సాగర్‌ కింద ఏపీలోని ఆయకట్టును కుదించాలి

ప్రధానాంశాలు

సాగర్‌ కింద ఏపీలోని ఆయకట్టును కుదించాలి

ఒప్పందాలను ఉల్లంఘించి ఎడమ కాల్వను విస్తరించారు

శ్రీశైలం నీటితో విద్యుత్‌ ఉత్పత్తికి ఏపీ నిర్మాణాలు

కేంద్రానికి విన్నవించాలంటూ కృష్ణా బోర్డుకు ఈఎన్‌సీ మురళీధర్‌ లేఖలు

ఈనాడు, హైదరాబాద్‌: నాగార్జునసాగర్‌ ఎడమ కాల్వను ఏపీ ఇష్టారీతిన విస్తరించుకుంటూ పోవడంతో తెలంగాణలోని ఆయకట్టుకు తీరని నష్టం వాటిల్లిందని తెలంగాణ నీటిపారుదల శాఖ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ మురళీధర్‌ కృష్ణా బోర్డుకు తాజాగా లేఖ రాశారు. ఈ ప్రాజెక్టు విషయంలో నాటి హైదరాబాద్‌, ఆంధ్ర(మద్రాస్‌) రాష్ట్రాల మధ్య ఎటువంటి ఒప్పందం లేదని పేర్కొన్నారు. ప్రస్తుత బ్రిజేష్‌ కుమార్‌ ట్రైబ్యునల్‌(కెడబ్ల్యూడీటీ-2) అమల్లోకి వచ్చేంతవరకు ఏపీలోని కట్టలేరు వాగు వరకు ఏపీ ఆయకట్టును 1.30 లక్షల ఎకరాలకు పరిమితం చేసేలా చూడాలని కోరారు. కేంద్రం జారీ చేసిన గెజిట్‌లోని షెడ్యూల్‌ రెండులో 4.8 నుంచి 4.14 వరకు ఉన్న సాగర్‌ అవుట్‌లెట్‌లను తొలగించేలా చూడాలని కోరారు. ఈ మేరకు కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వశాఖకు వాస్తవ పరిస్థితిని తెలియజేయాలని బోర్డు ఛైర్మన్‌కు విజ్ఞప్తి చేశారు.

ఇంకా లేఖలో ఏం రాశారంటే..

* ‘‘1952లో హైదరాబాద్‌ రాష్ట్రం రూపొందించిన నందికొండ ప్రాజెక్టు నివేదికలో ప్రస్తుత సాగర్‌ ఎడమ కాల్వ ఆయకట్టు నందిగామ తాలూకా(మద్రాసు రాష్ట్రంలో) కట్టలేరు వాగు వరకే ప్రతిపాదించారు.

* 1956లో రాష్ట్రాల పునర్విభజన అనంతరం ఏపీ ప్రభుత్వం ఆ నివేదికకు భిన్నంగా ఏపీలోని 1.30 లక్షల ఎకరాల ఆయకట్టును 3.78 లక్షలకు పెంచింది. తెలంగాణలోని 6.60 లక్షలను 6.02 లక్షలకు కుదించింది.

* 1969లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం సందర్భంగా నాటి ప్రభుత్వం 1952 నాటి నివేదికకు అనుగుణంగా ఆంధ్ర ప్రాంతంలోని ఆయకట్టును 1.30 లక్షల ఎకరాలకు కుదిస్తూ ఉత్తర్వులు మాత్రమే జారీచేసింది.

* ఈ నేపథ్యంలో సాగర్‌ ప్రాజెక్టుపై ఆంధ్ర(మద్రాస్‌), హైదరాబాద్‌ రాష్ట్రాల మధ్య ఎటువంటి ఒప్పందం లేదనేది స్పష్టం. దీనిపై బోర్డు పరిశీలన చేయాలి.

* ఒక ఎత్తిపోతలను ఏర్పాటు చేసి తెలంగాణ ప్రాంతంలోని లక్ష ఎకరాలను సాగులోకి తీసుకురావాల్సి ఉండగా పట్టించుకోలేదు.

* నాగార్జునసాగర్‌ ఎడమ కాలువపై పాలేరు వద్ద నిర్మించిన హెడ్‌ రెగ్యులేట్‌ను కనీస మట్టానికంటే తగ్గించడంతో తెలంగాణలోని ఆయకట్టుకు తీవ్ర నష్టం వాటిల్లింది’’ అని ఆయన వివరించారు.

ఏపీ నిర్మిస్తున్న ప్రాజెక్టులకు అనుమతులేవీ లేవు

శ్రీశైలం జలాశయం నుంచి నీటిని ఎత్తిపోసుకుని జల విద్యుత్‌ ఉత్పత్తి చేసేలా గండికోట(కడప), చిత్రావతి (అనంతపురం), సోమశిల (నెల్లూరు), అవుకు (కర్నూలు) ప్రాజెక్టుల నిర్మాణాలను ఏపీ చేపట్టిందని మరో లేఖలో ఈఎన్‌సీ మురళీధర్‌ కృష్ణా బోర్డుకు తెలిపారు. పిన్నపురం జల విద్యుత్‌ ఉత్పత్తి ప్రాజెక్టు పనులను ఆపాలని గతంలోనే బోర్డును కోరినప్పటికీ స్పందన రాలేదని పేర్కొన్నారు. వెంటనే కేంద్రానికి వివరాలు తెలియజేయాలని సూచించారు. ‘‘చెన్నై తాగునీటికి 15 టీఎంసీలు, శ్రీశైలం కుడి కాల్వ నుంచి 19 టీఎంసీలు మాత్రమే శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేసుకునే హక్కు  ఏపీకి ఉంది. దీనికి భిన్నంగా పోతిరెడ్డిపాడు, బనకచెర్ల రెగ్యులేటర్‌ ద్వారా కృష్ణా బేసిన్‌ ఆవల ఉన్న పెన్నా బేసిన్‌కు పెద్ద ఎత్తున నీటిని తరలించడం ద్వారా తెలంగాణలోని కృష్ణా బేసిన్‌ ప్రాజెక్టులకు తీవ్ర అన్యాయం జరుగుతోంది. ఏపీ నిర్మిస్తున్న ప్రాజెక్టులకు కేఆర్‌ఎంబీ, అపెక్స్‌ కౌన్సిళ్ల నుంచి అనుమతులేవీ లేవు. వీటిపై బోర్డు.. కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి’ అని లేఖలో పేర్కొన్నారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని