పెగాసస్‌పై స్వతంత్ర దర్యాప్తు

ప్రధానాంశాలు

పెగాసస్‌పై స్వతంత్ర దర్యాప్తు

సుప్రీంకోర్టు నిర్ణయం
విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌.వి.రవీంద్రన్‌ నేతృత్వం
ప్రముఖుల ఫోన్లపై నిఘా వివాదంలో సీజేఐ జస్టిస్‌
ఎన్‌.వి.రమణ ధర్మాసనం ఆదేశాలు
వ్యక్తిగత గోప్యతపై కీలక వ్యాఖ్యలు
జాతీయ భద్రత పేరు చెప్పి పరిశీలన నుంచి ప్రభుత్వం తప్పించుకోలేదని స్పష్టీకరణ

జాతీయ భద్రత అంశాలు ఇమిడి ఉన్నాయన్న కారణంతో న్యాయస్థానం మౌన ప్రేక్షక పాత్ర పోషించ జాలదు. ఆ అంశాన్ని ప్రస్తావించి ప్రభుత్వం ప్రతిసారీ పరిశీలన నుంచి తప్పించుకోలేదు. జాతీయ భద్రత అంశాల్లో న్యాయస్థానాలు సంయమనం పాటించాల్సి ఉన్నప్పటికీ వాటి సమీక్షను వ్యతిరేకిస్తూ సంపూర్ణమైన నిషేధం విధించడానికి వీల్లేదు. ప్రజాస్వామ్య దేశంలో చట్టబద్ధపాలన కొనసాగాలి. వ్యక్తులపై విచక్షణరహిత నిఘాను అనుమతించరాదు.

- జస్టిస్‌ ఎన్‌.వి.రమణ, సీజేఐ


నాడు, దిల్లీ: దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన పెగాసస్‌ స్పైవేర్‌ వ్యవహారంపై సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ప్రముఖుల ఫోన్లపై నిఘా, వ్యక్తిగత గోప్యతకు భంగం తదితర ఆరోపణలపై దర్యాప్తునకు ముగ్గురు సభ్యులతో స్వతంత్ర నిపుణుల కమిటీని నియమించింది. సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌.వి.రవీంద్రన్‌ పర్యవేక్షణలో ఈ కమిటీ పని చేస్తుందని తెలిపింది. కమిటీ అధ్యక్షునికి సహాయకులుగా ఒక మాజీ ఐపీఎస్‌ అధికారి, మరో సాంకేతిక నిపుణుడిని కూడా నియమిస్తూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ, జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ హిమాకోహ్లిల నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం బుధవారం 46 పేజీల ఉత్తర్వులను వెలువరించింది. సమగ్ర దర్యాప్తు జరిపి సత్వరమే నివేదిక సమర్పించాల్సిందిగా జస్టిస్‌ ఆర్‌.వి.రవీంద్రన్‌కు ధర్మాసనం సూచించింది. ఇజ్రాయెల్‌కు చెందిన ఎన్‌ఎస్‌ఓ గ్రూప్‌ నుంచి కొనుగోలు చేసిన పెగాసస్‌ సాఫ్ట్‌వేర్‌ ద్వారా కేంద్ర ప్రభుత్వం చట్టవిరుద్ధంగా దేశంలోని రాజకీయ నాయకులు, పాత్రికేయులు, సామాజిక కార్యకర్తల ఫోన్లపై నిఘా ఉంచినందున ఈ వ్యవహారంపై దర్యాప్తు జరిపించాలని కోరుతూ న్యాయవాది ఎం.ఎల్‌.శర్మ, ప్రముఖ పాత్రికేయులు ఎన్‌.రామ్‌ తదితరులు దాఖలు చేసిన రిట్‌ పిటిషన్లను విచారించిన ధర్మాసనం బుధవారం తన నిర్ణయాన్ని ప్రకటించింది. తదుపరి విచారణను 8 వారాలకు వాయిదా వేసింది. వ్యక్తుల గోప్యత హక్కు ఉల్లంఘన జరిగిందా లేదా అనే విషయాన్ని ఈ కమిటీ పరిశీలిస్తుందని పేర్కొంది.

కేంద్రం స్పష్టత ఇవ్వనందునే..

పెగాసస్‌ సాఫ్ట్‌వేర్‌ వినియోగంపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదని ప్రధాన న్యాయమూర్తి  జస్టిస్‌ ఎన్‌.వి.రమణ తీర్పులో పేర్కొన్నారు. ‘‘వార్తా పత్రికల కథనాల ఆధారంగా దాఖలైన రిట్‌ పిటిషన్లపై తొలుత మాకు కొన్ని అనుమానాలున్నాయి. అయితే, అంశానికున్న తీవ్రతను దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేశాం. 2019 నుంచి పెగాసస్‌ స్పైవేర్‌ను వినియోగించారా? లేదా? అన్న సమాచారాన్ని వెల్లడించడానికి కేంద్రానికి ఎంతో సమయం ఇచ్చాం. కానీ ఎలాంటి స్పష్టత లేకుండా కేంద్రం సంక్షిప్త అఫిడవిట్‌ మాత్రమే దాఖలు చేసింది. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం తన విధానాన్ని స్పష్టంగా చెప్పి ఉంటే, అది కొంతమేర సహాయపడేది. సమాచారం ఇవ్వడానికి తిరస్కరించింది. కేంద్ర ప్రభుత్వం ఈ ఆరోపణలను గంప గుత్తగా స్పష్టత లేకుండా కొట్టేసింది. మేం జాతీయ భద్రతకు సంబంధించిన సమాచారాన్ని ఏమీ కోరబోమని సొలిసిటర్‌ జనరల్‌కు చాలాసార్లు చెప్పాం. పదేపదే ఎన్ని హామీలిచ్చినప్పటికీ కేంద్ర ప్రభుత్వం తన విధానంపై కానీ, కోర్టు ముందున్న కేసులోని వాస్తవాలపై కానీ స్పష్టత ఇవ్వలేకపోయింది’’ అని తెలిపారు. జాతీయ భద్రతా కారణంగా పెగాసస్‌ వినియోగంపై వివరాలు వెల్లడించలేమన్న కేంద్ర ప్రభుత్వ వాదనపై ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.

వ్యక్తిగత స్వేచ్ఛకు రక్షణ

‘‘నీవు ఒక విషయాన్ని రహస్యంగా ఉంచాలనుకుంటే... దాన్ని నీ నుంచి కూడా దాచిపెట్టాలి’’అన్న ఆంగ్ల నవలా రచయిత జార్జ్‌ ఆర్వెల్‌ మాటలను ఉటంకిస్తూ జస్టిస్‌ ఎన్‌.వి.రమణ ఈ తీర్పును ప్రారంభించారు. ‘‘మనం ఇప్పుడు సమాచార విప్లవ శకంలో జీవిస్తున్నాం. ఇక్కడ వ్యక్తుల జీవితాలన్నీ క్లౌడ్‌లు, డిజిటల్‌ డోసియర్లలో నిక్షిప్తమై ఉంటున్నాయి. సాంకేతిక పరిజ్ఞానం ప్రజల జీవితాలను మెరుగుపరిచే సాధనంగా ఉంటూనే, మరోవైపు అదే సమయంలో అది వ్యక్తుల పవిత్రమైన ప్రైవేటు జీవితంలోకి చొరబడటానికి ఉపయోగపడుతోందన్న విషయాన్ని మనం గుర్తించాలి. నాగరికమైన ప్రజాస్వామ్య సమాజంలో ప్రతి ఒక్కరికీ తమ వ్యక్తిగత జీవితంపై హేతుబద్ధమైన అంచనాలుంటాయి. వ్యక్తిగత గోప్యత అన్నది కేవలం పాత్రికేయులు, సామాజిక కార్యకర్తలకు సంబంధించిన విషయంకాదు. ఈ దేశంలోని ప్రతి పౌరుడి వ్యక్తిగత స్వేచ్ఛకూ రక్షణ కల్పించాల్సిందే. అన్ని ప్రాథమిక హక్కుల్లాగానే వ్యక్తిగత గోప్యతకూ కొన్ని నిర్దిష్టమైన పరిమితులు ఉన్నాయన్నది నిజం. అయితే అలా విధించే ఏ ఆంక్షలైనా రాజ్యాంగ పరీక్షను ఎదుర్కొని నిలబడాల్సిందే. జీవితం, స్వేచ్ఛను రక్షించి వాటి మధ్య సమతౌల్యతను సాధించడంలో ప్రభుత్వానికున్న పాత్రను కోర్టు గుర్తిస్తోంది. ప్రస్తుత ప్రపంచంలో హింస, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడటానికి నిఘా ద్వారా ఇంటెలిజెన్స్‌ వ్యవస్థలు సమాచారం సేకరించడం తప్పనిసరి. ఆ సమాచారం సేకరించడానికి వ్యక్తిగత స్వేచ్ఛలో జోక్యంచేసుకొనే అవసరం రావొచ్చు. అయితే అది కేవలం జాతీయ భద్రతను రక్షించడానికి అత్యవసరమైనప్పుడు, దాని వరకు మాత్రమే చేయాలి. అలాంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించేటప్పుడు సాక్ష్యాధారాలను అనుసరించే వెళ్లాలి. ప్రజాస్వామ్య దేశంలో చట్టాన్ని అనుసరించి పరిపాలన సాగాలి. రాజ్యాంగం రూపొందించిన నిబంధనలను అనుసరించి రక్షణ చర్యలు తీసుకుంటే తప్ప వ్యక్తులపై విచక్షణారహితంగా నిఘా పెట్టడానికి వీల్లేదు’’ అని జస్టిస్‌ ఎన్‌.వి.రమణ  తీర్పులో పేర్కొన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో పత్రికా స్వేచ్ఛ, వాక్‌ స్వాతంత్య్రం కీలకమైనవని తెలిపారు.

కమిటీ ఎందుకు వేయాల్సి వచ్చిందంటే..

కొన్ని నిర్దిష్టమైన కారణాల వల్ల విధిలేని పరిస్థితుల్లోనే కమిటీని ఏర్పాటుచేస్తూ   ఉత్తర్వులు జారీ చేస్తున్నట్లు   జస్టిస్‌ ఎన్‌.వి.రమణ తీర్పులో వివరించారు.

వ్యక్తిగత గోప్యత, భావ ప్రకటన స్వేచ్ఛ ప్రభావితమవుతోందని ఆరోపిస్తున్నందున ఆ అంశాన్ని పరీక్షించాల్సి ఉంది.

స్పైవేర్‌ ఆరోపణల వల్ల మొత్తం పౌర సమాజం ప్రభావితమయ్యే అవకాశం ఉంది. అది దుష్పరిణామాలకు దారి తీయవచ్చు.

ఆరోపణలపై తీసుకున్న చర్యల గురించి కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన విధానమేదీ చెప్పలేదు.

విదేశాలు, విదేశీ సంస్థల జోక్యం.. సమస్య తీవ్రతను పెంచాయి.

మన దేశ ప్రజలపై నిఘా ఉంచడంలో కొన్ని విదేశీ అధికార వ్యవస్థలు, సంస్థలు, ప్రైవేటు వ్యవస్థల ప్రమేయం ఉండే అవకాశం ఉంది.

ప్రజా హక్కులను కాలరాయడంలో కేంద్ర, రాష్ట్రాలు భాగస్వాములైనట్లు ఆరోపణలున్నాయి.

ఫోన్ల ట్యాపింగ్‌, నిఘా ఆరోపణల్లోని వాస్తవాలను తెలుసుకొనేందుకు మాత్రమే ఈ రిట్‌ పిటిషన్లు అవకాశం కల్పిస్తున్నాయి. ప్రజలపై సాంకేతికతను ప్రయోగించినప్పటికీ అది న్యాయ పరిధిలో ఉందా? లేదా? అన్నది తదుపరి పరీక్షించాల్సి ఉంటుంది అని ధర్మాసనం పేర్కొంది. ఈ కారణాలను దృష్టిలో ఉంచుకొని వచ్చిన ఆరోపణలపై విచారణ కోసం నిపుణుల కమిటీ ఏర్పాటుకు అవకాశమివ్వాలన్న కేంద్ర  ప్రభుత్వ విజ్ఞప్తిని తిరస్కరిస్తున్నట్లు పేర్కొంది. అలాంటి అవకాశమిస్తే ‘న్యాయం చేయడమేకాదు, చేసినట్లు కనిపించాలన్న’ సహజ న్యాయసూత్రాన్ని విస్మరించినట్లవుతుందని జస్టిస్‌ ఎన్‌.వి.రమణ ధర్మాసనం అభిప్రాయపడింది.

పెగాసస్‌ నిఘా వివాదంపై దర్యాప్తు జరిపే త్రిసభ్య కమిటీకి సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌.వి.రవీంద్రన్‌ నేతృత్వం వహిస్తారు. కమిటీలో ప్రొఫెసర్‌ నవీన్‌కుమార్‌ చౌదరి (గాంధీనగర్‌లోని నేషనల్‌ ఫోరెన్సిక్‌ సైన్స్‌ యూనివర్శిటీ), ప్రొఫెసర్‌ పి.ప్రబహరన్‌(అమృత విశ్వవిద్యాపీఠం), ప్రొఫెసర్‌ అశ్విన్‌ అనిల్‌ గుమస్తే (ఐఐటీ బాంబే) సభ్యులుగా ఉంటారు. జస్టిస్‌ రవీంద్రన్‌కు సాంకేతిక అంశాల్లో సహాయకులుగా నిఘా విభాగ మాజీ అధికారి అలోక్‌ జోషి, అంతర్జాతీయ నిపుణుడు సుదీప్‌ ఒబెరాయ్‌ను సుప్రీంకోర్టు నియమించింది.


కమిటీ సభ్యుల ఎంపికపై భారీ కసరత్తు

ప్రస్తుతం ఉన్న వైరుద్ధ్యమైన ప్రపంచంలో ప్రభుత్వ వ్యవస్థలు, ప్రైవేటు సంస్థలపై ఆధారపడకుండా ఇతర మార్గాల నుంచి ఎలాంటి ఉద్దేశాలు ఆపాదించని, స్వతంత్ర, సమర్థులైన నిపుణులను ఎంపికచేయడం అత్యంత కష్టంగా మారినట్లు ధర్మాసనం పేర్కొంది. స్వతంత్రంగా సేకరించిన సమాచారం ఆధారంగా కొందరు నిపుణులను ఎంపిక చేసినట్లు తెలిపింది. ‘కొందరు ఈ బాధ్యతలను వినయపూర్వకంగా తిరస్కరిస్తే, మరికొందరు ఇతర కారణాలరీత్యా తప్పుకున్నారు. కానీ మేం సదుద్దేశంతో ప్రయత్నించి అత్యంత ప్రముఖులైన నిపుణులను ఈ కమిటీ కోసం ఎంపిక చేశాం. వీరేకాకుండా ఇతరత్రా ఇంకా ఎవరైనా నిపుణుల సహాయం తీసుకొనే స్వేచ్ఛను ఈ కమిటీకి నేతృత్వం వహిస్తున్న న్యాయమూర్తికి ఇస్తున్నాం’ అని ధర్మాసనం పేర్కొంది.

కమిటీకి నేతృత్వం..

జస్టిస్‌ ఆర్‌.వి.రవీంద్రన్‌: సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి. 2005 సెప్టెంబరు 9 నుంచి 2011 అక్టోబరు15 వరకు సర్వోన్నత న్యాయస్థానంలో జడ్జీగా ఉన్నారు. కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో ఓబీసీ రిజర్వేషన్లు, 1993 ముంబయి వరుస బాంబు పేలుళ్ల కేసు, కృష్ణా-గోదావరి బేసిన్‌లో సహజవాయువు వివాదంపై తీర్పు వెలువరించిన ధర్మాసనాల్లో జస్టిస్‌ రవీంద్రన్‌ సభ్యులు.

సభ్యులు

నవీన్‌కుమార్‌ చౌదరి: గాంధీనగర్‌లోని నేషనల్‌ ఫోరెన్సిక్‌ సైన్స్‌ యూనివర్శిటీలో సైబర్‌ సెక్యూరిటీ అండ్‌ డిజిటల్‌ ఫోరెన్సిక్‌ విభాగం ప్రొఫెసర్‌. సైబర్‌ సెక్యూరిటీ అంశాల్లో సుదీర్ఘ అనుభవం.

పి.ప్రబహరన్‌: కేరళ అమృతపురిలోని అమృతా విశ్వవిద్యాపీఠంలో కంప్యూటర్‌ ఇంజినీరింగ్‌  ప్రొఫెసర్‌. మాల్‌వేర్‌, కృత్రిమ మేధ తదితర అంశాల్లో 20ఏళ్ల అనుభవం.

అశ్విన్‌ అనిల్‌ గుమస్తే: బాంబే ఐఐటీలోని కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌ విభాగానికి చెందిన ఇన్‌స్టిట్యూట్‌ ఛైర్‌ అసోసియేట్‌ ప్రొఫెసర్‌. అమెరికాలో 20 పేటెంట్లు ఆయన సొంతం. 150కిపైగా పరిశోధన పత్రాలను ప్రచురించారు. మూడు పుస్తకాలు రచించారు. విక్రమ సారాభాయ్‌ రీసెర్చ్‌ అవార్డుతో పాటు పలు జాతీయ పురస్కారాలను పొందారు.

సహాయకులు

ఆలోక్‌ జోషి: 1976 బ్యాచ్‌ మాజీ ఐపీఎస్‌ అధికారి. ఇంటెలిజెన్స్‌ బ్యూరో సంయుక్త కార్యదర్శి, భారత గూఢచారి సంస్థ ‘రా’ కార్యదర్శి, జాతీయ సాంకేతిక పరిశోధన సంస్థ ఛైర్మన్‌గా పనిచేశారు.

సుదీప్‌ ఒబెరాయ్‌: ఇంటర్నేషనల్‌ ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ స్టాండర్డైజేషన్‌/ఇంటర్నేషనల్‌ ఎలెక్ట్రో-టెక్నికల్‌ కమిషన్‌/జాయింట్‌ టెక్నికల్‌ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటైన ఉప కమిటీకి నేతృత్వం వహిస్తున్నారు.

*   

ఇదీ జరిగింది..

పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలకు ఒక రోజు ముందు పెగాసస్‌తో ఫోన్ల హ్యాకింగ్‌ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. పెగాసస్‌ స్పైవేర్‌తో లక్ష్యంగా చేసుకున్న వారిలో సుమారు 300 మందికి పైగా భారతీయులు ఉన్నట్లు కథనాలు వెలువడ్డాయి.

జులై 18: ఇజ్రాయెల్‌ సంస్థకు చెందిన స్పైవేర్‌ సాంకేతికతతో పలు దేశాల్లోని పాత్రికేయులు, రాజకీయ నాయకులు, సామాజిక కార్యకర్తలపై నిఘా ఉంచారనే వార్తల వెల్లడి

జులై 22: సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించాలని కోరుతూ న్యాయవాది ఎం.ఎల్‌.శర్మ పిటిషన్‌

జులై 27: స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని కోరుతూ పాత్రికేయుడు ఎన్‌.రామ్‌, శశికుమార్‌ తదితరుల పిటిషన్‌.

ఆగస్టు 5: సుప్రీంకోర్టు విచారణ ప్రారంభం

ఆగస్టు 16: కేంద్ర ప్రభుత్వ అఫిడవిట్‌ దాఖలు

ఆగస్టు 17: కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసు జారీ

అక్టోబరు 27: నిఘా, స్పైవేర్‌ ఆరోపణలపై స్వతంత్ర దర్యాప్తు కమిటీ నియామకం.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని