సీమలో రక్తం పారిస్తున్నారు..
close

ప్రధానాంశాలు

సీమలో రక్తం పారిస్తున్నారు..

తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ధ్వజం
పెసరవాయిలో ఇద్దరు తెదేపా నాయకుల అంత్యక్రియలకు హాజరు

ఈనాడు డిజిటల్‌- కర్నూలు, గడివేముల, న్యూస్‌టుడే: జగన్‌ రెండేళ్ల పాలన చూస్తే ఆయన ఫ్యాక్షన్‌ రెడ్డి అని తేలిపోయిందని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ధ్వజమెత్తారు. రాయలసీమలో చంద్రబాబు నీరు పారిస్తే.. ఫ్యాక్షన్‌ రెడ్డి నాయకత్వంలో రక్తం పారుతోందని ఆరోపించారు. కర్నూలు జిల్లా గడివేముల మండలం పెసరవాయిలో గురువారం హత్యకు గురైన తెదేపా నాయకులు వడ్డు నాగేశ్వరరెడ్డి, ప్రతాపరెడ్డి అంత్యక్రియల్లో ఆయన శుక్రవారం పాల్గొన్నారు. బాధిత కుటుంబీకులను పరామర్శించి అండగా ఉంటామని భరోసానిచ్చారు. అనంతరం లోకేశ్‌ మాట్లాడారు. ‘పెసరవాయి ఘటనపై దమ్ము.. ధైర్యం ఉంటే సీబీఐ విచారణకు ఆదేశించు. కత్తితో రాజకీయం చేసేవారు చివరకు కత్తితోనే చస్తారు. అది నీకు బాగా తెలుసు. మా ఓర్పు, సహనాన్ని పరీక్షిస్తున్నారా? మేం తిరుగుబాటు చేస్తే మీ నాయకులు గ్రామంలో తిరిగే పరిస్థితి ఉంటుందా?’ అని సీఎం జగన్‌ను ఉద్దేశించి ప్రశ్నించారు. తెదేపా శ్రేణులపై రెండేళ్లలో 1400 దాడులు జరిగాయని, 27 మందిని హత్య చేశారన్నారు. కార్యకర్తలు, నాయకులను చంపితే పార్టీ ఏదో అవుతుందనే భ్రమలో ఉన్నారని, తెదేపా ఎక్కడికీ పోదని.. అంతా ప్రజల కోసం పోరాడతారని అన్నారు. రేపు అధికారంలోకి వచ్చేది తెదేపానేనని, పరిస్థితి గతంలోలా ఉండబోదని, వడ్డీతో సహా వ్యక్తిగతంగా చెల్లిస్తానని హెచ్చరించారు. వైకాపాకు చెందిన శ్రీకాంత్‌రెడ్డి, రాజారెడ్డి, దామోదరరెడ్డి మరో 15 మంది అనుచరులతో కలిసి హతమార్చడాన్ని చూస్తుంటే ఎంత పక్కా ప్రణాళిక రూపొందించారో అర్థమవుతోందని అన్నారు.
పోలీసుల అదుపులో పలువురు నిందితులు
జంట హత్యల కేసులోని 13 మంది నిందితుల్లో కొందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.


జంట హత్యలతో సంబంధం లేదు
పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి

 

కల్లూరు గ్రామీణ, న్యూస్‌టుడే: హత్యా రాజకీయాలను ప్రోత్సహించే ప్రసక్తే లేదని, తమ కుటుంబానికి అలాంటి అవసరం లేదని పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి అన్నారు. ఆయన శుక్రవారం కర్నూలులో విలేకరులతో మాట్లాడారు. పెసరవాయిలో జంట హత్యలకు, తనకు ఎలాంటి సంబంధం లేదని వివరించారు. రాజకీయంగా ఎదుర్కోలేక తమపై ఆరోపణలు చేస్తున్నారన్నారు. మృతులు గతంలో తమ వెంట రాజకీయాల్లో ఉన్నారని, వారి రాజకీయ ఎదుగుదలకు తాము కృషి చేశామని చెప్పారు. కక్షపూరిత రాజకీయాలు తాను చేయనని, తెదేపా నేత నారా లోకేశ్‌ ఇష్టానుసారంగా మాట్లాడడం సరికాదని అన్నారు. జంట హత్యలపై ఏ సంస్థతోనైనా దర్యాప్తు చేసుకోవచ్చని సవాలు విసిరారు. రాయలసీమ అభివృద్ధికి సీఎం జగన్‌ అన్ని విధాలా కృషి చేస్తున్నారని వివరించారు. సమావేశంలో కర్నూలు మేయర్‌ బీవై రామయ్య తదితరులు పాల్గొన్నారు.Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని