41ఏ నోటీసు నిబంధనలు పాటించండి

ప్రధానాంశాలు

41ఏ నోటీసు నిబంధనలు పాటించండి

తెదేపా నేతలపై కేసు విషయంలో దర్యాప్తు అధికారికి హైకోర్టు ఆదేశం

ఈనాడు, అమరావతి: తెదేపా నేతలపై నమోదుచేసిన కేసులో సీఆర్‌పీసీ సెక్షన్‌ 41ఏ నిబంధనలను పాటించాలని దర్యాప్తు అధికారిని హైకోర్టు ఆదేశించింది. పిటిషనర్లపై నమోదు చేసినవి ఏడేళ్లలోపు జైలు శిక్షకు వీలున్న సెక్షన్లు కాబట్టి.. అర్నేష్‌కుమార్‌ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలకు అనుగుణంగా 41ఏ నోటీసు ఇచ్చి.. పిటిషనర్ల నుంచి వివరణ తీసుకోవాలని స్పష్టం చేసింది. మరోవైపు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పార్టీ కార్యాలయాలపై దాడుల వెనుక కుట్ర ఉందని, బాధ్యులపై కేసు నమోదు చేయాలంటూ తెదేపా రిసెప్షన్‌ కమిటీ సభ్యుడు వి.కుమారస్వామి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా నమోదుచేసిన కేసు రికార్డులను కోర్టు ముందు ఉంచాలని పోలీసులను ఆదేశించింది. విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సీహెచ్‌ మానవేంద్రనాథ్‌రాయ్‌ మంగళవారం ఈ మేరకు ఆదేశాలిచ్చారు. తనపై దాడి చేశారంటూ డీజీపీ కార్యాలయం రిజర్వు ఇన్‌స్పెక్టర్‌ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా మంగళగిరి గ్రామీణ పోలీసులు ఐపీసీ, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం కింద నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ తెదేపా నేతలు ఎమ్మెల్సీ పి.అశోక్‌బాబు, మాజీ ఎమ్మెల్యేలు ఆలపాటి రాజేంద్రప్రసాద్‌, టి.శ్రావణ్‌కుమార్‌, గుంటూరు లోక్‌సభ నియోజకవర్గం తెదేపా ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. పిటిషనర్ల తరఫున సీనియర్‌ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్‌ వాదనలు వినిపించారు. ‘ఫిర్యాది తెదేపా కార్యాలయంలోకి అక్రమంగా చొరబడ్డారు. ధ్వంసం చేస్తుండగా నేతలు పట్టుకొని పోలీసులకు అప్పగించి ఫిర్యాదుచేశారు. దానిపై కేసు నమోదు చేయకుండా.. పిటిషనర్లపై తిరిగి కేసు పెట్టారు’ అన్నారు. అదనపు పీపీ వాదనలు వినిపిస్తూ.. ‘కుమారస్వామి ఫిర్యాదు ఆధారంగా ఇప్పటికే కేసు నమోదైంది. ఇదే ఘటనపై మరో ఎఫ్‌ఐఆర్‌ అవసరం లేదు. ఐపీసీ 307 (హత్యాయత్నం) కింద నమోదు చేసిన సెక్షన్‌ తొలగించాం. పూర్తి వివరాలు కోర్టు ముందు ఉంచేందుకు సమయం కావాలి’ అన్నారు.

* మరోవైపు జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలకు అడ్డంకులు కల్పించారంటూ ఆత్మకూరు వీఏవో ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా తెదేపా నేతలు గంజి చిరంజీవి, మరికొందరిపై నమోదుచేసిన కేసులోనూ 41ఏ నోటీసు నిబంధనలను పాటించాలని మంగళగిరి పోలీసులను న్యాయమూర్తి ఆదేశించారు. వివిధ సెక్షన్లతో పాటు ఐపీసీ 354 (మహిళల ఆత్మగౌరవానికి భంగం) సెక్షన్‌ కింద కేసు నమోదు చేయడాన్ని న్యాయమూర్తి తప్పుపట్టారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని