రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలి

ప్రధానాంశాలు

రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలి

దాడులపై సీబీఐ విచారణ చేయించాలి
గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌కు తెదేపా వినతి

ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలన విధించాలని, మూడు రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై సీబీఐ విచారణ చేయించాలని గవర్నర్‌ను కోరామని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తెలిపారు. ఆయనతోపాటు తెదేపా నేతలు యనమల రామకృష్ణుడు, పయ్యావుల కేశవ్‌, వర్ల రామయ్య, నిమ్మల రామానాయుడు తదితరులు గురువారం సాయంత్రం రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ను కలిసి ఈ మేరకు వినతిపత్రం సమర్పించారు. అనంతరం అచ్చెన్నాయుడు విలేకరులతో మాట్లాడుతూ.. ‘రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై నివేదిక తెప్పించుకుని కేంద్రానికి, రాష్ట్రపతికి పంపిస్తామని గవర్నర్‌ స్పష్టమైన హామీ ఇచ్చారు. తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు నాయకత్వంలో ప్రతినిధి బృందం దిల్లీ వెళ్లి రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర హోంమంత్రిని కలవాలని నిర్ణయించాం. వారి అనుమతి రాగానే వెళ్లి ఇక్కడ జరుగుతున్న పరిణామాలను వారి దృష్టికి తీసుకెళ్తాం. మా కార్యాలయంపై దాడి చేసి, ఆస్తుల్ని ధ్వంసం చేసి, సిబ్బంది తలలు పగలగొట్టి మాపైనే కేసు పెట్టారు. అందులో లోకేశ్‌ను ప్రథమ నిందితునిగా చేర్చి హత్యాయత్నం, ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశారు. సంఘటన జరిగినట్లు చెబుతున్న సమయంలో ఆయన హైదరాబాద్‌ నుంచి విజయవాడకు విమానంలో ప్రయాణిస్తున్నారు. పట్టాభి ఇంటిపై దాడి చేసి.. ఆయన ఎనిమిదేళ్ల కుమార్తెను భయభ్రాంతులకు గురి చేశారు. దీనిపై ఫిర్యాదు చేస్తే.. ఇప్పటివరకు ఒక్కరినీ పట్టుకోలేదు. పట్టాభిని మాత్రం అరెస్టు చేసి రిమాండుకు పంపించారు. అసమర్థ, చేతగాని దద్దమ్మ డీజీపీ ఈయన’ అని ధ్వజమెత్తారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని