వెంటిలేటర్‌పై తెదేపా

ప్రధానాంశాలు

వెంటిలేటర్‌పై తెదేపా

త్వరలో సహజమరణం: ఎంపీ విజయసాయి

రెండో రోజూ వైకాపా జనాగ్రహ దీక్షలు

ఈనాడు, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను ఉద్దేశించి తెదేపా నేత పట్టాభి వ్యాఖ్యలకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలంటూ వైకాపా ఆధ్వర్యంలో శుక్రవారం రెండోరోజూ రాష్ట్రవ్యాప్తంగా దీక్షలు కొనసాగాయి. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు నిరసనల్లో పాల్గొన్నారు.

* గుంటూరు జనాగ్రహ దీక్షలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి పాల్గొన్నారు. ‘దిల్లీకి వెళ్లి అక్కడ పెద్దలనూ అదే పదంతో సంబోధిస్తారా చంద్రబాబూ’ అని ప్రశ్నించారు. ఎమ్మెల్యే మేరుగ నాగార్జున వేమూరు నుంచి తెనాలిలోని వైకుంఠపురం వరకు జనాగ్రహ యాత్ర చేశారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిని మరోసారి విమర్శిస్తే చంద్రబాబుతో పాటు తెదేపా నాయకుల బట్టలు చిరిగేలా వైకాపా కార్యకర్తలు కొడతారని తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి వ్యాఖ్యానించారు.పేరేచర్లలో జరిగిన జనాగ్రహ దీక్షలో ఆమె మాట్లాడారు. 

* విశాఖలో పలు ప్రాంతాల్లోని శిబిరాల్లో రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మాట్లాడుతూ, తెదేపా వెంటిలేటర్‌పై ఉందని, త్వరలో సహజమరణం పొందుతుందన్నారు. రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వాన్ని అస్థిరపరిస్తే తెదేపాను భాజపాలో విలీనం చేస్తానని దిల్లీ పెద్దలకు చంద్రబాబు ప్రతిపాదన పెట్టారని ఆయన ఆరోపించారు.

* విశాఖ ఎంపీ ఎం.వి.వి.సత్యనారాయణ మాట్లాడుతూ ముఖ్యమంత్రిపై పట్టాభిలా ఎవరైనా వ్యాఖ్యలు చేస్తే ప్రజలు రాళ్లతో కొడతారని  హెచ్చరించారు.‘ఇళ్లు, పార్టీ కార్యాలయాలు పగలగొడుతున్నారని తెదేపా నేతలు అంటున్నారు. అసలు చేసింది చాలా తక్కువ. పట్టాభి రోడ్ల మీదికి వచ్చినప్పుడు ఆయన పరిస్థితి ఏమిటో ప్రజలు చూస్తారు’ అని పేర్కొన్నారు.

* కర్నూలు ధర్నాచౌక్‌లో ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్‌ ఆధ్వర్యంలో, కల్లూరులో పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌ రెడ్డి, పత్తికొండలో ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి దీక్షలో పాల్గొనగా, కర్నూలు ఎంపీ సంఘీభావం తెలిపారు.

* విజయనగరం జిల్లాలో ఎమ్మెల్యేలు జోగారావు, కె.శ్రీనివాసరావు, బొత్స అప్పలనరసయ్య, పశ్చిమగోదావరి జిల్లా మార్టేరులో రాష్ట్ర గృహనిర్మాణ శాఖమంత్రి రంగనాథరాజు ఆధ్వర్యంలో,  ఇతర ప్రాంతాల్లో ఎమ్మెల్యేలు, తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం మానవహారంలో ఎంపీ భరత్‌, కోనసీమ దీక్షల్లో అమలాపురం ఎంపీ అనురాధ పాల్గొన్నారు.

* కడప అంబేడ్కర్‌ కూడలిలో ఉప ముఖ్యమంత్రి అంజాద్‌ బాషా, పులివెందుల, రైల్వేకోడూరు, జమ్మలమడుగు, కమలాపురంలో ఇతరులు దీక్షలు చేశారు.

* నెల్లూరుజిల్లా వెంకటగిరిలో ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ.. ‘ప్రజాదరణ ఉన్న ప్రభుత్వాన్ని కూలదోసి రాష్ట్రపతి పాలన పెట్టాలా? ప్రజాస్వామ్యం అంటే ఇదేనా చంద్రబాబూ’ అని ప్రశ్నించారు. నెల్లూరులో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి పాల్గొన్నారు.

* ప్రకాశం జిల్లాలో మంత్రి ఆదిమూలపు సురేష్‌, ఇతర ప్రాంతాల్లో ఎమ్మెల్యేలు మహీధర్‌రెడ్డి, నాగార్జునరెడ్డి, అన్నా రాంబాబు, శ్రీకాకుళం జిల్లాలో ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్‌, మంత్రి సీదిరి అప్పలరాజు, ఎమ్మెల్యే కళావతి, జడ్పీ ఛైర్‌పర్సన్‌ విజయ, కిల్లి కృపారాణి, అనంతపురం జిల్లాలో మంత్రి శంకరనారాయణ, వైకాపా ఎమ్మెల్యేలు వారి నియోజకవర్గాల్లో దీక్షలు కొనసాగించారు.

చంద్రబాబు దిష్టిబొమ్మతో అంతిమయాత్ర

తెదేపా అధినేత చంద్రబాబు దిష్టిబొమ్మకు తిరుపతిలో, రాజమహేంద్రరంలో అంతిమయాత్ర నిర్వహించారు. తిరుపతిలో ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసనలో ఒక కార్యకర్తకు లోకేశ్‌ పేరు రాసి అతనితో చంద్రబాబు దిష్టిబొమ్మకు అంతిమ సంస్కారాలు చేయించారు. సీఎం జగన్‌ను రాముడిగా, చంద్రబాబును రావణుడిగా పోలుస్తూ ఆయా వేషధారణలతో ప్రదర్శన చేశారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని