నేడు దిల్లీకి చంద్రబాబు

ప్రధానాంశాలు

నేడు దిల్లీకి చంద్రబాబు

మధ్యాహ్నం రాష్ట్రపతి కోవింద్‌తో భేటీ

ఈనాడు, అమరావతి: తెదేపా అధినేత చంద్రబాబునాయుడి ఆధ్వర్యంలోని ప్రతినిధుల బృందం సోమవారం మధ్యాహ్నం దిల్లీలో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను కలవనుంది. రాష్ట్రంలో ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదంతో శాంతిభద్రతలకు ముప్పు వాటిల్లుతోందని, గంజాయి సాగు, మాదకద్రవ్యాల అక్రమ రవాణా జరుగుతోందని ఆయనకు ఫిర్యాదు చేయనున్నారు. తెదేపా కేంద్ర కార్యాలయంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల ఏక కాలంలో జరిగిన దాడులను వివరించనున్నారు. శాంతిభద్రతలు దిగజారిన నేపథ్యంలో రాష్ట్రపతి పాలన విధించాలని కోరనున్నారు. ఈ మేరకు పలు అంశాలతో రూపొందించిన సమగ్ర నివేదికను ఆయనకు అందజేయనుంది. చంద్రబాబు సోమవారం ఉదయం హైదరాబాద్‌లోని తన నివాసం నుంచి రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకుని అక్కడ నుంచి దిల్లీకి వెళ్తారు. మధ్యాహ్నం 12.15 గంటలకు రాష్ట్రపతి భవన్‌కు చేరుకుంటారు. తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, శాసన మండలిలో ప్రధాన ప్రతిపక్షనేత యనమల రామకృష్ణుడు, ఎంపీ కేశినేని నాని, మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులతో కలిసి రాష్ట్రపతి కోవింద్‌ను కలుస్తారు. ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను కలిసేందుకు అనుమతి లభించాల్సి ఉంది. దిల్లీ పర్యటనలో భాగంగా పలువురు కేంద్రమంత్రులను కూడా కలిసేందుకు అనుమతి కోరుతున్నారు. అందుబాటులో ఉన్న కేంద్ర మంత్రులతోనూ ఆయన భేటీ అయ్యే అవకాశం ఉంది. చంద్రబాబు బృందంతో పాటు మరికొందరు పార్టీ నేతలు కూడా దిల్లీ వెళ్లనున్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని