రాష్ట్ర మంత్రివర్గ భేటీ నేడు

ప్రధానాంశాలు

రాష్ట్ర మంత్రివర్గ భేటీ నేడు

ఈనాడు, అమరావతి: రాష్ట్ర సచివాలయంలో గురువారం జరగనున్న మంత్రివర్గ సమావేశంలో దాదాపు 20 నుంచి 25 అంశాలపై చర్చించనున్నారు. ముఖ్యంగా సినిమా టిక్కెట్లను ఆన్‌లైన్‌లో ప్రభుత్వం విక్రయించడంపై సినిమాటోగ్రఫీ, చట్టసవరణపై చర్చిస్తారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో 52 మందిని ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించడంపై హైకోర్టు స్టే ఇవ్వడంతో చట్ట సవరణకు సిద్ధం చేసిన ప్రతిపాదనలకు ఆమోదముద్ర వేయనున్నారు. దేవాదాయ స్థలాల లీజు గడువు, ఖాళీ చేయించే విషయంలో చట్టసవరణకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆలయాల్లో భద్రతకు సీసీ కెమెరాలు, ఇతర చర్యలకు ప్రత్యేకంగా విజిలెన్స్‌ అండ్‌ సెక్యూరిటీ విభాగం, ‘ఈడబ్ల్యూఎస్‌’ కేటగిరిలోని వారి సంక్షేమ కార్యకలాపాలకు ప్రత్యేకంగా ఓ శాఖ ఏర్పాటుపై చర్చించనున్నారు. కడప జిల్లాలో ఏపీ హై గ్రేడ్‌ స్టీల్‌ ప్లాంట్‌ ప్రాజెక్టు కోసం భూముల సేకరణకు సంబంధించి నష్టపరిహారం చెల్లింపుల అంశం ప్రస్తావనకు రానుంది. శ్రీకాకుళం జిల్లా పెద్దపాడులో వైకాపా కార్యాలయానికి ఒకటిన్నర ఎకరాను కేటాయించేందుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో పోస్టుల భర్తీకి మంత్రివర్గం ఆమోదముద్ర వేయనుంది. కర్నూలులోని ప్రముఖ సిల్వర్‌ జూబ్లీ ప్రభుత్వ కళాశాలకు రూరల్‌ మండలం దిన్నెదేవరపాడులో 50 ఎకరాలు కేటాయించనున్నారు. యూజీ విద్యార్థులకు వసతిగృహం, ఇతర నిర్మాణాలు చేపట్టేందుకు ఏడు కిలోమీటర్ల దూరంలో భూములు ఇవ్వనున్నారు.

ఎనిమిది ప్రధాన ఆలయాల్లోనూ ప్రత్యేక ఆహ్వానితులు?

రాష్ట్రంలోని ఎనిమిది ప్రధాన ఆలయాల్లో  ప్రత్యేక ఆహ్వానితులకు ప్రభుత్వం అవకాశం కల్పించనుంది. తితిదేతో పాటు, వీటికి కూడా వర్తించేలా దేవాదాయశాఖ చట్టాన్ని సవరించేందుకు రంగం సిద్ధం చేసింది. మంత్రివర్గ సమావేశంలో ఇది ఆమోదం పొందే అవకాశం ఉంది. సింహాచలం, దుర్గగుడి, శ్రీశైలం, శ్రీకాళహస్తి, కాణిపాకం, ద్వారకాతిరుమల, అన్నవరం, పెనుగంచిప్రోలు ఆలయాల పాలకవర్గాల్లో అదనంగా ప్రత్యేక ఆహ్వానితులను నియమించనుంది. దేవాదాయ ట్రైబ్యునల్‌కు అధికారులు కల్పించేలా చట్టసవరణ చేయనుంది.

పట్టణ, నగర ప్రాంతాల్లో ఉన్న అసైన్డ్‌ వ్యవసాయ భూములను వ్యవసాయేతర భూములుగా మార్చుకునేందుకు వెసులుబాటు ఇచ్చే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది.


శ్రీ శారదాపీఠానికి 15 ఎకరాలు

విశాఖలోని శ్రీ శారదాపీఠానికి 15 ఎకరాల భూమిని కేటాయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. భీమునిపట్నం మండలం కొత్తవలసలో సర్వే నంబరు-102లో ఉన్న భూమిని ఇవ్వబోతుంది. పీఠం కార్యకలాపాల విస్తరణకు ఈ భూములను కేటాయిస్తున్నారు. అక్కడ ఎకరా మార్కెట్‌ విలువ రూ.1.50 కోట్ల వరకు ఉంది. దీనిపై గురువారం జరిగే మంత్రివర్గ సమావేశంలో చర్చించి ఆమోదముద్ర వేయనున్నారు. ఎజెండాలో మొదటి అంశం కింద దీనిని చేర్చారు. సీఎం కార్యాలయం నుంచి వెళ్లిన ఆదేశాల మేరకు కేవలం రెండే వారాల్లో విశాఖ జిల్లా అధికారులు విజయనగరం, విశాఖ జిల్లాల్లో ఖాళీగా ఉన్న భూములు పరిశీలించడం, ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించడం, ఎంపిక చేయడం చకాచకా జరిగింది. దీనికి సంబంధించిన చర్చల్లో దేవాదాయశాఖ అధికారులు కూడా పాల్గొన్నారు.


నేడు గవర్నర్‌తో ముఖ్యమంత్రి భేటీ

వర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌తో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ గురువారం సాయంత్రం 5:30 గంటలకు రాజ్‌భవన్‌కు వెళ్లి భేటీ కానున్నారు. నవంబరు 1న రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్‌ జీవిత సాఫల్య, వైఎస్సార్‌ సాఫల్య పురస్కారాలను అందజేయనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేయాలని గవర్నర్‌ను ముఖ్యమంత్రి ఆహ్వానించనున్నారు. తితిదేలో ప్రత్యేక ఆహ్వానితుల నియామకం, దేవాదాయ భూముల లీజు, ఆ శాఖలో నిఘా విభాగం ఏర్పాటు వంటి వివిధ అంశాలను గవర్నర్‌ దృష్టికి తీసుకువెళ్లే అవకాశం ఉందని సమాచారం. వచ్చే నెల అసెంబ్లీ సమావేశాలపై కూడా నివేదించనున్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని