close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
విశాఖను దోచేస్తారు.. జాగ్రత్త!

ఈనాడు, విశాఖపట్నం, న్యూస్‌టుడే, గాజువాక, భీమిలి గ్రామీణం: ‘ఇప్పటికే ఒక్కసారి అవకాశం ఇమ్మంటే నమ్మి అధికారం కట్టబెట్టారు. రెండేళ్లలో ఒక్క అభివృద్ధి పనీ జరగలేదు. మళ్లీ మున్సిపల్‌ ఎన్నికల్లో వైకాపాను నమ్మి అధికారం ఇస్తే విశాఖ నగరాన్ని దోచేస్తారు.. జాగ్రత్త!’ అని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ హెచ్చరించారు. ‘ఎన్నో విశిష్టతలు గల విశాఖను చూస్తే బాధేస్తోంది. ఏ-2 వచ్చి భూదందాలు, విధ్వంసాలు సాగిస్తున్నారు. ఇలాంటి వారిని తరిమికొట్టాలి’ అని పిలుపునిచ్చారు. వైకాపా ప్రభుత్వం వచ్చాక పెంచుతూ పోతాం అంటే పింఛన్లు, రాయితీలు అనుకున్నాంగానీ చింతపండు, నూనెలు, ఉల్లి, గ్యాస్‌ ధరలు పెంచుతారనుకోలేదని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఒకసారి గెలిపించినందుకే స్టీలుప్లాంటును విక్రయించే ప్రణాళిక వేసిన జగన్‌.. మరోసారి గెలిపిస్తే విశాఖనూ అమ్మేస్తారని విమర్శించారు. మున్సిపల్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం విశాఖపట్నం వచ్చిన లోకేశ్‌.. తొలుత సింహాచలంలోని వరాహ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు. అనంతరం గాజువాక, పెదగంట్యాడ, స్టీలుప్లాంటు ప్రాంతాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కూర్మన్నపాలెం కూడలిలో ఉక్కు ఉద్యమకారులను ఉద్దేశించి మాట్లాడారు. భీమిలి, తగరపువలసలలో రోడ్డు షోలో ప్రసంగించారు. సరస్వతీ పార్క్‌ కూడలిలో భవన నిర్మాణ కార్మికులు, ఆటో డ్రైవర్లతో మాట్లాడారు. విద్యార్థులు, నిరుద్యోగ యువతతో వేర్వేరుగా ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆయా సందర్భాల్లో లోకేశ్‌ ప్రసంగం ఆయన మాటల్లోనే..
‘ఆదివారం వస్తే భయమేస్తోంది. ఎవరి ఇంటి గోడ కూలుస్తారో, ఎవరి పొట్ట కొడతారోనన్న ఆందోళన కలుగుతోంది. ఇంటి ముందుకే నిత్యావసరాల సరకులు ఇస్తామన్నారు. వ్యాన్‌ డోరు తెరవలేకపోతున్నారు. 10వేల వ్యాన్లకు రూ.వెయ్యి కోట్లు ఖర్చు చేసి తాడేపల్లికి తిరిగి పంపించారు. సన్న బియ్యం పేరుతో 70ఎంఎం సినిమా అని చెప్పి ఫ్లాప్‌ షో చూపించారు. గత ఎన్నికల ముందు ‘ప్రత్యేక హోదా’ తెస్తామన్నారు. పార్లమెంట్‌లో 28 మంది ఎంపీలున్నా.. కేంద్రంతో ఒక్క మాట మాట్లాడలేకపోయారు. తెదేపా అధికారంలో ఉన్నప్పుడు విశాఖ జిల్లాలో 73 వేల మందికి ఉద్యోగాలు ఇచ్చాం. వీరు రెండేళ్లలో ఒక్క ఉద్యోగమైనా ఇప్పించారా? ఇంట్లో కుక్కను పెంచుకున్నా పన్ను చెల్లించాల్సిన దౌర్భాగ్య స్థితి తెచ్చారు. ఒక చేత్తో రూ.100 ఇచ్చి మరో చేత్తో రూ.వెయ్యి లాగేసుకుంటున్నారు. విశాఖపట్నం గుండెకాయ స్టీల్‌ప్లాంటును ప్రైవేటుపరం కానివ్వం. తెదేపాయే చొరవ తీసుకొని కేంద్రంపై ఒత్తిడి తెస్తుంది. పుర ఎన్నికల్లో తెదేపాను గెలిపిస్తే పేదల నీటి పన్ను మాఫీ చేస్తాం. మూసేసిన అన్న క్యాంటీన్లను తెరిపిస్తాం. పారిశుద్ధ్య కార్మికులకు నెలకు రూ.21వేల జీతం, ఆటో డ్రైవర్లకు శాశ్వత ఆటోస్టాండ్లు నిర్మిస్తాం. ఇంటి పన్నులు సరళీకరిస్తాం. 10 అంశాలతో తెదేపా మేనిఫెస్టోను ప్రజల ముందుంచాం. అది అమలు చేస్తాం’ అని లోకేశ్‌ పేర్కొన్నారు.


ఉన్న పరిశ్రమలు పోతున్నాయ్‌

గరంలోని ఓ హోటల్‌లో టీఎన్‌ఎస్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో విద్యార్థులు, నిరుద్యోగ యువతతో ఏర్పాటు చేసిన ముఖాముఖిలో పలువురు అడిగిన ప్రశ్నలకు లోకేశ్‌ సమాధానమిచ్చారు. రాష్ట్రంలో విచిత్ర పరిస్థితి నెలకొందని కొత్త పరిశ్రమలు రాకపోగా ఉన్న వాటిని పంపించేస్తున్నారని వాపోయారు. యువతకు అవకాశాలు లేక, పెట్టుబడులు రాక రాష్ట్రం చేసే అప్పులు చూస్తుంటే భవిష్యత్తులో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు