ఎస్క్రో ఒప్పందం ఎందుకు?

ప్రధానాంశాలు

ఎస్క్రో ఒప్పందం ఎందుకు?

 ఆర్థిక మంత్రి ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు
 శాసనమండలిలో విపక్ష నేత యనమల ధ్వజం

ఈనాడు, అమరావతి: రాష్ట్ర అభివృద్ధి సంస్థ (ఏపీఎస్డీసీ) చేసే అప్పులకు ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వాల్సిన అవసరం లేదని, కేంద్ర ప్రభుత్వ అనుమతీ అక్కరలేదని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి చెప్పడం ప్రజలను తప్పుదోవ పట్టించడమేనని శాసనమండలిలో విపక్షనేత యనమల రామకృష్ణుడు ధ్వజమెత్తారు. గ్యారంటీ అవసరమే లేదన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకులతో ఎస్క్రో ఒప్పందం ఎందుకు చేసుకుందని ప్రశ్నించారు. ఏ కార్పొరేషన్‌ ద్వారా రుణం తీసుకున్నా రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరిగా గ్యారంటీ ఇవ్వాల్సిందేనని, అలా ఇచ్చే గ్యారంటీలు రాష్ట్ర ఆదాయంలో 90 శాతానికి మించకూడదని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మన రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పులు, వాటికి ఇచ్చే గ్యారంటీలు ఇప్పటికే ఆ హద్దుకి దగ్గర్లో ఉన్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో చూపించే రుణాలకు రాజ్యాంగంలోని 293(3) అధికరణ ప్రకారం తప్పనిసరిగా కేంద్రం అనుమతి తీసుకోవాలని, అదే సమయంలో ఎఫ్‌ఆర్‌బీఎం పరిధిని (3%) దాటరాదని వివరించారు. అయితే మరో 2 శాతం అదనంగా రుణాలు తెచ్చుకునేందుకు కేంద్రం షరతులతో అనుమతిచ్చిన మాట వాస్తవమో కాదో... రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం మార్కెట్‌ రుణాల కంటే ఆఫ్‌ బడ్జెట్‌ రుణాలే (బడ్జెట్‌లో పేర్కొనని)ఎక్కువగా తీసుకుందని యనమల పేర్కొన్నారు. 2019-20లో తీసుకున్న రూ.77,700 కోట్లు, 2020-21లో తీసుకున్న రూ.91,000 కోట్ల ఆఫ్‌ బడ్జెట్‌ రుణాల గురించి కేంద్ర ప్రభుత్వానికి చెప్పకపోవడం చాలా పెద్ద తప్పిదమన్నారు.

‘ఆఫ్‌ బడ్జెట్‌ లోన్స్‌’ సంక్షేమానికి ఖర్చుపెడితే రుణం ఎలా తీరుస్తారు?

కార్పొరేషన్లు తీసుకునే ఆఫ్‌ బడ్జెట్‌ రుణాలను సంక్షేమానికి ఖర్చు పెడితే... రికవరీ ఎలా సాధ్యపడుతుందని, పెట్టిన ఖర్చు వెనక్కి రానప్పుడు అప్పులు ఎలా తీరుస్తాయని యనమల ప్రశ్నించారు. ‘సంక్షేమానికి చేసిన ఖర్చు ఆర్థిక అభివృద్ధిలోకి రాదు. అది వినిమయ బడ్జెట్‌ అవుతుంది. అలాంటి పరిస్థితుల్లో బడుగు బలహీనవర్గాల ఆర్థికాభివృద్ధి ఎలా సాధ్యమవుతుంది’ అని యనమల ప్రశ్నించారు. ‘రాష్ట్ర ప్రభుత్వం వసూలు చేసే ప్రతీ సెస్‌ కన్సాలిడేట్‌ ఫండ్‌కి కాకుండా, ట్రెజరీలో జమకావాలి. సెస్‌ రూపంలో వసూలైన నిధుల్ని ప్రభుత్వం ఎలా ఖర్చు చేస్తోందో మంత్రి సమాధానం చెప్పాలి. డెట్‌ సర్వీస్‌ రూ.లక్ష కోట్లకు చేరుతోంది’ అని మండిపడ్డారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని