ఎయిడెడ్‌ విలీనంపై నిరసనల హోరు

ప్రధానాంశాలు

ఎయిడెడ్‌ విలీనంపై నిరసనల హోరు

రోజురోజుకీ పెరుగుతున్న ఆందోళనలు
తాజాగా గుంటూరులో రోడ్డెక్కిన విద్యార్థులు
కాకినాడలో నాలుగున్నర గంటలపాటు నిరసన

గుంటూరు హిందూ కళాశాల కూడలిలో రహదారిపై బైఠాయించిన ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు

గుంటూరు, కాకినాడ, న్యూస్‌టుడే: రాష్ట్రంలో ఎయిడెడ్‌ విద్యాసంస్థలను రద్దు చేసి, ప్రభుత్వంలో విలీనం చేసే నిర్ణయానికి వ్యతిరేకంగా నిరసనలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. సోమ, మంగళవారాల్లో విశాఖపట్నం, కాకినాడల్లో ఉద్ధృత స్థాయిలో నిరసనలు సాగాయి. ఎయిడెడ్‌ విద్యాసంస్థలను మూసివేస్తే తమ పిల్లలు నాణ్యమైన విద్యకు దూరమవుతారంటూ తల్లిదండ్రులు ఏకంగా ఎమ్మెల్యేలనే నిలదీయడం గమనార్హం.  బుధవారం గుంటూరు, కాకినాడల్లో భారత విద్యార్థి సమాఖ్య (ఎస్‌ఎఫ్‌ఐ) ఆధ్వర్యంలో విద్యార్థులు పెద్దఎత్తున నిరసన తెలిపారు. గుంటూరు హిందూ కళాశాల కూడలి వద్ద మానవహారంగా ఏర్పడి, రహదారిపై బైఠాయించి వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. పోలీసులు బలవంతంగా వాహనాలను ముందుకు పంపేందుకు ప్రయత్నించారు. ఎస్‌ఎఫ్‌ఐ విద్యార్థినుల కన్వీనర్‌ నాగూర్‌బీ బస్‌ చక్రాలకు అడ్డంగా కూర్చుండిపోవడంతో పోలీసులు ఆమెను బయటకు లాగి, కార్యకర్తలను చెదరగొట్టారు. ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎం.కిరణ్‌, మనోజ్‌తోపాటు నాగూర్‌బీ తదితరులను అరెస్ట్‌ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. మనోజ్‌కుమార్‌ మాట్లాడుతూ ఎయిడెడ్‌ కళాశాలలు మూసివేయడంతో పేద, మధ్యతరగతి వారికి ఉన్నత విద్య దూరమవుతుందన్నారు. ఎయిడెడ్‌ విద్యాసంస్థలను యథాతథంగా కొనసాగించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. ఎన్‌సీసీ క్యాడెట్‌ ప్రకాష్‌ మాట్లాడుతూ ఎయిడెడ్‌ కళాశాలను ప్రైవేటీకరిస్తే ఫీజుల భారం పెరిగిపోతుందన్నారు. కాకినాడలో జగన్నాథపురంలోని ఎంఎస్‌ఎన్‌ (శ్రీ మల్లాడి సత్యలింగం నాయకర్‌) విద్యాసంస్థల్లో సమస్యలను పరిష్కరించాలంటూ బుధవారం ఎస్‌ఎఫ్‌ఐ చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారి తీసింది. ప్రభుత్వమే బాధ్యత తీసుకుని ఎంఎస్‌ఎన్‌ విద్యాసంస్థలను నడపాలని ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు డిమాండ్‌ చేశారు. బుధవారం మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభమైన ధర్నా రాత్రి 8 గంటల వరకు కొనసాగింది. ముందుగా యానాం రహదారిపై గంటపాటు ధర్నా చేయడంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. పోలీసులు వారిని అక్కడి నుంచి పంపేయటంతో.. విద్యాసంస్థల ప్రాంగణానికి వచ్చి ధర్నాకు దిగారు. ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు మాట్లాడుతూ విద్యాసంస్థలను ప్రైవేటుపరం చేయబోమని ట్రస్టు బోర్డు హామీ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఒకానొక దశలో ఛైర్మన్‌ ఛాంబర్‌లోకి దూసుకెళ్లేందుకు విద్యార్థులు ప్రయత్నించటంతో తోపులాట జరిగి, కొందరు విద్యార్థినులు కింద పడిపోయారు.  రాత్రి 7.30 గంటలకు విద్యాసంస్థల ఛైర్మన్‌ మల్లాడి కార్తీక్‌ నాయకర్‌ బయటకొచ్చి విద్యార్థుల అభిప్రాయం పరిగణనలోకి తీసుకుని నవంబరు 3న నిర్ణయం వెల్లడిస్తామని హామీ ఇవ్వడంతో వారు శాంతించారు.  


గుంటూరు హిందూ కళాశాల కూడలిలో వాహనాలకు అడ్డుగా కూర్చున్న ఎస్‌ఎఫ్‌ఐ నాయకులను అరెస్ట్‌ చేస్తున్న పోలీసులు


పాఠశాల విలీనంపై ఆందోళన  

నిండ్ర, న్యూస్‌టుడే: చిత్తూరు జిల్లా నిండ్ర మండల పరిధిలోని శ్రీరామాపురంలో ఉన్న స్వామి ఎయిడెడ్‌ ఉన్నత పాఠశాలను ప్రభుత్వం విలీనం చేసే ప్రయత్నాలు మానుకోవాలని డిమాండు చేస్తూ పాఠశాల ఎదుట బుధవారం సాయంత్రం విద్యార్థులు, తల్లిదండ్రులు, గ్రామస్థులు నిరసనకు దిగారు. అధికారులు విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశం ఏర్పాటు చేసి, పాఠశాల విలీనానికి కారణాలు తెలియజేసేందుకు ప్రయత్నించారు. తొమ్మిది దశాబ్దాల చరిత్ర కలిగిన ఉన్నత పాఠశాలను ప్రభుత్వం రద్దు చేసి, విలీనం చేయడాన్ని వ్యతిరేకిస్తున్నామని తల్లిదండ్రులు స్పష్టం చేశారు.


ఆ విద్యాలయాలను కొనసాగించాలి: సీపీఎం

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో ఎయిడెడ్‌ విద్యాలయాలను యథాతథంగా కొనసాగించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు డిమాండ్‌ చేశారు. ‘ఎయిడెడ్‌ విద్యా సంస్థలకు అందిస్తున్న గ్రాంట్‌ను నిలిపివేసి, బాధ్యత నుంచి తప్పుకొంటూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాం. ప్రజాభీష్టాన్ని పరిగణనలోకి తీసుకొని ఎయిడెడ్‌ విలీనం ఉత్తర్వులను రద్దుచేయాలి’ అని డిమాండ్‌ చేశారు.

కాకినాడ జగన్నాథపురంలోని ఎంఎస్‌ఎన్‌ ఛారిటీస్‌ వద్ద ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల ఆందోళన


చిత్తూరు జిల్లా శ్రీరామాపురం స్వామి ఎయిడెడ్‌ ఉన్నత పాఠశాల ఎదుట నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థులు, ఉపాధ్యాయులు

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని