close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
సంబంధం లేకుంటే.. అరగంటలో ఎందుకొచ్చారు!

రఘునందన్‌రావును ఉద్దేశించి మంత్రి హరీశ్‌ ప్రశ్న

ఈనాడు, సిద్దిపేట: ఒక వ్యక్తి ఇంట్లో దొరికిన డబ్బుతో సంబంధం లేకపోతే దుబ్బాకలో ప్రచారం చేస్తున్న భాజపా అభ్యర్థి రఘునందన్‌రావు అరగంటలోనే ఎందుకు సిద్దిపేట చేరుకున్నారో చెప్పాలని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు. తన ఇంట్లో ఉంచిన నగదు ఎన్నికల్లో ఖర్చు పెట్టేందుకే తెచ్చారని ఆ ఇంటి యజమానే చెబుతున్నట్లుగా ఉన్న వీడియోలు బయటకు వచ్చాయన్నారు. దీంతో భాజపా నేతల పరిస్థితి కుడితిలో పడిన ఎలుక చందంగా మారిందన్నారు. తొగుట మండలంలో మంగళవారం నిర్వహించిన యువజన బహిరంగ సభలో హరీశ్‌రావు మాట్లాడుతూ.. దుబ్బాక బస్టాండు వద్ద చర్చకు రావాలని తాను విసిరిన సవాల్‌తో భాజపా నేతలు ఆత్మరక్షణలో పడిపోయారన్నారు. దాన్నుంచి బయటపడేందుకే గాయిగత్తర చేస్తున్నారని విమర్శించారు. కొత్త నాటకానికి తెరలేపి సిద్దిపేటలో డ్రామా చేస్తున్నారని ఎద్దేవా చేశారు. భాజపా నేతలు వాళ్లే అంగీలు చింపుకొని తెరాస వాళ్లే చింపారని అంటారని, అందుకే జాగ్రత్తగా ఉండాలని యువతకు సూచించారు. అనంతగిరి, రంగనాయక్‌ సాగర్‌, కొండపోచమ్మ సాగర్‌ ప్రాంతాల్లో ముంపు బాధితులకు ఇచ్చినట్లుగా మల్లన్నసాగర్‌ నిర్వాసితులకూ పరిహారం అందేలా చూస్తామన్నారు. న్యాయస్థానాల్లో కేసులు వేయడంతో ఇక్కడ ఆలస్యం జరిగిందని చెప్పారు. 18 ఏళ్లు నిండిన వారితో పాటు 60 ఏళ్లు పైబడిన వారికి ప్యాకేజీ ఇస్తామని హరీశ్‌ చెప్పారు.

ఆ రాష్ట్రాల్లోనే నిరుద్యోగిత అధికం
తెలంగాణలో నిరుద్యోగమంటూ మాట్లాడుతున్నారని, దేశ సగటు కంటే తెలంగాణలో నిరుద్యోగిత శాతం తక్కువని మంత్రి హరీశ్‌రావు అన్నారు. భాజపా పాలిత రాష్ట్రాలైన ఉత్తరాఖండ్‌, హరియాణా, తిప్రుర, గోవా తదితర రాష్ట్రాల్లో ఇది 17 శాతాన్ని మించి ఉందని లెక్కలతో వివరించారు. ఏటా కోటి ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన మోదీ ప్రభుత్వం.. నోట్ల రద్దుతో ఉన్న ఉద్యోగాలను ఊడగొట్టిందన్నారు. కాంగ్రెస్‌ అంటే కాలిపోయే మోటార్లు, భాజపా అంటే బాయికాడ మీటర్లు.. తెరాస అంటే 24 గంటల పాటు నాణ్యమైన ఉచిత కరెంటు అంటూ ప్రస్తావించారు. దిల్లీ తెచ్చిన చట్టాన్ని ఆంధ్రప్రదేశ్‌లో అమలు చేస్తున్నారని.. అక్కడ మోటార్లకు మీటర్లను బిగిస్తున్నారని హరీశ్‌ వివరించారు. ముత్యంరెడ్డి మంచి వ్యక్తి అని చెబుతున్న ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆయనకు 2018లో ఎందుకు టికెట్‌ ఇవ్వలేదో చెప్పాలన్నారు. కాంగ్రెస్‌లో చేరి ముత్యంరెడ్డి ఆత్మ క్షోభకు గురయ్యేలా చేసిన శ్రీనివాస్‌రెడ్డి ప్రజలకేం సేవ చేస్తారని మంత్రి విమర్శించారు. సభలో తెరాస అభ్యర్థిని సోలిపేట సుజాత, మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఆందోల్‌ ఎమ్మెల్యే క్రాంతికిరణ్‌ తదితరులు పాల్గొన్నారు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.