కదం తొక్కిన పసుపు దళం

ప్రధానాంశాలు

కదం తొక్కిన పసుపు దళం

చంద్రబాబు దీక్షకు వేల సంఖ్యలో తరలివచ్చిన పార్టీ శ్రేణులు

రాత్రి 8.25కి దీక్ష విరమణ

ఈనాడు, అమరావతి: రెట్టించిన ఉత్సాహం, దీక్ష చేస్తున్న అధినేతను కలసి సంఘీభావం చెప్పాలన్న తపన, పార్టీ కార్యాలయంపై దాడి చేసిన వారికి గుణపాఠం చెప్పాలన్న కసితో తెదేపా శ్రేణులు కదం తొక్కాయి. ‘ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదంపై పోరు’ నినాదంతో తెదేపా అధినేత చంద్రబాబు చేపట్టిన 36 గంటల నిరాహార దీక్షకు రెండో రోజైన శుక్రవారం పార్టీ కేంద్ర కార్యాలయానికి జనం పోటెత్తారు. ఉదయం ఆరు గంటలకే మొదలైన జన ప్రవాహం రాత్రి 8.30 గంటలకు చంద్రబాబు దీక్ష విరమించే వరకు ఒకేలా కొనసాగింది. పార్టీ కార్యాలయం ప్రాంగణం, దాని ఎదురుగా ఉన్న సర్వీసు రోడ్డు జనంతో నిండిపోయాయి. రాష్ట్రం నలుమూలలతోపాటు తెలంగాణ నుంచీ తరలివచ్చిన కార్యకర్తలతో దీక్షా ప్రాంగణం పసుపు జెండాల రెపరెపలు, జై తెలుగుదేశం నినాదాలతో తెదేపా ‘మహానాడు’ని తలపించింది.

ఉదయం ఏడు గంటలకు ప్రారంభం

శుక్రవారం ఉదయం ఏడు గంటలకే చంద్రబాబు దీక్షా వేదికపైకి చేరుకున్నారు. అప్పటికే తరలివచ్చిన కార్యకర్తలకు, ప్రజలకు ఆయన అభివాదం చేశారు. సంఘీభావం చెప్పేందుకు వచ్చిన నాయకులతో మాట్లాడారు. ఉదయం నుంచి రాత్రి వరకు వేదికపై తెదేపా నేతలు, వివిధ సంఘాల నాయకుల ప్రసంగాలు కొనసాగాయి. రాత్రి దీక్ష విరమించే సమయానికి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, శాసనసభాపక్ష ఉపనేత రామానాయుడు భారీ గజమాలతో చంద్రబాబుని సత్కరించారు. సాయంత్రం ఏడు గంటల నుంచి 8.25 వరకు చంద్రబాబు ప్రసంగించారు. అనంతరం పార్టీ మహిళా నేతలు వంగలపూడి అనిత, గుమ్మడి సంధ్యారాణి, పీతల సుజాత, గౌతు శిరీష, పంచుమర్తి అనురాధ చేతుల మీదుగా నిమ్మరసం తీసుకుని చంద్రబాబు దీక్ష విరమించారు.

ఎటు చూసినా కార్యకర్తల సందడే

ప్రతి ఏటా మూడు రోజులపాటు తెదేపా మహానాడుని ఒక పండుగలా నిర్వహించడం ఆనవాయితీ. మహానాడుకు రాష్ట్రం నలుమూలల నుంచీ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలి వస్తారు. చంద్రబాబు రెండు రోజులపాటు నిర్వహించింది నిరసన దీక్షే అయినా... దానికి తరలి వచ్చిన కార్యకర్తల్లో మాత్రం మరో మహానాడులో పాల్గొన్నంత ఉత్సాహం కనిపించింది. అటు శ్రీకాకుళం నుంచి ఇటు అనంతపురం వరకు అన్ని జిల్లాల నుంచీ నాయకులు, కార్యకర్తలు దీక్షకు తరలివచ్చారు. పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జులు, పార్టీ లోక్‌సభ నియోజకవర్గ అధ్యక్షులతోపాటు పెద్ద సంఖ్యలో వచ్చారు. ప్రకాశం జిల్లా అద్దంకి నుంచి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ ఆధ్వర్యంలో 300 కార్లలో జనం తరలి వచ్చారు. విజయవాడ నుంచి ఎంపీ కేశినేని నాని ఆధ్వర్యంలో 50 కార్లలో వచ్చారు. సాయంత్రం అయిదు గంటల సమయంలో మంగళగిరి నుంచి భారీ సంఖ్యలో కార్యకర్తలు తరలి వచ్చారు. ఆ సమయంలో లోకేశ్‌ దీక్షా వేదికపైకి వచ్చి వారందరినీ పలకరించారు. వేల మంది కార్యకర్తలకు రెండు రోజులూ పార్టీ కార్యాలయంలోనే భోజన వసతి కల్పించారు. చంద్రబాబు దీక్షా వేదికను రెండో రోజు కొంచెం వెనక్కి జరిపి ఎక్కువ మంది కార్యకర్తలు పట్టేందుకు చోటు కల్పించారు. ఎచ్చెర్లకు చెందిన తెదేపా నాయకుడు కలిశెట్టి అప్పలనాయుడు పార్టీకి విరాళంగా రూ.50 వేల చెక్కుని చంద్రబాబుకి అందజేశారు.

ఫోన్‌లో మద్దతు తెలిపిన నారాయణ

సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఫోన్‌లో చంద్రబాబుతో మాట్లాడి దీక్షకు సంఘీభావం ప్రకటించారు. సోదరుడి వర్థంతి కార్యక్రమంలో పాల్గొనేందుకు చిత్తూరు జిల్లాకు వచ్చినందున, దీక్షకు స్వయంగా హాజరవలేకపోయానని పేర్కొన్నారు. దీక్షకు అఖిలభారత కిసాన్‌ మహాసభ అధ్యక్షుడు రావుల వెంకయ్య, లోక్‌సత్తా ప్రతినిధి మాలతి సంఘీభావం ప్రకటించారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని