ఉమాపై దాడి జరిగేలా చేసింది పోలీసులే

ప్రధానాంశాలు

ఉమాపై దాడి జరిగేలా చేసింది పోలీసులే

- తెదేపా నేతల ఆరోపణ

ఈనాడు, అమరావతి: మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావును పోలీసులే దారిమళ్లించి ఆయనపై వైకాపా గూండాలు దాడికి పాల్పడేలా ప్రణాళిక అమలు చేశారని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య, ఆ పార్టీ సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్‌ ఆరోపించారు. కొండపల్లి రక్షిత అటవీ ప్రాంతంలో జరుగుతున్న అక్రమ మైనింగ్‌ పరిశీలించి తిరిగొస్తున్న ఆయన వద్దకు ఇద్దరు కానిస్టేబుళ్లు వెళ్లి జి.కొండూరు మీదుగా వెళ్లాలని సూచించారని.. అటు వెళ్తుండగా స్థానిక ఎస్సై అడ్డుకుని వైకాపా కార్యకర్తలు ఉన్నందున గడ్డమడుగు పైనుంచి వెళ్లాలంటూ దారి మళ్లించారని తెలిపారు. ఎస్సై సూచించిన వైపు వెళ్లిన తర్వాతే ఉమాపై దాడి జరిగిందన్నారు. వైకాపా నాయకులు, పోలీసులు కలిసి ప్రణాళికతోనే ఈ దాడి చేయించారని చెప్పారు. ఉమాయే స్థానికుల్ని రెచ్చగొట్టి, అల్లర్లకు కారణమయ్యారంటూ ఏలూరు రేంజి డీఐజీ, కృష్ణా జిల్లా ఎస్పీ చేసిన వ్యాఖ్యలు దారుణమన్నారు. బుధవారం వారు వేర్వేరుగా విలేకర్లతో మాట్లాడారు. వివరాలు వారి మాటల్లో..

* జి.కొండూరు పోలీసుస్టేషన్‌కు 2 కి.మీ దూరంలో ఉమాపై దాడి జరిగింది. ఫిర్యాదు చేసేందుకు ఆయన పోలీసుస్టేషన్‌కు వెళ్తే అక్కడ వైకాపా కార్యకర్తలు గుమిగూడేలా చేసింది పోలీసులే. ఉమా నుంచి ఫిర్యాదు తీసుకోకుండా, ఆయనే దాడి చేశారంటూ కేసు పెట్టారు. 27వ తేదీ సాయంత్రం 5.40కి ఉమా తనపై దాడి చేశారంటూ ఫిర్యాదుదారు పేర్కొనగా, పోలీసులు కేసు పెట్టారు. 5.43 గంటలకు ఉమా కొండపల్లిలో మీడియాతో మాట్లాడుతున్నారు. ఈ రెండు సమయాలు, ప్రదేశాల మధ్య పొంతనేది?

* ఉమాపై నమోదైన కేసులో ఫిర్యాదుదారుది ఇబ్రహీంపట్నం. ఆ మండలానికి చెందిన ఓ వైకాపా నేతకు కారు డ్రైవర్‌గా ఆయన జి.కొండూరు వెళ్లారు. అసలు సంబంధం లేని జి.కొండూరు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది?

* ఉమాను ఏ కేసులో ఇరికించాలన్న లక్ష్యంతోనే తెల్లవారేవరకూ పోలీసుస్టేషన్‌లో ఉంచుకున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌లు ఉమాను చంపాలని పథకం వేశారు. ప్రణాళిక ప్రకారం జరిగిన హత్యాయత్నం ఇది.

* పెదపారుపూడి పోలీసుస్టేషన్‌ నుంచి బధవారం ఉదయం 5.45 సమయంలో ఓ ప్రైవేటు కారులో ఉమాను మరోచోటకు తరలించారు. ఆయన్ను ప్రైవేటు కారులో తీసుకెళ్లాల్సిన అవసరమేంటి?


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని