రాష్ట్రంలో ఏం జరుగుతోంది?

ప్రధానాంశాలు

రాష్ట్రంలో ఏం జరుగుతోంది?

ఏం ఆలోచిస్తున్నారు.. ఏం చేస్తున్నారు?
పోలీసుల తీరుపై హైకోర్టు ఆగ్రహం
ఠాణాకు తీసుకెళ్లి కొట్టడం ఏంటి?
ఇలా అయితే సామాన్యుల పరిస్థితి ఎలా?
తెదేపా నేత బ్రహ్మం చౌదరి పిటిషన్‌ విచారణలో కీలక వ్యాఖ్యలు

ఈనాడు, అమరావతి: ‘రాష్ట్రంలో పోలీసులు ఏం ఆలోచిస్తున్నారు.. ఏం చేస్తున్నారు? ఈ తరహా చర్యలేంటి? ఏడేళ్లలోపు జైలుశిక్ష పడేందుకు వీలున్న కేసుల్లో సీఆర్‌పీసీ సెక్షన్‌ 41ఏ ప్రకారం నిందితులకు నోటీసులు ఇచ్చి వివరణ తీసుకోవాలని తెలీదా? నిబంధనలను తుంగలో తొక్కి ఎలా అరెస్టు చేస్తారు? ఠాణాకు తీసుకెళ్లి కొట్టడం ఏంటి? మేజిస్ట్రేట్‌ పోలీసులు కొట్టిన విషయాన్ని నమోదు చేస్తారు. అయినా నిందితులను రిమాండుకు ఇస్తారు. ఇదేంటి? రాష్ట్రంలో ఏం జరుగుతోంది? ఇలాగైతే సామాన్యుల పరిస్థితి ఎలా?’ తెదేపా రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి నాదెండ్ల బ్రహ్మం చౌదరి బెయిలు పిటిషన్‌ విచారణ సందర్భంగా హైకోర్టు ఈ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. నిబంధనలు పాటించకుండా నిందితులను పోలీసులు అరెస్టు చేయడం, మేజిస్ట్రేట్లు వారిని రిమాండుకు పంపడంపై అసహనం వ్యక్తం చేసింది. బ్రహ్మం చౌదరి బెయిలు పిటిషన్‌పై సోమవారం విచారణ జరుపుతామని స్పష్టం చేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కె.లలిత శనివారం ఈ మేరకు ఉత్తర్వులు జారీచేశారు.

తెదేపా కేంద్ర కార్యాలయంలో గొడవ జరుగుతోందని తెలిసి అక్కడకు వెళ్లిన తనను కులం పేరుతో దూషించి, చంపేందుకు యత్నించారంటూ డీజీపీ కార్యాలయంలో రిజర్వు ఇన్‌స్పెక్టర్‌ పనిచేస్తున్న జి.సక్రూనాయక్‌ పలువురిపై ఫిర్యాదు చేశారు. పోలీసులు తనపై నమోదుచేసిన కేసులో బెయిలు మంజూరు చేయాలని కోరుతూ అరెస్ట్‌ అయి జ్యుడిషియల్‌ రిమాండులో ఉన్న నాదెండ్ల బ్రహ్మం చౌదరి హైకోర్టులో బెయిలు పిటిషన్‌ వేశారు. ఈ వ్యాజ్యం శనివారం కేసుల విచారణ జాబితాలో వచ్చింది. అత్యవసరం అయినందున వ్యాజ్యంపై సోమవారం విచారణ జరపాలని న్యాయమూర్తిని పిటిషనర్‌ తరఫు న్యాయవాది కేఎం కృష్ణారెడ్డి అభ్యర్థించారు. పోలీసుల వ్యవహార శైలిని న్యాయమూర్తి దృష్టికి తీసుకొచ్చారు. ఏపీపీ అభ్యంతరం తెలుపుతూ మంగళవారానికి వాయిదావేయాలని కోరారు. అందుకు నిరాకరించిన న్యాయమూర్తి.. సోమవారం విచారణ జరుపుతామని తేల్చిచెప్పారు.

సంజాయిషీ నోటీసు
పోలీసులు అక్రమంగా అరెస్టుచేసి కొట్టారని... తనకు రిమాండ్‌ విధించే సందర్భంలో మేజిస్ట్రేట్‌కు బ్రహ్మం చౌదరి ఫిర్యాదుచేశారు. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంపై వివరణ ఇవ్వాలని గుంటూరు అర్బన్‌, నార్త్‌ సబ్‌డివిజన్‌ డీఎస్పీకి మంగళగిరి జ్యుడిషియల్‌ ఫస్ట్‌క్లాస్‌ మేజిస్ట్రేట్‌ సంజాయిషీ నోటీసు జారీచేశారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని