పోలీసుల్లేకుండా రండి చూసుకుందాం..

ప్రధానాంశాలు

పోలీసుల్లేకుండా రండి చూసుకుందాం..

వైకాపా నేతలకు మా సత్తా ఏంటో చూపిస్తాం

తెదేపా ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ సవాల్‌

ఈనాడు డిజిటల్‌, అమరావతి: వైకాపా అధికారంలోకొచ్చాక రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ రాకున్నా.. గంజాయి పరిశ్రమ మాత్రం బాగా నడుస్తోందని, పిల్లల భవిష్యత్తుతో ఆడుకుంటున్నారని అడిగినందుకు తమపై ఎదురు దాడి చేస్తున్నారని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ధ్వజమెత్తారు. ‘ఎవరు లేని సమయంలో కాదు. దాడి చేయాలనుకుంటే సీఎం జగన్‌ నేరుగా రావాలి. ఇక్కడికొస్తే మా సత్తా ఏంటో చూపిస్తాం. తెదేపాలోని యువరక్తం చూస్తూ ఊరుకోదు. రెండు చెంపలు వాచే వరకు కొడతాం.  మమ్మల్ని ఎన్ని ఇబ్బందులు పెట్టినా.. ఎన్ని గృహనిర్బంధాలు చేసినా ఆపలేరు. వైకాపా నాయకులు పోలీసుల అండ లేకుండా బయటికొస్తే సత్తా ఏంటో చూపిస్తాం’ అని హెచ్చరించారు. ‘‘2019కి ముందు నాపై ఒక్క కేసు కూడా లేదు. జగన్‌ సీఎం అయ్యాక 11 కేసులు బనాయించారు. ఇటీవల హత్యయత్నం కేసు పెట్టారు. 307సెక్షన్‌ కింద కేసు పెడితే ఈ బండి ఆగదు. అడ్డగోలు కేసులు పెడితే బండి స్పీడు ఇంకా పెరుగుతుంది’ అని చెప్పారు. ‘జగన్‌లా నేను ఎన్నడూ మా చిన్నాన్న జోలికెళ్లలేదు. సీఎంకు ధైర్యముంటే వైఎస్‌ వివేకాను ఎవరు చంపారో తేల్చాలి’’ అని సవాలు చేశారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు దీక్ష సందర్భంగా లోకేశ్‌ మాట్లాడారు.

‘1983 తరువాత తెదేపా జెండా మంగళగిరి నియోజకవర్గంలో ఎగరలేదు. 2024లో అక్కడ పెద్ద మెజారిటీతో గెలిపించి మీకు కానుకగా ఇస్తాం’ అని చెప్పారు. కుప్పం నియోజకవర్గంలోని శాంతిపురం మండలం వైకాపా కన్వీనర్‌ కోదండరెడ్డి.. సీఐ సాదిక్‌అలీపై చేయి చేసుకుంటే పోలీసు అధికారుల సంఘం ఎందుకు ఖండించలేదు.’ అని ప్రకటనలో పేర్కొన్నారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని