కాంగ్రెస్‌కు పెద్దాపరేషన్‌ అవసరం
close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కాంగ్రెస్‌కు పెద్దాపరేషన్‌ అవసరం

అధిష్ఠానం దీనిపై దృష్టి పెట్టాలి
సీనియర్‌ నేత మొయిలీ సూచన

దిల్లీ: కాంగ్రెస్‌కు తక్షణమే ‘పెద్దాపరేషన్‌’ చేయాల్సి ఉందని ఆ పార్టీ సీనియర్‌ నాయకుడు ఎం.వీరప్ప మొయిలీ అభిప్రాయపడ్డారు. కేవలం వారసత్వంపైనే ఆధారపడలేమని చెప్పారు. రాహుల్‌ గాంధీ సన్నిహితుడు జితిన్‌ ప్రసాద పార్టీకి రాజీనామా చేసి, భాజపాలో చేరిన నేపథ్యంలో ఆయన ఓ వార్తా సంస్థతో మాట్లాడారు. జితిన్‌ రాజీనామా పార్టీ నాయకత్వానికి ఏమైనా హెచ్చరికను పంపించిందా? అన్న ప్రశ్నకు జవాబిస్తూ ‘‘వచ్చే ఏడాది ఏడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. ఆ తరువాత లోక్‌సభకు ఉంటాయి. అసెంబ్లీ ఎన్నికల్లో సరైన ప్రదర్శన కనబరచకపోతే పార్లమెంటు ఎన్నికలను ఎదుర్కోవడం కష్టమవుతుంది. కాంగ్రెస్‌ పార్టీ కేవలం వారసత్వం ఆధారంగా నడవలేదు. ప్రధాని మోదీ అనుసరిస్తున్న పోటీతత్వ రాజకీయాలను ఎదుర్కోవాలంటే పార్టీలో తగిన మార్పులు చేయాల్సి ఉంటుంది. మోదీ అజేయుడేమీ కాదు. ఆయనను కూడా ఓడించవచ్చు. పార్టీని పాతమార్గంలో పెట్టడం ద్వారా ఇది సాధ్యమవుతుంది. అయితే ఇందుకోసం ఇప్పుడే ‘మేజర్‌ సర్జరీ’ చేయాల్సి ఉంటుంది. అది వెంటనే జరగాలి. రేపన్నది లేదు’’ అని అభిప్రాయపడ్డారు. పార్టీకి పూర్తిస్థాయి నాయకత్వం లేనందువల్లనే సమస్యలు వస్తున్నాయా? అన్న ప్రశ్నకు సమాధానం చెబుతూ ‘‘మాకు నాయకురాలు ఉన్నారు. సోనియా గాంధీ అధ్యక్షురాలిగా ఉండడంతో అక్కడ ఖాళీ లేదు. అయితే పార్టీకి ఆమె భారీ శస్త్ర చికిత్స చేయాల్సి ఉంటుంది. ఆమెకు ఆ పట్టుదల ఉంది. సామర్థ్యం ఉంది. పార్టీ శ్రేణులను ఆమె ఉత్తేజపరచగలరు కూడా’’ అని చెప్పారు.
పదవులు ఇచ్చే ముందు నిబద్ధత చూడాలి
పార్టీలో యవతను ప్రోత్సహించాల్సిందేనని, బాధ్యతాయుతమైన పదవుల్లో అసమర్థులను ఉంచకూడదని మొయిలీ అభిప్రాయపడ్డారు. వారి చరిత్ర, చొరవ, అంకితభావాలను పరిశీలించాల్సి ఉందని చెప్పారు. జితిన్‌ ప్రసాద గురించి చెబుతూ ఆయనను పశ్చిమ బెంగాల్‌ రాష్ట్ర ఇన్‌ఛార్జిగా నియమించారని, కానీ ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయామని తెలిపారు. అనుభవం లేని వారికి కీలక బాధ్యతలు అప్పగిస్తే ఇలాగే ఉంటుందని వ్యాఖ్యానించారు. ‘‘బాగా ఇంగ్లిష్‌ మాట్లాడినంత మాత్రాన మంచి నాయకులు కాలేరు. ప్రజల భాషలో మాట్లాడగలిగే మాస్‌ నాయకులు కావాలి’ అని అన్నారు. జితిన్‌ నిబద్ధత మొదటి నుంచీ అనుమానాస్పదంగానే ఉందని, వ్యక్తిగత ప్రయోజనాల కోసమే ఆయన పార్టీ మారారని ఆరోపించారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు