పర్యాటక రంగంలో రూ.2,868 కోట్లపెట్టుబడులు

ప్రధానాంశాలు

పర్యాటక రంగంలో రూ.2,868 కోట్లపెట్టుబడులు

పలు ప్రాజెక్టులకు ఎస్‌ఐపీబీ ఆమోదం
48 వేల మందికి ఉపాధి అవకాశాలు

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో పర్యాటక రంగం అభివృద్ధికి రూ.2,868.60 కోట్ల పెట్టుబడులతో వివిధ ప్రాజెక్టుల ఏర్పాటుకు సీఎం జగన్‌ అధ్యక్షతన బుధవారం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (ఎస్‌ఐపీబీ) ఆమోదించింది. ఈ ప్రాజెక్టుల ద్వారా కొత్తగా 1,564 గదులు పర్యాటకులకు అందుబాటులోకి వస్తాయని ప్రభుత్వం పేర్కొంది. సుమారు 48వేల మందికి ఉపాధి లభిస్తుందని వెల్లడించింది. ఐదేళ్లలో ఈ ప్రాజెక్టులను పూర్తిచేయనున్నట్లు కంపెనీలు తెలిపాయంది. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో సీఎం జగన్‌ మాట్లాడుతూ.. ‘విశాఖలో లండన్‌ ఐ తరహా ప్రాజెక్టు తీసుకురావటంపై దృష్టి పెట్టాలి. పర్యాటక రంగానికి రాష్ట్రం చిరునామా కావాలి. ప్రపంచ పర్యాటకులను ఆకర్షించేలా వివిధ ప్రాజెక్టులను రూపొందించాలి. అప్పుడే ప్రత్యక్షంగా, పరోక్షంగా ఈ రంగంపై ఆధారపడేవారికి ఉపాధి అవకాశాలు పెరుగుతాయి.  

ఆధునిక వసతులు అందుబాటులోకి రావటం వల్ల పర్యాటక పరంగా రాష్ట్ర స్థాయి పెరుగుతుంది. నిర్దేశిత సమయంలో ప్రాజెక్టులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలి’ అని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశానికి ప్రభుత్వ  ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ, పలువురు ఉన్నతాధికారులు, మంత్రులు హాజరయ్యారు.

ఎస్‌ఐపీబీ ఆమోదించిన ప్రాజెక్టులు

విశాఖపట్నం, తిరుపతి, గండికోట, హార్సిలీహిల్స్‌, పిచ్చుకలంకలో ఒబెరాయ్‌ ఆధ్వర్యంలో ఒబెరాయ్‌ విలాస్‌ బ్రాండ్‌తో రిసార్టులు

విశాఖపట్నం శిల్పారామంలో హయత్‌ సంస్థ ఆధ్వర్యంలో స్టార్‌ హోటల్‌, కన్వెన్షన్‌ సెంటర్‌

తాజ్‌ వరుణ్‌ బీచ్‌ హోటల్‌ పేరుతో విశాఖలో మరో హోటల్‌, సర్వీసు అపార్ట్‌మెంట్‌

విశాఖపట్నంలో టన్నెల్‌ అక్వేరియం

విశాఖలో స్కై టవర్‌ నిర్మాణం

విజయవాడలో హయత్‌ ప్యాలెస్‌ హోటల్‌

అనంతపురం జిల్లా పెనుకొండ జ్ఞానగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయం వద్ద ఇస్కాన్‌ ఛారిటీస్‌ ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రం

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని