మోనో టైగర్‌ సాగుకు మొగ్గు

ప్రధానాంశాలు

మోనో టైగర్‌ సాగుకు మొగ్గు

ఆక్వా రైతులకు ఆశాకిరణంగా కొత్త రకం రొయ్యలు

రొయ్య పెంపకందారులు మోనో టైగర్‌ రకం సాగుకు మొగ్గుచూపుతున్నారు. దిగుబడులు బాగుండటంతోపాటు ధర ఆశాజనకంగా ఉండటంతో వీటిపై ఆసక్తి చూపుతున్నారు. నెల్లూరు నుంచి విశాఖపట్నం వరకు తీర ప్రాంతంలో వీటి సాగు విస్తరిస్తోంది. టైగర్‌ రకం తర్వాత కొన్నాళ్లుగా వనామీ రొయ్యల సాగు చేస్తున్న రైతులు వివిధ కారణాలతో వరుసగా నష్టాలు చవిచూస్తుండటంతో ప్రస్తుతం మోనోటైగర్‌ సాగు ఆశాకిరణంగా కనిపిస్తుందని పెంపకం దారులు చెబుతున్నారు. అయితే ఈ రొయ్య పిల్లల లభ్యత తక్కువగా ఉండటంతో రైతులు ముందస్తు చెల్లింపులు చేసి నెలల తరబడి వేచిచూడాల్సి వస్తోంది. దేశవ్యాప్తంగా గుజరాత్‌ రాష్ట్రంలో ఒక్కరి వద్ద మాత్రమే రొయ్య పిల్లలు లభ్యమవుతుండటంతో కొరత ఏర్పడింది. వీరు విదేశాల నుంచి తల్లి రొయ్యలను దిగుమతి చేసుకుని పిల్లలను ఉత్పత్తి చేసి రైతులకు విక్రయిస్తున్నారు. ఇప్పటికే తొలి పంట తీసుకున్న రైతులకు ఎకరాకు సగటున రూ.4 లక్షల నుంచి రూ.6 లక్షల వరకు లాభాలు వచ్చినట్లు చెబుతున్నారు. గుంటూరు జిల్లా కర్లపాలెం మండలం గణపవరంలో ఒక రైతు సాగు చేసిన చెరువులో 12 కౌంట్‌ రావడంతో కిలో రూ.820కు విక్రయించడం గమనార్హం. సాగు ఆశాజనకంగా ఉండటంతో రైతులు రొయ్యపిల్లల కోసం ముందస్తుగా రూ.70 కోట్లు పైగా చెల్లించారు.

మోనో టైగర్‌ రొయ్యల సాగుకు ఎకరాకు సగటున రూ.2 లక్షల నుంచి రూ.2.5 లక్షల పెట్టుబడి అవుతుంది. నాలుగు నుంచి ఐదు నెలల కాలంలో దిగుబడులు చేతికొస్తాయి. 20 కౌంట్‌ కిలో ధర సగటున రూ.700 రైతు చెరువు వద్దే లభిస్తోంది. ఎకరా చెరువులో 30వేల రొయ్యపిల్లలు వేస్తున్నారు. రొయ్యపిల్లలకు డిమాండ్‌ ఉండటంతో ఒక్కొక్క పిల్లకు రైతులు రూపాయి వెచ్చించి కొనుగోలు చేస్తున్నారు. చెరువులో వేసిన రొయ్యల్లో 60 నుంచి 70శాతం వరకు చివరివరకు పెరిగి దిగుబడులు వస్తున్నాయి. వీటికి కూడా వైట్‌గట్‌, వైట్‌స్పాట్‌, లూజుసెల్‌, ఫంగస్‌ తదితర వ్యాధులు వస్తున్నా అదుపులోనే ఉంటున్నాయి. 20 కౌంట్‌ వచ్చేవరకు పెంచినా పెద్దగా వ్యాధులు లేకపోవడం తోడు దిగుబడులు ఆశాజనకంగా ఉన్నాయి. రొయ్యపిల్లలు దొరికితే చాలు సాగు లాభదాయకంగా ఉందని కర్లపాలెం మండలం గణపవరం గ్రామానికి చెందిన రైతు రాంమోహన్‌ తెలిపారు. మోనోటైగర్‌ నీటి అడుగున నేలపై ఎక్కువ సమయం ఉండటం వల్ల ఫంగస్‌ వచ్చే అవకాశం ఉన్నందున అందుకు సంబంధించిన మందులు వాడితే దిగుబడులు బాగున్నాయన్నారు.

- ఈనాడు, అమరావతి

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని