500 కాకపోతే... వెయ్యి రోజుల పండగ చేస్కోండి

ప్రధానాంశాలు

500 కాకపోతే... వెయ్యి రోజుల పండగ చేస్కోండి

ఉద్యమం బోగస్‌.. అది బినామీలను రక్షించుకునే చర్య
పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శ

ఈనాడు డిజిటల్‌-అమరావతి: ‘‘అమరావతిలో 500 రోజులు కాకపోతే వెయ్యి రోజుల పండగ చేసుకోండి.. ఎవరు వద్దన్నారు?’’ అని పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు. అమరావతి పేరిట చేస్తున్న ఉద్యమాలు, పండగలన్నీ బోగస్‌... అవి బినామీలను రక్షించుకునే చర్యలే తప్ప రైతుల్ని, అమరావతి ప్రాంతాన్ని అభివృద్ధి చేసేవి కాదన్నారు. పది మంది ఫొటోలు, సెల్ఫీలు తీసుకుని, తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు వచ్చినప్పుడు జై అనడాన్ని ఉద్యమం అంటే ఎలా? అని వ్యాఖ్యానించారు. ‘గత ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నవిధంగా అమరావతికి భూములిచ్చిన రైతులకు... అభివృద్ధి చేసిన నివాసయోగ్య స్థలాలు ఇచ్చి తీరుతాం. కొందరు న్యాయస్థానాలకు వెళ్లి స్టేలు తెచ్చుకోవడం, సాంకేతిక అంశాలతో ఈ ప్రక్రియ ఆలస్యమవుతోంది. లేనిపక్షంలో ఇప్పటికే స్థలాలను ఇచ్చేసే వాళ్లం’’ అని వెల్లడించారు. శుక్రవారం తాడేపల్లిలోని వైకాపా కార్యాలయంలో మంత్రి విలేకర్లతో మాట్లాడారు.
బినామీ భూముల్ని పరిరక్షించే సమితి
‘‘శాసనసభలో ప్రాతినిథ్యంలేని రాజకీయ పార్టీ నేతలు, అమరావతి పరిరక్షణ సమితి నేతలు జూమ్‌ కాన్ఫరెన్స్‌ పెట్టారు. దేనికి పరిరక్షణ సమితి..? బినామీ భూముల్ని పరిరక్షించుకోవడానికా లేక చంద్రబాబును పరిరక్షించడానికా?’’ అని విమర్శించారు. ‘‘రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధి, 5 కోట్ల మంది సంక్షేమమే ప్రధాన అంశంగా మూడు రాజధానులను నిర్ణయించాం. ఆ దిశగానే ప్రభుత్వం ముందుకెళ్తుంది. రాష్ట్ర ప్రజలు దాన్ని ఆమోదించారు. దానికి ఉదాహరణే స్థానిక ఎన్నికల్లో విజయం’’ అని వివరించారు.
అందరూ ఇంట్లో కూర్చుంటే కరోనాను ఎవరు నియంత్రిస్తారు?
‘‘కరోనాపై ఉద్యోగ వ్యవస్థ పెద్ద పోరాటం చేస్తోంది. అందరూ ఇంట్లో కూర్చుంటామంటే కరోనా నియంత్రణకు ఎవరు పనిచేస్తారు?  క్షేత్రస్థాయిలోకి వెళ్లి పని చేయకపోతే ఎలా? మాకేం పట్టుదల లేదు? ఉద్యోగులు ఒత్తిడికి గురికాకుండా ఉండే అవకాశాలను పరిశీలిస్తున్నాం. ఉద్యోగుల డిమాండ్లను తిరస్కరించడం లేదు. ప్రతిపక్షనేత చంద్రబాబు మాత్రం ఉద్యోగులు పనిచేయొద్దని రెచ్చగొడుతున్నారు’’ అని ఆరోపించారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని