close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
గెలిచినా ఫలితాలు మార్చేశారు

కరెంటు తీసేసి దౌర్జన్యం చేశారు
చంద్రబాబు ఎదుట పలువురు పార్టీ మద్దతుదారుల ఆవేదన
ఈనాడు - అమరావతి

పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా అధికార పార్టీ నాయకులు తమపై దౌర్జన్యానికి పాల్పడ్డారని, తమకే ఆధిక్యం వచ్చినా అధికారులు ఫలితాలను తారుమారు చేసి వైకాపా బలపర్చిన అభ్యర్థులు గెలిచినట్టు ప్రకటించారని తెదేపా మద్దతుదారులు పలువురు వాపోయారు. తెదేపా మద్దతుతో పోటీ చేసిన కొందరు అభ్యర్థులు, వారి సన్నిహితులు సోమవారం తెదేపా కేంద్ర కార్యాలయానికి వచ్చారు. పార్టీ అధినేత చంద్రబాబు విలేకరుల సమావేశంలో వారితో మాట్లాడించారు. వారు వ్యక్తంచేసిన ఆవేదన ఇది.

నాకు 120 ఓట్ల మెజారిటీ ఉన్నా...  
జంగాల వెంకటరమణ,అంగిశెట్టిపల్లి (చిత్తూరు జిల్లా) సర్పంచి అభ్యర్థి

‘‘నాకు 120 మెజారిటీ ఉంది. నేనే గెలిచినట్టు అధికారులు చెప్పారు. డిక్లరేషన్‌ ఇవ్వమని అడిగితే... కాసేపు ఆగమని స్టేజ్‌-2 అధికారి చెప్పారు. స్థానిక ఎమ్మెల్యే ఫోన్‌ చేయడంతో ఫలితం ప్రకటించకుండా ఆపేశారు. మూడు గంటలపాటు దండంపెట్టి విజ్ఞప్తి చేసినా నాకు డిక్లరేషన్‌ ఇవ్వలేదు. కాసేపటికి 12 ఓట్లతో వైకాపా మద్దతుదారు గెలిచినట్టు ప్రకటించారు. నేను రీకౌంటింగ్‌ చేయమని కోరినా పట్టించుకోలేదు. ఎమ్మెల్యే నవాజ్‌ బాషా వచ్చి ఏం చేసుకుంటారో చేసుకోండి, రీకౌంటింగ్‌ చేసేది లేదని చెప్పారు. మమ్మల్ని తరిమేసి వారికి డిక్లరేషన్‌ ఫారం ఇచ్చారు. 7 వార్డులో మా అభ్యర్థులు గెలిచినా ఇంతవరకు డిక్లరేషన్‌ ఫారాలు కూడా ఇవ్వలేదు’’

చంపేస్తామంటున్నారు
మేదరమెట్ల అనురాధ, ఉంగుటూరు గ్రామం (గుంటూరు జిల్లా) సర్పంచి అభ్యర్థి

‘‘నేను ఉంగుటూరు సర్పంచ్‌గా గెలిచినట్టు ప్రకటించాక... కౌంటింగ్‌ కేంద్రం నుంచి బయటకు రాకుండా ప్రత్యర్థులు మమ్మల్ని అడ్డుకున్నారు. రాళ్లు, కర్రలతో దాడి చేశారు. మర్నాడు ఉదయం మా ఇళ్లపై దాడులకు పాల్పడ్డారు. మేదరమెట్ల సోమశేఖర్‌(మాజీ సర్పంచ్‌)ని చంపేస్తామంటూ 70 మంది ఊరి మీదకు వచ్చారు. మీరు ఎట్లా తిరుగుతారో చూస్తామని బెదిరిస్తున్నారు’’

గందరగోళం చేశారు
స్వతంత్ర బాబు, టి.ఒడ్డూరు (చిత్తూరు జిల్లా) సర్పంచి అభ్యర్థి

‘‘మా గ్రామంలో 9 వార్డులకు ఎన్నికలు జరిగాయి. ఒక వార్డు ఏకగ్రీవం అయింది. 7 వార్డుల్లో తెదేపా మద్దతుదార్లు గెలిచారు. సర్పంచికి వచ్చే సరికి గందరగోళం చేశారు. మాకు 720 ఓట్లు, వైసీపీ మద్దతుదారునికి 699 ఓట్లు వచ్చాయి. ఒక 25 ఓట్ల కట్ట కనిపించలేదని, అది వైకాపా మద్దతుదారుడిదే, కాబట్టి 4 ఓట్లతో అతను గెలిచినట్టు ప్రకటిస్తున్నామని అధికారులు తెలిపారు. అభ్యంతరం తెలిపినా పట్టించుకోలేదు. రీకౌంటింగ్‌ చేయాలని కోరినా ఆర్వో తిరస్కరించారు. పైగా నాపై 353 సెక్షన్‌ కింద కేసు పెట్టారు’’

చెల్లని ఓట్లతో గోల్‌మాల్‌  
మోహనమ్మ, తీర్థం (చిత్తూరు జిల్లా) సర్పంచి అభ్యర్థి

‘‘మా గ్రామంలో తెదేపా మద్దతుదారుకి 682, వైకాపా మద్దతుదారుకి 682 ఓట్లు వచ్చాయి. లాటరీ వేద్దామని ఆర్వో చెప్పారు. సరే అన్నాం. రెండు గంటలు వేచి చూసి... ఎమ్మార్వో, ఎండీవోలను పిలిపించారు. మళ్లీ రీకౌంటింగ్‌ చేసి చెరొక ఓటు చెల్లలేదని చెప్పి పెండింగ్‌ లో పెట్టారు. ఎండీవో చెల్లనివి, నోటా ఓట్లలో మూడు వైకాపా మద్దతుదారుడికి కలిపేశారు. మాకు విషయం చెప్పకుండా మరుసటి రోజు వైకాపా అభ్యర్థి 3 ఓట్ల తేడాతో గెలిచారని ప్రకటించారు’’

బెదిరిస్తున్నారు..
 మేకల విఠల్‌రావు, వైకుంఠపురం (గుంటూరు జిల్లా) సర్పంచి అభ్యర్థి

‘‘మా పంచాయతీలోని 12 వార్డుల్లో తెదేపా మూడు గెలిచింది. వార్డుల వారీగా చూస్తే వైకాపాకి 100 ఓట్ల మెజార్టీ ఉంది. సర్పంచికి వచ్చేసరికి తెదేపాకి 17 ఓట్ల మెజార్టీ వచ్చింది. అధికారులు మాకు ధ్రువీకరణ పత్రం ఇవ్వలేదు. భారీ బలగాలను మోహరించి, కరెంటు తీసేసి దౌర్జన్యం చేశారు. అర్ధరాత్రి దాటాక 2 గంటల తర్వాత మాకు ధ్రువీకరణ పత్రం ఇచ్చారు. ఇప్పుడు మమ్మల్ని బెదిరిస్తున్నారు.’’

అసలు గెలుపు తెదేపాదే: లోకేశ్‌

ఈనాడు డిజిటల్‌, అమరావతి: ప్రజాస్వామ్యానికి, జగన్‌ రాచరికానికి మధ్య జరిగిన ఎన్నికల్లో స్వల్ప తేడాతో వైకాపా విజయం సాధించినా అసలు గెలుపు తెదేపాదేనని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ స్పష్టం చేశారు. ‘‘తెదేపా మద్దతుదారులు గెలిచిన చోట్ల రీకౌంటింగ్‌ పేరుతో వైకాపా బలపరిచిన అభ్యర్థులు గెలిచినట్లు ప్రకటించుకున్నారు. అరాచకాలకు పాల్పడినా ధైర్యంగా ఎదురొడ్డి నిలిచి గెలిచిన తెదేపా కార్యకర్తలు, నేతలు, అభిమానులందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. ప్రజాస్వామ్యాన్ని రక్షించిన ప్రజలందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు’’ అని ట్విటర్‌లో పేర్కొన్నారు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు