close

ప్రధానాంశాలు

సమాఖ్య స్ఫూర్తిని మరచిన కేంద్రం

కరోనాను ఎదుర్కోవడంలో అన్నీ ఏకపక్ష నిర్ణయాలే
సోనియా గాంధీ విమర్శ
విపక్ష నేతలతో భేటీ

ఈనాడు, దిల్లీ: కరోనా మహమ్మారిని ఎదుర్కొనే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం సమాఖ్య స్ఫూర్తిని పూర్తిగా విస్మరించిందని కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ విమర్శించారు. మచ్చుకైనా ప్రజాస్వామ్య విలువలను పాటించలేదని ఆరోపించారు. వలసకూలీల దుస్థితి విషయమై శుక్రవారం కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో జరిగిన ప్రతిపక్ష నేతల సమావేశంలో ఆమె ప్రసంగించారు. వీడియో కాన్ఫరెన్స్‌ రూపంలో జరిగిన ఈ భేటీలో 22 పార్టీల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ లాక్‌డౌన్‌ విధింపునకు ప్రాతిపదిక ఏమిటో, దానిని ఎత్తివేసిన అనంతరం అనుసరించాల్సిన వ్యూహం ఏమిటో ప్రభుత్వానికే తెలియదని అన్నారు. దీనిపై చర్చించడానికి పార్లమెంటునుగానీ, సంబంధిత స్థాయీ సంఘాన్నిగానీ సమావేశపరిచే సూచనలేవీ కనిపించడం లేదని చెప్పారు. అధికారమంతా ప్రధాని కార్యాలయంలో కేంద్రీకృతమయిందని విమర్శించారు. సంస్కరణల పేరుతో ప్రభుత్వ రంగ సంస్థలను ‘గొప్ప క్లియరెన్స్‌ సేల్‌’ తరహాలో విక్రయించేందుకు ప్రభుత్వం దుస్సాహసం చేస్తోందని ఆరోపించారు. కార్మిక చట్టాలను రద్దు చేస్తోందని, ఇలాంటి ఏకపక్ష నిర్ణయాలను తాము సహించబోమని అన్నారు. ప్రధాని ప్రకటించిన రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీ క్రూర పరిహాసంలాంటిదని వ్యాఖ్యానించారు. ‘‘ఈ ప్రభుత్వం వద్ద ఎలాంటి పరిష్కార మార్గాలు లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. పేదలపై కనీసం కరుణ చూపకపోవడం వేదనకు గురిచేస్తోంది’’ అని అన్నారు.
ఆంపన్‌ను జాతీయ విపత్తుగా ప్రకటించాలి
పశ్చిమ బెంగాల్‌, ఒడిశాల్లో విధ్వంసం సృష్టించిన ఆంపన్‌ తుపానును జాతీయ విపత్తుగా ప్రకటించాలని ఈ సమావేశం డిమాండు చేసింది. ఈ భేటీలో పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే, ఎన్‌సీపీ అధినేత శరద్‌ పవార్‌, మాజీ ప్రధాని దేవెగౌడ, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా, డీఎంకే నేత స్టాలిన్‌ తదితరులు పాల్గొన్నారు.
హాజరుకాని ఎస్పీ, బీఎస్పీ
సోనియా గాంధీ నిర్వహించిన ఈ సమావేశానికి ఉత్తర్‌ప్రదేశ్‌లో ప్రధాన పార్టీలైన ఎస్పీ, బీఎస్పీలు హాజరు కాలేదు. కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా ఉత్తర్‌ప్రదేశ్‌ రాజకీయాల్లో చురుగ్గా వ్యవహరిస్తుండడమే ఇందుకు కారణమని పరిశీలకులు భావిస్తున్నారు. ఇలాంటి సందర్భంలో కాంగ్రెస్‌కు మద్దతు తెలపడం రాజకీయంగా తమకు లబ్ధి కలిగించదని ఎస్పీ, బీఎస్పీ నేతలు భావిస్తున్నారు.

రాజకీయం

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.