జగన్‌ కేసుల్లో నేటి నుంచి విచారణ

ప్రధానాంశాలు

జగన్‌ కేసుల్లో నేటి నుంచి విచారణ

వాదనలు వినిపించాలన్న తెలంగాణ హైకోర్టు

ఈనాడు, హైదరాబాద్‌: ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి అక్రమాస్తుల కేసులకు చెందిన పిటిషన్లపై రోజువారీగా విచారణ చేపడతామంటూ తెలంగాణ హైకోర్టు బుధవారం స్పష్టత ఇచ్చింది. కేసుల వారీగా నిందితులు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ చేపడతామని తెలిపారు. జగన్‌ అక్రమాస్తుల కేసుల్లోని నిందితులు తమపై కేసులు కొట్టేయాలంటూ దాఖలు చేసిన పలు పిటిషన్లపై జస్టిస్‌ షమీమ్‌ అక్తర్‌ విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా పిటిషనర్ల తరఫు సీనియర్‌ న్యాయవాదులు వినోద్‌ దేశ్‌పాండే, టి.నిరంజన్‌రెడ్డిలతో పాటు ఎన్‌.నవీన్‌కుమార్‌, శివరాజ్‌ శ్రీనివాస్‌ తదితరులు ఒక్కో కేసుపై విచారణ చేపట్టి అందులో నిందితులు దాఖలుచేసిన అన్ని పిటిషన్లపై విచారణ చేపట్టాలని కోరారు. మొదట దాఖలుచేసిన కేసుల వారీగా విచారణ చేపట్టాలన్నారు. వారం రోజులు గడువు ఇవ్వాలని, లేదంటే వచ్చే వారం విచారణ చేపట్టాలని కోరగా న్యాయమూర్తి నిరాకరించారు. ఇప్పటికే జాప్యం జరిగిందని, కేసులు దాఖలై ఎన్నాళ్లయిందో చూడాలన్నారు. గురువారం నుంచి రోజూ విచారణ చేపడతామని, అందుకు న్యాయవాదులు సిద్ధంగా ఉండాలన్నారు. సీబీఐ తరఫు న్యాయవాది కె.సురేందర్‌ జోక్యం చేసుకుంటూ జగన్‌ అక్రమాస్తులకు చెందిన 12 కేసుల్లో 4 కేసుల్లోని నిందితులు మినహా మిగిలిన కేసుల్లోని నిందితులు పిటిషన్లు దాఖలు చేశారన్నారు. ఇందులో మొదట హెటిరో, అరబిందో కేసు నమోదైందనగా వాటితోనే విచారణ మొదలు పెడదామని న్యాయమూర్తి స్పష్టం చేశారు. ఈ దశలో పిటిషనర్ల తరఫు న్యాయవాదులు జోక్యం చేసుకుంటూ కింది కోర్టులో జరుగుతున్న విచారణపై రెండు వారాల పాటు స్టే ఇవ్వాలని కోరగా న్యాయమూర్తి నిరాకరిస్తూ, స్టే గురువారం వరకు ఉంటుందని తెలిపారు. మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్లలో అరబిందో ఫార్మా, హెటిరో ఫార్మా లిమిటెడ్‌లకు భూకేటాయింపుల్లో అవకతకవకలు, దీనికి అనుగుణంగా జగన్‌ కంపెనీల్లోకి పెట్టుబడులపై సీబీఐ నమోదుచేసిన కేసులో నిందితులు హెటిరో ఎండీ ఎం.శ్రీనివాసరెడ్డి, హెటిరో కంపెనీ తదితరులు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ గురువారం ప్రారంభం కానుంది.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని