ఆసరాతోనే తల్లులకు అధిక ఆర్థిక సాయం

ప్రధానాంశాలు

ఆసరాతోనే తల్లులకు అధిక ఆర్థిక సాయం

వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్‌ వెల్లడి

ఈనాడు, అమరావతి: శిశు సంరక్షణ కిట్ల కింద కేటాయించిన మొత్తం కంటే ‘ఆరోగ్య ఆసరా’ కింద తల్లులకు ఎక్కువ మొత్తాన్ని ఆర్థిక సాయం కింద అందజేస్తున్నామని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్‌ వెల్లడించారు. సోమవారం ‘ఈనాడు’లో ‘శిశు సంరక్షణ కిట్లకు కటకట’ అనే శీర్షికతో ప్రచురితమైన కథనంపై సోమవారం విలేకర్ల సమావేశంలో వివరణ ఇచ్చారు. ‘‘బేబి కిట్‌ పథకం 2016లో అమల్లోనికి వచ్చింది. 2019 డిసెంబరు నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య ఆసరా పథకాన్ని ప్రారంభించింది. ఆరోగ్యశ్రీ ట్రస్టు ద్వారా చికిత్స పొంది ఆసుపత్రుల నుంచి డిశ్ఛార్జి అయిన వారికి ఆరోగ్య ఆసరా కింద రోజుకి రూ.225 చొప్పున అందచేస్తున్నాం. ఇదే పథకం కింద సాధారణ ప్రసవం జరిగిన తల్లులకు రూ.5వేలు, సిజేరియన్‌ జరిగిన వారికి రూ.3వేలు అందజేస్తున్నాం. ఈ కేటగిరిలో ఏప్రిల్‌ 2020 నుంచి 2021 మార్చి వరకు రూ.193 కోట్లు, గడిచిన 7 నెలల్లో రూ.160 కోట్ల వరకు చెల్లింపులు జరిగాయి. బేబి కిట్‌కు అయ్యే రూ.699ని పొదుపు చేయాలన్న ఆలోచన ప్రభుత్వానికి లేదు’’ అని స్పష్టంచేశారు. ఆసుపత్రులు, కొత్త వైద్య కళాశాలల భవన నిర్మాణాలు, ఇతర పథకాల అమలుకు నిధుల కొరతలేదని పేర్కొన్నారు. ‘‘కొత్త వైద్య కళాశాలల నిర్మాణాలకు రుణం కోసం నాబార్డుకి ప్రతిపాదనలు పంపాం. ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన పథకం కింద గర్భిణులకు అందజేయాల్సిన ఆర్థిక సాయంలోని సమస్యలు మరో సందర్భంలో చెబుతా’’ అని పేర్కొన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర కుటుంబ ఆరోగ్య సంక్షేమ శాఖ కమిషనర్‌ భాస్కర్‌ కాటంనేని, ఆరోగ్యశ్రీ ట్రస్టు సీఈఓ వినయ్‌చంద్‌ పాల్గొన్నారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని