పట్టాభిపై కాకినాడలోనే దాడి చేయాల్సింది.. అధిష్ఠానం వద్దనడంతో ఆగాం

ప్రధానాంశాలు

పట్టాభిపై కాకినాడలోనే దాడి చేయాల్సింది.. అధిష్ఠానం వద్దనడంతో ఆగాం

ఎమ్మెల్యే ద్వారంపూడి

కాకినాడ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: పట్టాభిపై కాకినాడలోనే దాడి చేయాలని నిర్ణయించామని, కానీ తమ అధిష్ఠానం నుంచి అలాంటివి చేయొద్దని చెప్పడంతో ఆగామని తూర్పుగోదావరి జిల్లా కాకినాడ నగర ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి అన్నారు. తమ నాయకుడు జగన్‌మోహన్‌రెడ్డిని దూషిస్తే, చూస్తూ ఊరుకోమన్నారు. చంద్రబాబుది దొంగ దీక్ష అని ఆయన ఆరోపించారు. శుక్రవారం కాకినాడ జనాగ్రహ దీక్షలో ఎమ్మెల్యే విలేకర్లతో మాట్లాడారు. ‘సీఎం జగన్‌ను విమర్శించడానికి ఏ కారణం లేక లేనిపోని పదజాలంతో చంద్రబాబు దూషిస్తున్నారు. ఒక పక్క కోర్టులను అడ్డుపెట్టుకుంటున్నారు. అయినా జగన్‌మోహన్‌రెడ్డి పోరాడుతున్నారు. చంద్రబాబు వద్ద బ్రిటిష్‌ వారి లక్షణాలు ఉన్నాయి. కులాలు, వర్గాలు, గ్రూపులను విడగొడతారు. దిల్లీలో గతంలో జరిగిన దీక్షలో చంద్రబాబుకు మధుమేహం స్థాయి పెరిగింది. మరుగుదొడ్డిలోనూ నిఘా పెట్టాలి’ అని చంద్రశేఖరరెడ్డి అన్నారు.

జనసేన సింహం అయితే సింగిల్‌గా పోటీచెయ్యి

‘నువ్వే జనసేన సింహం అయితే చంద్రబాబు తొత్తుగా మారకుండా రా సింగిల్‌గా పోటీ చెయ్యి. నువ్వు ఎక్కడ పోటీ చేసినా ఓడించి తీరుతాం’ అని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌పై ఎమ్మెల్యే చంద్రశేఖరరెడ్డి విరుచుకుపడ్డారు. ‘ప్యాకేజీలకు అలవాటు పడి చంద్రబాబుకు తొత్తుగా మారితే నీ జాతి నిన్ను క్షమించదు. మేమంతా రంగా నుంచి రాజకీయాలు నేర్చుకున్నాం. రంగాను హత్య చేసినప్పుడు కాకినాడలో తెదేపా నాయకుల ఆస్తులను మేమే ధ్వంసం చేశాం. కాకినాడలో అయిదు రోజులు కర్ఫ్యూ విధించారు. రంగాను చంపితేనే మేము ఊరుకోలేదు. మా నాయకుడు జగన్‌మోహన్‌రెడ్డిని తిడితే ఎందుకు ఊరుకుంటాం?’ అని ప్రశ్నించారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని