పేదలకు సాయం చేయడం దుబారానా?
close

ప్రధానాంశాలు

పేదలకు సాయం చేయడం దుబారానా?

ప్రభుత్వ సలహాదారు సజ్జల

ఈనాడు డిజిటల్‌, అమరావతి: కరోనా సమయంలోనూ కుల, మత, పార్టీలకు అతీతంగా నిరుపేదలకు నగదు సాయం చేస్తుంటే.. ప్రభుత్వం ప్రజాధనం దుబారా చేస్తోందంటూ ప్రతిపక్షనేత చంద్రబాబు దుమ్మెత్తిపోస్తున్నారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ధ్వజమెత్తారు. కులం, మతం పేరుతో ప్రతిదాన్నీ రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. ప్రతిపక్షం చవకబారు రాజకీయాల్ని, కుట్రపూరిత ఎత్తుల్ని చిత్తు చేయాలని, సీఎం జగన్‌ ఆలోచన, ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యతను బీసీలే స్వీకరించాలని సూచించారు. బుధవారం తాడేపల్లిలోని వైకాపా కేంద్ర కార్యాలయంలో కృష్ణబలిజ రాష్ట్రస్థాయి నేతల సమావేశంలో సజ్జల పాల్గొని మాట్లాడారు. కృష్ణబలిజలు నేటికీ అభివృద్ధికి దూరంగా ఉండటం దురదృష్టకరమన్నారు. దీన్ని గుర్తించిన జగన్‌.. వారి అభివృద్ధి కోసం ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు చేశారని వివరించారు. బీసీలు ఆత్మస్థైర్యంతో ముందు నిలిచే స్థాయికి ఎదగాలన్నదే సీఎం లక్ష్యమని వెల్లడించారు. సమాజంలో మార్పు తెచ్చేందుకు జగన్‌ చేస్తున్న ప్రయత్నంలో బీసీలు భాగస్వాములవ్వాలని చెప్పారు.

రాజకీయ చైతన్యమే లక్ష్యం: మంత్రి వేణుగోపాలకృష్ణ

బీసీలు రాజకీయంగా చైతన్యవంతులు కావాలన్నదే సీఎం ఉద్దేశమని బీసీ సంక్షేమశాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ చెప్పారు. నవరత్నాల ద్వారా బీసీల్లో పేదరిక నిర్మూలన, ప్రత్యేక కార్పొరేషన్ల ద్వారా అన్ని రంగాల్లో వారి అభివృద్ధికి కృషి చేస్తున్నారని వివరించారు. ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని బీసీలు బలమైన నాయకులుగా ఎదగాలని సూచించారు. సమావేశంలో కృష్ణబలిజ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ కోలా భవానీ మణికంఠ పాల్గొన్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని