నిర్దేశిత సమయానికే పోలవరం పూర్తి
close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నిర్దేశిత సమయానికే పోలవరం పూర్తి

జులైలోగా పునరావాస పనులు
జల వనరులశాఖ మంత్రి అనిల్‌కుమార్‌ వెల్లడి

ఈనాడు, అమరావతి, న్యూస్‌టుడే, ఏలూరు కలెక్టరేట్‌: పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన ఆర్‌అండ్‌ఆర్‌ పనులను జులై ఆఖరుకు పూర్తి చేయాలని జలవనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్‌ అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన పునరావాసం, పునర్నిర్మాణ కార్యక్రమాల అమలుపై అధికారులతో ఆయన విజయవాడలో గురువారం సమీక్షించారు. అనంతరం విలేకరులతోనూ మాట్లాడారు. ముంపు గ్రామాలను గుర్తించి వారికి ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ కింద సురక్షితమైన ప్రాంతాల్లో ఇళ్లు నిర్మిస్తున్నామని మంత్రి తెలిపారు. పోలవరం, కుక్కునూరు, వేలేరుపాడు మండలాలకు సంబంధించి 55 ముంపు గ్రామాల్లోని ప్రజలను ఖాళీ చేయించి 19 కాలనీల్లో నివాసం కల్పించామన్నారు. పునరావాసం కల్పించాల్సిన 47 శివారు గ్రామాలకు చెందిన 10,400 కుటుంబాలకు 30 కాలనీలు నిర్మాణ దశలో ఉన్నాయని వివరించారు. జులైలోగా వాటి పనులన్నింటినీ పూర్తి చేసి లబ్ధిదారులతో గృహప్రవేశాలు చేయించాలని అధికారులను ఆదేశించారు. ‘పోలవరం పూర్తయితే ముఖ్యమంత్రి జగన్‌ చరిత్రలో నిలుస్తారు. దాంతో తెదేపాకు పుట్టగతులుండవనే చంద్రబాబు, లోకేశ్‌, ఆ పార్టీ నాయకులు ప్రాజెక్టును అడ్డుకునేందుకు కుట్ర పన్నుతున్నార’ని విలేకరుల సమావేశంలో మంత్రి విమర్శించారు. ఎన్ని అవాంతరాలొచ్చినా 2022 ఖరీఫ్‌లో పోలవరంనుంచి నీరిస్తామని స్పష్టం చేశారు. ‘పోలవరం ఎక్కడ పూర్తవుతుందోనన్న ఆందోళనతో తెదేపా నేతలు అడ్డగోలుగా విమర్శలు చేస్తున్నారు. తెదేపా ఏజెంటుగా మారిన ఎంపీ రఘురామకృష్ణరాజుతో ఫిర్యాదులు చేయిస్తున్నారు. ఏ రకంగానైనా పోలవరాన్ని అడ్డుకోవాలనేదే వారి అజెండా. పోలవరం కాఫర్‌డ్యాంను మూసేయకపోవడం వల్లే డయాఫ్రంవాల్‌కు నష్టం జరిగిందంటూ తెదేపా నేతలు మాట్లాడుతున్నారు. స్పిల్‌ఛానల్‌ను పూర్తి చేయకుండా కాఫర్‌డ్యాంను ఎలా మూసేస్తాం? గతంలో మీరు (తెదేపా) చేసిన తప్పులను మమ్మల్నీ చేయమంటారా?’ అని మంత్రి ప్రశ్నించారు. సమీక్ష సమావేశంలో ఉపముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, మంత్రి పేర్ని నాని, ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, జలవనరుల శాఖ కార్యదర్శి శ్యామలరావు, కలెక్టర్‌ కార్తికేయమిశ్రా తదితరులు పాల్గొన్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని