఈ పాటను ఆలపించారు. ఎర్రకోట వద్ద 1,400 కిలోల బరువున్న భారీ ఖద్దరు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. దీని పొడవు 225 అడుగులు కాగా, వెడల్పు 150 అడుగులు. దిల్లీ విమానాశ్రయంలో స్పైస్‌జెట్‌ తన బోయింగ్‌ 737 విమానంపై మోదీ, ఆరోగ్య సిబ్బంది చిత్రాలతో ప్రత్యేక లైవరీని ఆవిష్కరించింది. భారత్‌ వంద కోట్ల టీకా డోసులను అందించిందంటూ ఫోన్లలో కాలర్‌ ట్యూన్లు వినిపించాయి. ప్రభుత్వ ఆసుపత్రుల వద్ద ‘మైల్‌స్టోన్‌’ బ్యానర్లు కనిపించాయి. దేశంలోని వంద వారసత్వ కట్టడాల వద్ద పురావస్తుశాఖ మువ్వన్నెల కాంతులను ప్రదర్శించింది. దేశం వంద కోట్ల టీకా డోసులను అధిగమించిందని రైల్వేస్టేషన్లలో ప్రకటించారు.

* ప్రధాని నాయకత్వంలో భారత్‌ ఈ ఘనతను నమోదు చేసిందని సీరం ఇన్‌స్టిట్యూట్‌ సీఈవో అదర్‌ పూనావాలా పేర్కొన్నారు.


అరుదైన ఘనతలో భాగస్వామి అయ్యాం
- భారత్‌ బయోటెక్‌ సీఎండీ డాక్టర్‌ కృష్ణ ఎల్ల

ఈనాడు, హైదరాబాద్‌: కేవలం తొమ్మిది నెలల వ్యవధిలోనే వంద కోట్ల కొవిడ్‌ టీకా డోసుల మైలురాయిని చేరుకోవడం ద్వారా... మన దేశం గొప్ప ఖ్యాతిని సొంతం చేసుకుందని భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌ సీఎండీ డాక్టర్‌ కృష్ణ ఎల్ల పేర్కొన్నారు. ఈ ఘనతలో కొవాగ్జిన్‌ టీకా ద్వారా భారత్‌ బయోటెక్‌ పాలుపంచుకున్నందుకు గర్వంగా ఉందన్నారు. ప్రభుత్వం, టీకా ఉత్పత్తి సంస్థలు, ఆరోగ్య కార్యకర్తల ఉమ్మడి కృషి వల్లే ఈ ఘనత సాధ్యమైందని ఆయన పేర్కొన్నారు. ‘ఆర్మనిర్భర్‌ భారత్‌’ ఆవిష్కరించిన విజయగాథగా దీన్ని డాక్టర్‌ కృష్ణ ఎల్ల అభివర్ణించారు. ‘శతకోటి’ ఘనతను సాధించడంలో కీలకపాత్ర పోషించిన ప్రధాని కార్యాలయానికి, వైద్య ఆరోగ్యశాఖకు, ఐసీఎంఆర్‌, ఇతర భాగస్వాములకు భారత్‌ బయోటెక్‌ జాయింట్‌ ఎండీ సుచిత్ర ఎల్ల కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని