దాడిపై వచ్చి సాక్ష్యం చెప్పండి

ప్రధానాంశాలు

దాడిపై వచ్చి సాక్ష్యం చెప్పండి

సీసీ కెమెరాల ఫుటేజీ ఇవ్వండి
తెదేపా కేంద్ర కార్యాలయం గోడకు నోటీసులు అంటించిన పోలీసులు

ఈనాడు, అమరావతి: తెదేపా కేంద్ర కార్యాలయంపై దాడికి సంబంధించి స్టేషన్‌కు వచ్చి సాక్ష్యం చెప్పాలని, సీసీ కెమెరాల్లో రికార్డయిన దాడి దృశ్యాలకు సంబంధించిన ఫుటేజీ అందజేయాలని కోరుతూ తెదేపా కార్యాలయానికి పోలీసులు రెండు నోటీసులు ఇచ్చారు. మంగళగిరి రూరల్‌ పోలీసుస్టేషన్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ పేరుతో ఇచ్చిన ఆ నోటీసుల్ని శనివారం మధ్యాహ్నం 12.45 గంటలకు తెదేపా కేంద్ర కార్యాలయం గోడకు అంటించి వెళ్లారు. తెదేపా కార్యాలయంపై దాడికి సంబంధించి పార్టీ రిసెప్షన్‌ కమిటీ సభ్యుడు వల్లూరు కుమారస్వామి ఫిర్యాదు చేయడంతో... ఆయనకు సెక్షన్‌ 160 సీఆర్‌పీసీ కింద నోటీసు జారీ చేశారు. శనివారం సాయంత్రం ఐదు గంటల్లోగా మంగళగిరి రూరల్‌ పోలీసుస్టేషన్‌కు వచ్చి దర్యాప్తు అధికారి వద్ద సాక్ష్యం చెప్పాలని అందులో సూచించడం గమనార్హం. సెక్షన్‌ 91 సీఆర్‌పీసీ కింద పార్టీ ఆఫీసు ఇన్‌ఛార్జికి మరో నోటీసు ఇచ్చారు. అల్లరిమూకల దాడిలో తీవ్రంగా గాయపడిన పెండెం సాయిబద్రీనాథ్‌ ఇచ్చిన ఫిర్యాదుపై నమోదు చేసిన కేసుకి సంబంధించిన దర్యాప్తు నిమిత్తం సీసీ కెమెరాల్లో రికార్డయిన ఫుటేజీ ఇవ్వాలని,  దాడి చేసిన వారిని గుర్తించేందుకు, జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు ఈఫుటేజీ అవసరమని పేర్కొన్నారు.

గాజుపెంకులు, ఇతర శిథిలాల తొలగింపు
తెదేపా కేంద్ర కార్యాలయంపై అల్లరిమూకల దాడిలో పగిలిపోయిన అద్దాలు, ఫర్నిచర్‌ శిథిలాల్ని, దాడిలో దెబ్బతిన్న కార్లలో కొన్నింటిని తొలగించారు. చంద్రబాబు చేపట్టిన 36 గంటల నిరశన దీక్ష ముగిసేంత వరకు గాజుపెంకులు, శిథిలాల్ని అలాగే ఉంచిన సిబ్బంది శనివారం వాటిని తొలగించి కార్యాలయం మొత్తం శుభ్రం చేశారు.


ఏం జరిగిందో వచ్చి చూడకుండా నోటీసులేమిటి? : సయ్యద్‌రఫీ

తెదేపా కేంద్ర కార్యాలయంపై దాడి జరిగిందని ఫిర్యాదు చేస్తే పోలీసులు కనీసం ఏం జరిగిందో వచ్చి చూడకుండా గోడకు నోటీసులు అంటించి వెళ్లడమేమిటని పార్టీ అధికార ప్రతినిధి సయ్యద్‌ రఫీ ధ్వజమెత్తారు. పార్టీ కార్యాలయంపై దాడి జరిగి ఐదు రోజులవుతున్నా అసలు దోషులను ఎందుకు అరెస్ట్‌ చేయలేదని ప్రశ్నించారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని