బ్రహ్మం చౌదరికి షరతులతో బెయిలు

ప్రధానాంశాలు

బ్రహ్మం చౌదరికి షరతులతో బెయిలు

మేజిస్ట్రేట్‌ నుంచి నివేదిక కోరిన హైకోర్టు
పోలీసులు కొట్టారని చెప్పినా వైద్య పరీక్షలకు పంపకపోవడంపై ఆక్షేపణ

ఈనాడు, అమరావతి: తెదేపా నేత నాదెండ్ల బ్రహ్మం చౌదరికి హైకోర్టు షరతులతో కూడిన బెయిలు మంజూరు చేసింది. రూ.20 వేల బాండ్‌తో దిగువ కోర్టులో రెండు పూచీకత్తులు సమర్పించాలంది. తాడేపల్లి, మంగళగిరి ఠాణాల పరిధిలో మూడు వారాలు రాకుండా పిటిషనర్‌ను నిలువరిస్తూ షరతు విధించింది. పోలీసులు కొట్టారని రిమాండ్‌ సందర్భంగా బ్రహ్మం చౌదరి చెప్పినప్పటికీ... గాయాలను పరిశీలించకుండా, వైద్య పరీక్షకు పంపకుండా రిమాండ్‌ విధించడంపై నివేదిక ఇవ్వాలని మంగళగిరి అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జిని ఆదేశించింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కె.లలిత సోమవారం ఈమేరకు ఆదేశాలిచ్చారు. విచారణను ఈనెల 28కి వాయిదా వేశారు. తెదేపా కేంద్ర కార్యాలయంలో గొడవ జరుగుతోందని తెలిసి అక్కడికి వెళ్లిన తనను కులం పేరుతో దూషించి, చంపేందుకు యత్నించారంటూ డీజీపీ కార్యాలయంలో రిజర్వు ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న జి.సక్రూనాయక్‌ పలువురిపై ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై తనపై నమోదు చేసిన కేసులో బెయిలు మంజూరు చేయాలని కోరుతూ ప్రస్తుతం అరెస్టై జ్యుడీషియల్‌ రిమాండ్‌లో ఉన్న నాదెండ్ల బ్రహ్మం చౌదరి హైకోర్టులో బెయిలు పిటిషన్‌ వేశారు. సోమవారం జరిగిన విచారణలో పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్‌, న్యాయవాది కేఎం కృష్ణారెడ్డి వాదనలు వినిపించారు. మంగళగిరి పోలీసులు పిటిషనర్‌ను అరెస్ట్‌ చేసి.. నిబంధనలకు విరుద్ధంగా మేడికొండూరు సీఐ పిటిషనర్‌ను కొట్టారన్నారు. ఈ విషయాన్ని రిమాండ్‌ సందర్భంగా పిటిషనర్‌ మేజిస్ట్రేట్‌ దృష్టికి తీసుకెళ్లినా... వైద్య పరీక్షలకు పంపలేదన్నారు. పిటిషనర్‌పై నమోదు చేసిన సెక్షన్లు ఏడేళ్లలోపు శిక్ష విధింపునకు వీలున్నవన్నారు. అలాంటప్పుడు సీఆర్‌పీసీ 41ఏ కింద నోటీసు ఇవ్వకుండా అరెస్ట్‌ చేయడం సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలకు విరుద్ధమన్నారు. పోలీసుల తరఫున అదనపు పీపీ దుష్యంత్‌రెడ్డి వాదిస్తూ... ‘పోలీసు విధుల్ని పిటిషనర్‌ అడ్డుకున్నారు. మహిళా పోలీసును దూషించారు. గతంలో పిటిషనర్‌పై కేసులున్నాయి. నిబంధనల మేరకు అరెస్ట్‌ చేశాం’ అన్నారు. పోలీసులు కొట్టడంపై ఏమి చెబుతారని న్యాయమూర్తి అడిగిన ప్రశ్నకు బదులిస్తూ... ఈ వ్యవహారంపై మేజిస్ట్రేట్‌ పోలీసులను వివరణ కోరుతూ నోటీసు ఇచ్చారన్నారు. పిటిషనర్‌పై హత్యాయత్నం కింద నమోదు చేసిన సెక్షన్‌ను తొలగించామన్నారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని