ఆంధ్రాలోనూ పార్టీ పెట్టమంటున్నారు

ప్రధానాంశాలు

ఆంధ్రాలోనూ పార్టీ పెట్టమంటున్నారు

తెలంగాణ తలెత్తుకునేలా చేశాం
తెరాస ప్లీనరీలో సీఎం కేసీఆర్‌

ఈనాడు, హైదరాబాద్‌: ‘అవహేళనలు, అగమ్యగోచరమైన పరిస్థితుల మధ్య సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం ఏడేళ్లలో అద్భుత ప్రగతిని సొంతం చేసుకుంది. అప్రతిహతంగా ముందుకు సాగుతోంది. తెలంగాణను తలెత్తుకునేలా చేసిన పార్టీ తెరాస. సమాజంలో చిరునవ్వే మా లక్ష్యం’ అని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి తెరాస అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రావు తెలిపారు. తెలంగాణ ఏర్పడితే ఎన్నో అనర్థాలు జరిగిపోతాయన్న అపోహలను అభివృద్ధితో పటాపంచలు చేశామన్నారు. దేశ, విదేశాల్లో మన ప్రతిష్ఠను ఇనుమడింపజేస్తున్నామన్నారు. హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో సోమవారం జరిగిన తెరాస ప్లీనరీ సభలో కేసీఆర్‌ అధ్యక్షోపన్యాసం చేశారు. ‘‘అభివృద్ధిలో తెలంగాణ దేశంలోనే మిన్నగా ఉంది. తలసరి విద్యుత్‌ వినియోగంలో నంబర్‌ 1 స్థానంలో ఉండగా తలసరి ఆదాయంలో మొదటి, రెండు రాష్ట్రాలతో సమానంగా ఉన్నాం. లాక్‌డౌన్‌, కరోనా వంటి పరిస్థితుల్లోనూ 11.5 శాతం వృద్ధిరేటుతో అగ్రగామిగా నిలిచాం. నేడు పంజాబ్‌ను తలదన్ని మూడు కోట్ల టన్నుల ధాన్యం పండించాం. ఇతర రాష్ట్రాల సీఎంలు ఆశ్చర్యపోతున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువలా వస్తున్నాయి. ఐటీ ఎగుమతులు రూ.57 వేల కోట్ల నుంచి రూ.1.57 లక్షల కోట్లకు పెరిగాయి.

దళితబంధు చేపట్టిన తర్వాత, ఆంధ్ర ప్రాంతం నుంచి వందల, వేల విజ్ఞాపనలు వస్తున్నాయి. తెరాస పార్టీని ఆంధ్రలో ప్రారంభించండి గెలిపించడానికి సిద్ధంగా ఉన్నాం అంటున్నారు. మీ పథకాలు మాకు కూడా కావాలని వారు కోరుతున్నారు. మహారాష్ట్ర నాందేడ్‌ జిల్లాలోని అయిదు నియోజకవర్గాల నాయకులు, కర్ణాటకలోని రాయచూర్‌ ఎమ్మెల్యే వారి రాష్ట్రాల్లో తెలంగాణ పథకాలు అమలు చేయాలని, లేదంటే తమను తెలంగాణలో కలపాలని డిమాండ్‌ చేస్తున్నారు.

ఏపీలో కరెంటు లేదు... ఇక్కడ 24 గంటలూ...

తెలంగాణ విడిపోతే చీకటి అయిపోతుందని అప్పటి సమైక్య రాష్ట్ర ముఖ్యమంత్రి అన్నారు. ఇప్పుడు ఏ ఆంధ్రప్రదేశ్‌ నుంచి మనం విడిపోయామో అక్కడ కరెంటు లేదు. తెలంగాణలో 24 గంటలూ విద్యుత్తు ఉంటుంది. ఏపీ తలసరి ఆదాయం రూ. 1.70 లక్షలు. తెలంగాణ తలసరి ఆదాయం రూ. 2.37 లక్షలు. రాష్ట్రం ఏర్పాటైనప్పుడు అనేక అపోహలుండేవి. రాష్ట్రం కారు చీకట్లలో ఉంటుందని, నక్సలైట్ల రాజ్యం వస్తుందని, వ్యవసాయం కుంటుపడుతుందని, భూముల ధరలు పడిపోతాయని, పరిశ్రమలు తరలిపోతాయని ఎన్నో అన్నారు.. ఇప్పుడు ఏం జరిగింది? అభివృద్ధితో సగర్వంగా ముందుకు వెళ్తున్నాం...’’ అని కేసీఆర్‌ వివరించారు. తెరాస అధ్యక్షుడిగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ తొమ్మిదోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని