కర్నూలు జిల్లాలో కృష్ణా బోర్డు బృందం పర్యటన

ప్రధానాంశాలు

కర్నూలు జిల్లాలో కృష్ణా బోర్డు బృందం పర్యటన

మూడు ప్రాజెక్టుల పరిశీలన

నందికొట్కూరు, న్యూస్‌టుడే: రాయలసీమలో ఉన్న ప్రాజెక్టులను కృష్ణా బోర్డు పరిధిలోకి తీసుకునేందుకు బోర్డు ప్రతినిధుల బృందం సోమవారం కర్నూలు జిల్లాలో పర్యటించింది. నందికొట్కూరు నియోజకవర్గంలో కృష్ణా నదిపై నిర్మించిన హంద్రీనీవా సుజల స్రవంతి, ముచ్చుమర్రి ఎత్తిపోతల, పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ పథకాలను సందర్శించింది. జలవివాదాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో కృష్ణా నది నీటి ఆధారంగా నిర్మించిన ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించాలని సూచించినా రెండు రాష్ట్రాలు ముందుకు రావడం లేదు. ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయిలో పరిస్థితులను తెలుసుకునేందుకు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు కార్యదర్శి దివాకర్‌ రాయిపురే నేతృత్వంలో బృందం సోమవారం కర్నూలు పర్యటించింది. మూడు ప్రాజెక్టుల నిర్వహణ వచ్చే ఏడాది నుంచి కృష్ణా పరిధిలోకి వెళ్లనుంది. ఈ మేరకు ప్రాజెక్టులకు సంబంధించిన స్థలాలు, మ్యాప్‌లు మొత్తం బోర్డుకు అప్పగించాలని అధికారులను ఆదేశించినట్లు తెలిసింది.

* నందికొట్కూరు మండలం మల్యాల గ్రామ సమీపాన ఉన్న హంద్రీనీవా సుజల స్రవంతి పథకాన్ని బృందం సందర్శించింది. ఎక్కడెక్కడికి నీరు విడుదలవుతోంది, పంపుహౌస్‌, కాల్వ వెడల్పు, రోజువారీ నీటి విడుదల, కాల్వ సామర్థ్యం తదితర అంశాలపై ఆరా తీశారు. కృష్ణా మిగులు జలాలు (అప్రోచ్‌ కాల్వ)ను పరిశీలించారు. శ్రీశైలం వద్ద ఎంత నీటిమట్టం ఉంటే మల్యాల నుంచి నీటిని కాల్వలకు ఎత్తిపోయవచ్చని తెలుసుకున్నారు. పంపుహస్‌లో నీటి విడుదల స్థానిక ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉంటుందని, కాల్వ వద్ద ఏర్పాటు చేసిన రీడింగ్‌ కృష్ణా బోర్డు పరిధిలోకి వస్తుందని అధికారులు తెలిపారు.

* పగిడ్యాల మండలంలో ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకాన్ని సందర్శించిన బృందం హంద్రీనీవా సుజల స్రవంతి, కేసీ కాల్వ ఎత్తిపోతల పథకం నిర్వహణ గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు.  

* జూపాడుబంగ్లా మండలంలోని పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ పథకాన్ని సందర్శించారు. సామర్థ్యం పెంపుదల, నీటి సరఫరాపై ఆరా తీశారు. అనంతరం రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని పరిశీలించారు. కేఆర్‌ఎంబీ బృంద సభ్యుడు రాజ్‌కుమార్‌ పిళ్ల్లై, సీఈ శివరాజన్‌, ఎస్‌ఈ అశోక్‌కుమార్‌, డీఈ శ్రీనాథుడు, అంతర్‌రాష్ట్ర జలవనరుల ప్రధాన ఇంజినీర్‌ శ్రీనివాసరెడ్డి, జల వనరుల శాఖ సీఈ మురళీధరరెడ్డి, స్థానిక ఇంజినీర్లు ఈ బృందంలో ఉన్నారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని