జగన్‌ అవినీతిని సాక్ష్యాలతో నిరూపిస్తాం
close

ప్రధానాంశాలు

జగన్‌ అవినీతిని సాక్ష్యాలతో నిరూపిస్తాం

రెండేళ్లలో హోల్‌సేల్‌గా అక్రమాలు

ఇచ్చింది గోరంత.. దోచింది కొండంత

తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు ధ్వజం

ఈనాడు డిజిటల్‌, అమరావతి: రాష్ట్రంలో సంక్షేమం పేరుతో మోసం జరుగుతోందని తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆరోపించారు. గోరంత ఇస్తూ కొండంత దోచేస్తూ సాగిన రెండేళ్ల పాలనలో సీఎం జగన్‌ హోల్‌సేల్‌గా అవినీతికి పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. ఆయన అవినీతిని సాక్ష్యాలతో సహా నిరూపిస్తామని చెప్పారు. జగన్‌ తప్పుడు విధానాలను ప్రజల్లో ఎండగట్టేందుకు తెదేపా క్షేత్ర స్థాయి పోరాటాలకు సిద్ధమవుతోందని ప్రకటించారు. పార్టీ ముఖ్య నేతలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జులతో ఆయన మంగళవారం ఆన్‌లైన్‌లో సమావేశమయ్యారు. ‘అబద్ధాల పాలనతో యువత భవిష్యత్తు ప్రమాదంలో పడింది. పారిశ్రామిక రంగానికి ప్రాధాన్యం లేక రాష్ట్రంలో నిరుద్యోగులు పెరిగారు. జాబ్‌ క్యాలెండరు పేరిట ఉద్యోగాలు లేని క్యాలెండరును విడుదల చేశారు. ఏటా రూ.లక్షల ఖర్చుతో ప్రభుత్వ ఉద్యోగాల కోసం శిక్షణ తీసుకుంటున్న లక్షలాది నిరుద్యోగ యువతను రోడ్డున పడేశారు. గ్రూప్‌-1 పరీక్షల్లోనూ అక్రమాలు జరిగాయి. పది, ఇంటర్‌ పరీక్షల నిర్వహణ విషయంలోనూ జగన్‌ మూర్ఖంగా వ్యవహరిస్తున్నారు’ అని దుయ్యబట్టారు.

లబ్ధిదారుల ఎంపికలో కోత విధించి చేయూత పథకం పేరుతో మహిళలను జగన్‌ మోసగించారని చంద్రబాబు మండిపడ్డారు. ‘45 ఏళ్లు దాటిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు నెలకు రూ.3వేల పింఛను ఇస్తానని ఎన్నికల ముందు చెప్పి అధికారంలోకి వచ్చాక మాట తప్పారు. ఏటా రూ.18వేలు ఇస్తూ నాలుగేళ్లకే పథకాన్ని పరిమితం చేశారు. పింఛను రూ.3వేలు చేస్తానని ప్రకటించి రూ.250 పెంచి వితంతువులు, వృద్ధులను మోసగించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీల ఉపప్రణాళికకు సంబంధించి రూపాయీ వెచ్చించలేదు’ అని మండిపడ్డారు.

ఒక్కరోజు టీకాతో మమ అనిపించారు

కొవిడ్‌ నియంత్రణ, వ్యాక్సిన్ల పంపిణీలో జగన్‌ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని చంద్రబాబు దుయ్యబట్టారు. ‘రాష్ట్రంలో వారంపాటు టీకా ప్రక్రియను దాదాపు నిలిపేసి ఒక్కరోజు ఆర్భాటంతో మమ అనిపించి గొప్పగా ప్రచారం చేసుకుంటున్నారు. ప్రభుత్వ లెక్కలకంటే ఏపీలో 14 రెట్లు ఎక్కువగా కరోనా మరణాలున్నాయని ఐఐఎం ఆచార్యుడు విశ్లేషించారు. పంటలకు గిట్టుబాటు ధర లేక, ధాన్యం బకాయిలు అందక రైతులు ఇబ్బంది పడుతున్నారు. తమిళనాడులో సమర్థులను, నోబెల్‌ గ్రహీతలను ఆర్థిక సలహాదారులుగా పెట్టుకుంటే మన రాష్ట్రంలో అసమర్థులను ఆ పదవిలో నియమించారు. జగన్‌ విధానాలను ఎండగడుతూ ఈనెల 29న 175 నియోజకవర్గాల్లో తెదేపా ఆధ్వర్యంలో ఆందోళనలు చేస్తాం’ అని ప్రకటించారు. సమావేశంలో పార్టీ సీనియర్‌ నేతలు నిమ్మల రామానాయుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, కాలవ శ్రీనివాసులు, జీవీ ఆంజనేయులు, జ్యోతుల నెహ్రూ, అబ్దుల్‌ అజీజ్‌ తదితరులు మాట్లాడారు.

ప్రభుత్వ చర్యలతో ప్రమాదంలో వ్యవసాయం

ఈపూరు, న్యూస్‌టుడే: ప్రభుత్వ రైతు వ్యతిరేక చర్యలతో రైతులు ఆర్థికంగా చితికిపోతున్నారని, వ్యవసాయం ప్రమాదంలో పడుతోందని తెదేపా అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. గుంటూరు జిల్లా ఈపూరు మండలం గోపువారిపాలెం గ్రామానికి చెందిన ఎస్సీ మహిళా రైతు పల్లపాటి రూతమ్మతో ఆయన వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. తెదేపా నరసరావుపేట పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు గోపువారిపాలెం పర్యటనలో ఉన్నప్పుడు చంద్రబాబు ఆయనకు వీడియోకాల్‌ చేశారు. ఈ సందర్భంగా ఆంజనేయులు రైతు సమస్యలను చంద్రబాబుకు వివరించారు. అనంతరం గోపువారిపాలెం ఎస్సీ కాలనీకి చెందిన మహిళా రైతు రూతమ్మను వీడియో కాన్ఫరెన్స్‌లో చంద్రబాబుకు పరిచయం చేశారు. తాను ఆరు ఎకరాలను కౌలు తీసుకొని సాగు చేశానని, దిగుబడి సక్రమంగా లేక నష్టపోయామని ఆమె వాపోయారు. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేసి పంట కొంటామని చెప్పిన ప్రభుత్వం 3నెలలైనా పట్టించుకోవడం లేదని చెప్పారు. దళారులేమో బస్తా రూ.1400కు అడుగుతున్నారని తెలిపారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలంటూ ప్రభుత్వానికి తాము లేఖ రాశామని, రైతు పక్షపాతినంటూ అధికారంలోకి వచ్చిన జగన్‌కు వారి సమస్యలను పట్టించుకునే తీరిక లేదని పేర్కొన్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని