శిశు సంరక్షణ కిట్లకు కటకట

ప్రధానాంశాలు

శిశు సంరక్షణ కిట్లకు కటకట

 ఏటా సుమారు 4 లక్షలు అవసరం

నిధులు విడుదలవక నిలిచిన పథకం

ఈనాడు, అమరావతి: శిశువుల సంరక్షణకు ఎంతగానో ఉపయోగపడే కిట్ల పంపిణీని రాష్ట్ర ప్రభుత్వం అర్ధంతరంగా నిలిపేసింది. దీనివల్ల తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. పథకం కొనసాగింపును కోరుతూ... వైద్యారోగ్య శాఖ పంపిన ప్రతిపాదనలను ఆర్థిక శాఖ పరిగణనలోనికి తీసుకోకపోవడంతో నిధుల్లేక... కిట్ల పంపిణీ నిలిపేశారు. ఫలితంగా ఏటా సుమారు 4 లక్షల మంది శిశువులకు అందాల్సిన ప్రయోజనం దూరమైంది. కిందటేడాది నుంచే ఈ పంపిణీకి ప్రతిబంధకాలు ఎదురైనప్పటికీ... ఆలస్యంగానైనా ఆర్థిక శాఖ నుంచి సానుకూలత వస్తుందని ఎదురుచూసిన అధికారులకు నిరాశే ఎదురైంది. ప్రభుత్వాసుపత్రుల్లో జన్మించే ప్రతి శిశువుకు ఉచిత బేబి కిట్‌(రూ.699) అందజేసే పథకాన్ని 2016 జులై 1 నుంచి రాష్ట్రంలో ప్రారంభించారు. దీనికి తొలుత ఎన్టీఆర్‌ బేబి కిట్‌ అని పేరు పెట్టారు. ప్రభుత్వం మారిన అనంతరం వైఎస్సార్‌ బేబి కిట్‌ అని నామకరణం చేశారు. ప్రసవాలు జరిగే ప్రతి ప్రభుత్వాసుపత్రిలో బాలింతలకు అందచేసేలా చర్యలు తీసుకున్నారు.

ఇవీ కిట్లలో ఉండే వస్తువులు

దుప్పటి, దోమతెర, స్లీపింగ్‌ బెడ్‌, బేబి పౌడర్‌, యాంటీసెప్టిక్‌ లోషన్‌, బేబి లోషన్‌, న్యాప్‌కిన్‌, డైపర్స్‌, చొన్న బొమ్మలు, షాంపులు, అవసరమైన దుస్తులు ఉన్నాయి. వీటన్నింటి ధర రూ.699. వస్తువులను ఆకర్షణీయంగా జిప్‌బ్యాగులో ఉంచి బాలింతలకు అందచేశారు. విజయవాడ జీజీహెచ్‌లో నెలకు కనీసం 750 మందికి ఇచ్చేవారు. వీటి పంపిణీపై తల్లుల నుంచి సానుకూల స్పందన కనిపించింది. ప్రభుత్వం ఈ కిట్ల ద్వారా ఉచితంగా ఇచ్చే వస్తువులను బయట మార్కెట్లో కొనుగోలు చేయాలంటే కనీసం వెయ్యి రూపాయలకుపైగా ఖర్చు అవుతోంది. శిశువుల సంరక్షణకు ఉపయోగపడే ఈ కిట్‌ పంపిణీకి అవసరమైన నిధులు తక్కువే అయినా... ఆర్థిక శాఖ మంజూరు చేయకపోవడంతో అధికారవర్గాలే విస్మయం వ్యక్తంచేస్తున్నాయి. తల్లులు శిశువుల కోసం కిట్లు అడుగుతుంటే... లేవని చెప్పడం తమకు ఇబ్బందికరంగా మారిందని ఓ సీనియర్‌ ప్రభుత్వ వైద్యుడు వ్యాఖ్యానించారు. ప్రభుత్వాసుపత్రులకు వచ్చేవారంతా పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వారే ఉంటారు. కిందటేడాది నుంచే కిట్ల పంపిణీకి సమస్యలు రాగా... ఏయే ఆసుపత్రుల్లో ఎక్కువగా ఉన్నాయో... అక్కడ్నుంచి అవసరం ఉన్నచోటకు తరలించారు. ఇలా కొంతకాలం సర్దుబాటుచేశారు. ఈలోగా అధికారులు ఆర్థిక శాఖ అధికారులతో సంప్రదింపులు కొనసాగించారు. ఫలితం మాత్రం కనిపించలేదు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని