ఎంపీల్యాడ్స్‌పై నివేదిక ఇవ్వండి

ప్రధానాంశాలు

ఎంపీల్యాడ్స్‌పై నివేదిక ఇవ్వండి

రాష్ట్ర ప్రణాళిక శాఖకుకేంద్ర గణాంక విభాగం లేఖ

ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఎంపీల నియోజకవర్గ అభివృద్ధి నిధులు (ఎంపీల్యాడ్స్‌) వినియోగానికి సంబంధించి సమగ్ర నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రణాళికా శాఖకు కేంద్ర గణాంక శాఖ ఒక లేఖలో కోరింది. ఎంపీల్యాడ్స్‌ నిధులు దుర్వినియోగమవుతున్నాయని, మతపరమైన నిర్మాణాలు, నిర్వహణ, మరమ్మతులకు కేటాయింపులు జరుపుతున్నారని గతంలో వైకాపా ఎంపీ రఘురామకృష్ణంరాజు ప్రధాన మంత్రి కార్యాలయానికి ఫిర్యాదు చేశారు. దీనిపై కేంద్రం స్పందించింది. తగు చర్యలు చేపట్టాలని కేంద్ర గణాంక, కార్యక్రమాల అమలు శాఖకు ప్రధాని కార్యాలయం సూచించింది. ఈ నేపథ్యంలో ఎంపీ ఫిర్యాదులో పేర్కొన్న అంశాల్ని క్షుణ్ణంగా పరిశీలించి, వాస్తవాలేమిటో వివరిస్తూ, సమగ్రమైన చర్యల నివేదికను పంపించాలని రాష్ట్ర ప్రణాళికా శాఖ ముఖ్యకార్యదర్శికి కేంద్ర గణాంకశాఖ అండర్‌ సెక్రటరీ లేఖ రాశారు. దాని ప్రతిని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికీ పంపించారు. ఎంపీ ఫిర్యాదులో పేర్కొన్న అంశాలన్నీ ఆ లేఖలో ప్రస్తావిస్తూ వాటికి వివరణ ఇవ్వాలని సూచించారు. ఆ లేఖలోని ముఖ్యాంశాలు ఇవీ..

* ప్రార్థనాలయాల ఆవరణలోను, మతవిశ్వాసాలు, గ్రూపులకు సంబంధించిన స్థలాల్లో నిర్మాణాలకు, భవనాల పునరుద్ధరణ, మరమ్మతులకు ఈ నిధులు వెచ్చించకూడదు.

* ఎంపీల్యాడ్స్‌ మార్గదర్శకాల్లోని 6.3(ఐ)పేరా ప్రకారం నిధులు సక్రమంగా ఖర్చయ్యేలా పర్యవేక్షించాల్సిన బాధ్యత నోడల్‌ డిపార్ట్‌మెంట్‌ది. ఆ బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం ఒక సీనియర్‌ అధికారి పర్యవేక్షణలో ప్రత్యేక విభాగానికి అప్పగించాలి. సీఎస్‌ లేదా డెవలప్‌మెంట్‌ కమిషనర్‌/అదనపు ప్రధాన కార్యదర్శి స్థాయి అధికారుల సారథ్యంలో సమీక్షా కమిటీని నియమించాలి. సమావేశాల మినిట్స్‌ని కేంద్ర గణాంక, కార్యక్రమాల అమలు శాఖకి రాష్ట్ర ప్రభుత్వాలు పంపాలి.

* ఈ పథకం కింద సాంకేతిక, ఆర్థిక, పాలనాపరమైన అనుమతులకు సంబంధించి నిర్ణయాధికారం జిల్లా అధికారులదే. అనుమతిచ్చే ముందు, సంబంధిత అధీకృత విభాగాల నుంచి అవసరమైన అనుమతులన్నీ తీసుకున్నారో లేదో సరిచూడాలి.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని