అది ఉత్తుత్తి ఉద్యోగాల డాబు క్యాలెండర్‌: లోకేశ్‌
close

ప్రధానాంశాలు

అది ఉత్తుత్తి ఉద్యోగాల డాబు క్యాలెండర్‌: లోకేశ్‌

ఏటా జనవరి ఒకటిన ఉద్యోగాల క్యాలెండర్‌ విడుదల చేస్తానని హామీ ఇచ్చిన జగన్‌.. రెండేళ్ల తరువాత అదీనూ తప్పుడు లెక్కలతో విడుదల చేసి మడమ తిప్పడంలో తనకు ఎవరూ సాటిలేరని నిరూపించుకున్నారని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఎద్దేవా చేశారు. సీఎం జగన్‌ విడుదల చేసింది ‘ఉత్తుత్తి ఉద్యోగాల డాబు క్యాలెండర్‌’ అని శుక్రవారం ఒక ప్రకటనలో విమర్శించారు. 2.30 లక్షలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చిన జగన్‌ అధికారంలోకి వచ్చాక నిరుద్యోగ యువతను మోసం చేశారని దుయ్యబట్టారు. ‘దొంగ ఓట్లేయించే వైకాపా కార్యకర్తల్ని వాలంటీర్లుగా నియమించడం వివక్ష లేకపోవడమా...? వార్డు, గ్రామ సచివాలయ ఉద్యోగ భర్తీ పరీక్ష పేపరు అమ్మేయడం అవినీతికి తావులేకుండా చేసినట్టా ? ఉద్యోగాలు అమ్ముకోవడం మీ భాషలో అత్యంత పారదర్శకతా...? మద్యం విక్రయించే ఉద్యోగాలూ గౌరవనీయమైన ప్రభుత్వ ఉద్యోగాలా...? గ్రూప్‌1, గ్రూప్‌2 పోస్టులు 907, పోలీసుశాఖలో 7,740 పోస్టులు ఖాళీగా ఉన్నాయని గత సీఎస్‌ ప్రకటిస్తే, గ్రూప్‌1, 2 కలిపి 36, పోలీసుశాఖలో 450 పోస్టులు మాత్రమే క్యాలెండర్‌లో చూపించారు. వేతనాల పెంపులోనూ అవాస్తవాలు ప్రకటించారు. జగన్‌ గద్దెనెక్కి 700 రోజులు దాటినా సీపీఎస్‌ రద్దు ఊసేలేదు’ అని మండిపడ్డారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని