Karnataka Politics: కర్ణాటకలో నాయకత్వ సంక్షోభం లేదు

ప్రధానాంశాలు

Karnataka Politics: కర్ణాటకలో నాయకత్వ సంక్షోభం లేదు

యడియూరప్ప పనితీరు భేష్‌: నడ్డా

పనాజీ, ఈనాడు డిజిటల్‌-బెంగళూరు: కర్ణాటక సీఎం బి.ఎస్‌.యడియూరప్ప రాజీనామా చేయబోతున్నారంటూ ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నవేళ భాజపా జాతీయాధ్యక్షుడు జె.పి.నడ్డా కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ రాష్ట్రంలో నాయకత్వ సంక్షోభమేమీ లేదన్నారు. ముఖ్యమంత్రి యడియూరప్ప తనదైన శైలిలో బాగా పనిచేస్తున్నారంటూ కితాబిచ్చారు. గోవాలో రెండు రోజుల పర్యటనను ముగించుకున్న నడ్డా ఆదివారం విలేకర్ల సమావేశంలో ఈ మేరకు మాట్లాడారు. గోవాలో వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం ప్రమోద్‌ సావంత్‌ నేతృత్వంలోనే భాజపా బరిలో దిగుతుందని నడ్డా పేర్కొన్నారు. దీనిపై పార్టీ పార్లమెంటరీ బోర్డు త్వరలోనే అధికారికంగా నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. దేశంలో కాంగ్రెస్‌ పరిస్థితి చుక్కాని లేని నావలా తయారైందని నడ్డా ఎద్దేవా చేశారు.

అధిష్ఠానం ఆదేశాలను పాటిస్తా: యడియూరప్ప
అంతకుముందు, తన రాజీనామా గురించి వస్తున్న ఊహాగానాలపై కర్ణాటక సీఎం యడియూరప్ప సున్నితంగా స్పందించారు. పార్టీ అధినాయకత్వం ఆదేశాలను తాను పాటిస్తానని స్పష్టం చేశారు. అధిష్ఠానం నుంచి సందేశం వస్తుందేమోనని ఆదివారం సాయంత్రం వరకు ఎదురుచూశానని, కానీ అలాంటిదేమీ రాలేదని చెప్పారు. తాను ముఖ్యమంత్రి పదవిలో కొనసాగుతానా లేదా అనే దానిపై సోమవారం స్పష్టత వచ్చే అవకాశముందన్నారు. అధికారంలో ఉన్నా లేకపోయినా మరో 10-15 ఏళ్లపాటు పార్టీ అభివృద్ధికి కృషిచేస్తానని పేర్కొన్నారు. బెళగావిలో వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించడానికి ఆదివారం వచ్చిన ఆయన ఈ మేరకు విలేకర్లతో మాట్లాడారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని