Ap News: అత్యాచారం కేసు... అదుపులో ఇద్దరు
close

ప్రధానాంశాలు

Ap News: అత్యాచారం కేసు... అదుపులో ఇద్దరు

నేడు అధికారికంగా వెల్లడించే అవకాశం

ఈనాడు, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పుష్కరఘాట్‌ అత్యాచార ఘటనలో ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారు పోలీసుల అదుపులో ఉన్నారనే విషయాన్ని హోంమంత్రి మేకతోటి సుచరిత మంగళవారం గుంటూరులో ధ్రువీకరించారు. పూర్తి విచారణ తరువాత త్వరలోనే మీడియా ముందు వారిని పోలీసులు ప్రవేశపెడతారని ఆమె చెప్పారు. వారి అరెస్టును బుధవారం అధికారికంగా వెల్లడించే అవకాశముంది. యువజంట వద్ద నిందితులు దోచుకెళ్లిన ఫోన్లనూ పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. నిందితులిద్దరికీ నేరచరిత్ర ఉందని.. వారిపై తాడేపల్లి, బందరు స్టేషన్లతోపాటు రైల్వే పోలీసు స్టేషన్‌లో పలు కేసులు నమోదయ్యాయని తెలుస్తోంది. కృష్ణా నది పరిసరాలతోపాటు స్థానిక రైల్వేట్రాక్‌ వెంట నిర్జన ప్రదేశాల్లో ఉంటూ వీరు రైలు ప్రయాణికులతోపాటు ఆ ప్రాంతంలో తిరిగే వారిపై దౌర్జన్యాలకు పాల్పడతారని తెలుస్తోంది. దోచుకెళ్లిన సొత్తుతో మద్యం, గంజాయి, ఇతర మత్తు పదార్థాలు కొనుక్కుంటారని పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైనట్లు తెలిసింది.

ఒకరిది తాడేపల్లి.. మరొకరిది చినగంజాం!

నిందితుల్లో ఒకరిది తాడేపల్లి కాగా, మరొకరిది ప్రకాశం జిల్లా చినగంజాం. చినగంజాంకు పోలీసు బృందం వెళ్లి అతడి గురించి ఆరా తీసింది. మరో నిందితుడిపై బందరులో కేసులున్నాయని తెలుసుకొని అక్కడికి వెళ్లింది. 19న రాత్రి బాధితురాలిపై అత్యాచారానికి పాల్పడ్డాక నిందితులు నదీమార్గంలో పడవపై పారిపోయి తాడేపల్లికి చేరుకున్నారని తెలుస్తోంది. కొంతసేపు బకింగ్‌హామ్‌ కాలువపై ఉన్న రైల్వే బ్రిడ్జి వద్ద గడిపినట్లు సమాచారం. పోలీసులు చురుగ్గా దర్యాప్తు చేస్తున్నారని  గమనించి నిందితులిద్దరూ ఆదివారం పరారయ్యారని తెలుస్తోంది. నిందితుల్లో ఒకరు ఈ నెల 17న అతిగా మద్యం తాగి తాడేపల్లిలో హంగామా చేస్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకొని విడిచిపెట్టారని తెలుస్తోంది.

ఫోన్లే పట్టించాయా?

నిందితులు దోచుకున్న బాధితురాలి ఫోన్‌ను తాకట్టు పెట్టారు. పోలీసులు ఆ ఫోన్‌ కోసం మూడు రోజుల నుంచి టవర్‌ లొకేషన్‌ ఆధారంగా గుర్తించేందుకు ప్రయత్నించారు. మంగళవారం ఆ ఫోన్‌ను తాడేపల్లిలో ఒక మహిళ ఆన్‌ చేయడంతో ఆమెను పిలిపించి విచారించారు. తాపీమేస్త్రీ అయిన తన భర్తకు విజయవాడకు చెందిన ఒకరు విక్రయించినట్లు ఆమె తెలిపినట్లు సమాచారం. ఆయనకు ఆ ఫోన్‌.. ఈ కేసులో అనుమానితుల నుంచి చేరినట్లు తెలుస్తోంది.

బాధితురాలికి సాయం అందజేత

బాధితురాలికి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.5లక్షల సాయాన్ని మంగళవారం హోంమంత్రి సుచరిత బాధితురాలి తల్లికి గుంటూరు జీజీహెచ్‌లో అందజేశారు.



Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని