రేపు దిల్లీకి 18 మంది తెదేపా బృందం

ప్రధానాంశాలు

రేపు దిల్లీకి 18 మంది తెదేపా బృందం

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదం పేట్రేగుతోందని, మాదకద్రవ్యాలకు, గంజాయి సాగుకు ఆంధ్రప్రదేశ్‌ని కేంద్రంగా మార్చిందని, ప్రభుత్వంలోని పెద్దలే వీటిని ప్రోత్సహిస్తున్నారని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కి ఫిర్యాదు చేయాలని తెదేపా నిర్ణయించింది. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థను ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని, శాంతిభద్రతలు అదుపు తప్పాయని, కాబట్టి 356వ అధికరణ ప్రకారం రాష్ట్రపతి పాలన విధించాలని కోరనుంది. సోమవారం మధ్యాహ్నం 12.30కు రాష్ట్రపతి అపాయింట్‌మెంట్‌ ఇచ్చారు. కొవిడ్‌ దృష్ట్యా చంద్రబాబు సహా ఐదుగురికే అనుమతి లభించింది. అయినా దిల్లీకి 18 మంది వెళ్లాలని నిర్ణయించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ఎంపీలు, కొందరు పొలిట్‌బ్యూరో సభ్యులు, ఇతర ముఖ్యనేతలు వెళ్తున్నారు. వీరు సోమ, మంగళవారాల్లో దిల్లీలోనే ఉంటారు. ప్రధాని నరేంద్రమోదీ, హోం మంత్రి అమిత్‌షానూ కలిసి ఫిర్యాదు చేయాలని భావిస్తున్న తెదేపా... వారి సమయం కోసమూ ప్రయత్నిస్తోంది. దిల్లీ పర్యటనపై చంద్రబాబు శనివారం ఉదయం 10.30కు ఉండవల్లిలోని తన నివాసంలో ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. మాదకద్రవ్యాలు, గంజాయి అక్రమ సాగు, పెరిగిన నేరాలు, రాష్ట్ర ప్రభుత్వం విచ్చలవిడిగా చేస్తున్న అప్పుల వంటి అంశాలపై రాష్ట్రపతికి అందజేసేందుకు సమగ్ర నివేదిక సిద్ధం చేయాలని పార్టీ నాయకులకు చంద్రబాబు సూచించారు. పార్టీ కేంద్ర కార్యాలయానికి కేంద్ర బలగాల భద్రత కోరదామా అని కొందరు నాయకులు ప్రస్తావించగా... రాష్ట్రంలో ప్రస్తుత పరిణామాల్ని వివరించడం, ప్రభుత్వ అరాచకాలను ఎండగట్టడమే పర్యటన లక్ష్యమని స్పష్టం చేసినట్టు తెలిసింది. చంద్రబాబు దీక్షకు ప్రజల్లో మంచి స్పందన వచ్చిందని, కార్యకర్తల్లో ఉత్సాహం, కసి పెరిగాయని పార్టీ నాయకులు ఆయన దృష్టికి తెచ్చారు. సమావేశంలో లోకేశ్‌, అచ్చెన్నాయుడు, యనమల రామకృష్ణుడు, పయ్యావుల కేశవ్‌, కేశినేని నాని, నిమ్మల రామానాయుడు, వర్ల రామయ్య, వంగలపూడి అనిత, నక్కా ఆనందబాబు తదితరులు పాల్గొన్నారు.

వైకాపా అనుబంధ విభాగంగా పోలీసు వ్యవస్థ: కేశవ్‌
చంద్రబాబుతో సమావేశం అనంతరం, ఆ వివరాలను పయ్యావుల కేశవ్‌ విలేకర్లకు వెల్లడించారు. ‘రాష్ట్రంలో రెండేళ్లుగా జరిగిన దాడులు, అరాచకాలు, అప్రజాస్వామిక చర్యలు, ఆర్థిక పతనం దిశగా రాష్ట్రాన్ని తీసుకెళ్తున్న తీరు వంటి పరిణామాలపై రాష్ట్రపతికి సమగ్ర నివేదిక అందజేస్తాం. పోలీసు వ్యవస్థను వైకాపా అనుబంధ సంస్థగా ప్రభుత్వం మార్చేసింది. అధికారంలో ఉన్నవారి అక్రమ వ్యాపారాలు, దందాలు, వ్యవస్థల్ని దుర్వినియోగం చేయడాన్ని ఎలుగెత్తి చాటిన వారిపై దాడులు చేయిస్తోంది. తెదేపా కేంద్ర కార్యాలయంపై జరిగిన దాడిపై ఫిర్యాదుచేసినా ఇంతవరకూ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయలేదు. దీనిపై సీబీఐ విచారణకు డిమాండ్‌ చేస్తాం. రాష్ట్రపతితో పాటు, ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా దృష్టికీ అ అంశాలను తీసుకెళతాం. అవసరమైతే న్యాయస్థానం తలుపూ తడతాం’ అని కేశవ్‌ తెలిపారు. వైకాపా నాయకులు దిల్లీకి వెళ్లి మీ పార్టీ గుర్తింపు రద్దుచేయాలని కోరతామనడంపై స్పందన కోరగా.. ‘దిల్లీకే కాదు, వాళ్ల హెడ్‌క్వార్టర్‌ ఉన్న చిన్న దేశానికి వెళ్లి వచ్చినా మాకు అభ్యంతరం లేదు. ఏ రాష్ట్రంలోనైనా 356 అధికరణ ప్రయోగించడానికి తెదేపా మౌలికంగా వ్యతిరేకం. కానీ రాష్ట్రంలో అరాచకాల దృష్ట్యా విధిలేని పరిస్థితుల్లో ఆ డిమాండ్‌ చేయాల్సి వచ్చింది’ అని తెలిపారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని