చంద్రబాబుకు అమిత్‌షా ఫోన్‌

ప్రధానాంశాలు

చంద్రబాబుకు అమిత్‌షా ఫోన్‌

తమ పార్టీ కార్యాలయాలపై దాడుల గురించి వివరించిన తెదేపా అధినేత
త్వరలో కలుద్దామన్న కేంద్ర హోం మంత్రి!

ఈనాడు, అమరావతి: కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా బుధవారం ఉదయం తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబుకు ఫోన్‌ చేసి మాట్లాడారు. మంగళవారం ఉదయమే కశ్మీర్‌ నుంచి రావటంతోపాటు సాయంత్రం మంత్రివర్గ సమావేశం ఉండటంతో చంద్రబాబుకు సమయం కేటాయించలేకపోయానని అమిత్‌షా అన్నట్లు తెదేపా వర్గాల కథనం. ఇప్పుడు ఎక్కడున్నారని వాకబు చేసిన ఆయన వీలైనంత త్వరలో కలుద్దామని పేర్కొన్నారు. ఎందుకోసం కలుద్దామనుకున్నదీ వివరించి, సమయం కేటాయిస్తే దిల్లీకి వచ్చి కలుస్తానని చంద్రబాబు జవాబిచ్చారు. తెదేపా కార్యాలయాలతోపాటు పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి ఇంటిపై వైకాపా కార్యకర్తలు దాడులు చేశారని, దీనిపై సీబీఐ దర్యాప్తు కావాలంటూ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు చంద్రబాబు నేతృత్వంలోని పార్టీ నాయకుల బృందం సోమవారం విజ్ఞప్తి చేసింది. రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్‌, మాఫియా రాజ్యమేలుతోందని ప్రభుత్వమే పోలీసులను వాడుకుని దాడులకు పాల్పడుతున్నందున రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండు చేస్తూ వినతిపత్రం సమర్పించింది. ఇదే విషయాల్ని వివరించేందుకు కేంద్ర హోం మంత్రి అమిత్‌షా అపాయింట్‌మెంటునూ పార్టీ కోరింది. ఆయన తీరిక లేకుండా ఉండటంతో సమయం కేటాయించలేదు. ఈ నేపథ్యంలోనే అమిత్‌షా చంద్రబాబుకు ఫోన్‌ చేసి మాట్లాడారు. వైకాపా కార్యకర్తలు తెదేపా కార్యాలయాలపై దాడులు చేయడం, తమ  పార్టీ నాయకుల్ని లక్ష్యంగా చేసుకుని కేసులు పెట్టడం తదితర అంశాల్ని చంద్రబాబు వివరించినట్లు తెలిసింది. వీటిపై రాష్ట్రపతికి అందించిన వినతిపత్రం, ఇతర వివరాలను పంపుతాననిఆయన అమిత్‌షాకు చెప్పినట్లు సమాచారం.


చంద్రబాబు కుప్పం పర్యటన ఖరారు

కుప్పం పట్టణం, న్యూస్‌టుడే: తెదేపా అధినేత చంద్రబాబునాయుడు శుక్ర, శనివారాల్లో కుప్పంలో పర్యటించనున్నట్లు ఆయన పీఏ మనోహర్‌ బుధవారం తెలిపారు. బహిరంగ సభ, రోడ్‌షోలో పాల్గొననున్నట్లు చెప్పారు. గత మూడు దఫాలు వివిధ కారణాలతో చంద్రబాబు కుప్పం పర్యటన రద్దయిన విషయం తెలిసిందే.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని