దేవినేని ఉమా ప్రాణాలకు ముప్పు

ప్రధానాంశాలు

దేవినేని ఉమా ప్రాణాలకు ముప్పు

 వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు

ఈనాడు, దిల్లీ: రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రాణాలకు ముప్పు ఉందని, జైలు సూపరింటెండెంట్‌ మార్పు అందుకే అనుకుంటున్నానని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు ఆందోళన వ్యక్తం చేశారు. ఉమా ఉన్న గదికి సీసీ కెమెరాలు పెట్టాలని సూచించారు. ఆయనకు ఏ ప్రమాదం జరిగినా ఆ ప్రభావం తమ ప్రభుత్వం, పార్టీపై పడుతుందన్నారు. ఉమా కారు దిగకుండా నాలుగు గంటలు ఉన్నారని ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌ విమర్శించారని, అలాంటప్పుడు ఎస్సీ, ఎస్టీవేధింపు కేసు ఎలా పెట్టారనే అంశాన్ని ప్రజలు ఆలోచించాలని కోరారు. మారణాయుధాలు, గాయాలు ఉంటే సెక్షన్‌ 307 పెడతారని, గోటికీ దెబ్బ తగలనిచోట ఆ సెక్షన్‌ ఎలా పెట్టారో తెలియదన్నారు. తనపైనా ఇలానే తప్పుడు కేసులు పెట్టారని ఆరోపించారు. ఒక వ్యక్తి రాజకీయ జీవితాన్ని అంతం చేయడం కోసం తప్పుడు కేసులు పెట్టినప్పుడు అలా పెట్టినవారిపై 387, 389 సెక్షన్ల ప్రకారం కేసులు పెట్టవచ్చన్నారు. ప్రభుత్వం ఇలాగే అరాచకాలు చేస్తూ పోతే ఆ ప్రభావం సజ్జల రామకృష్ణారెడ్డి, డీజీపీపై పడదని, శాంతిభద్రతల అంశం ముఖ్యమంత్రికే చుట్టుకుంటుందని తెలిపారు. కోర్టు చిన్నమాట అంటే ఇటీవల కేరళ విద్యాశాఖ మంత్రి రాజీనామా చేశారని, ముఖ్యమంత్రి అంగీకరించలేదని తెలిపారు. మన అప్రజాస్వామిక, రాజ్యాంగ వ్యతిరేక విధానాలపై న్యాయస్థానాలు 150కిపైగా సార్లు కోర్టులు మొట్టికాయలు వేసినా 200 సార్లు మొట్టికాయలు వేయించుకొని రికార్డులు సాధించాలని భావిస్తున్నామని ఎద్దేవా చేశారు.
* ముఖ్యమంత్రి దగ్గర రకరకాల చీడ పురుగులుండగా కొత్తగా మరో చీడపురుగు చేరిందని రఘురామ అన్నారు. తన అనర్హతపై పెద్దవాళ్లను కలిసి మాట్లాడినట్లు ఆయన చెప్పుకొంటున్నారని, ఆ చీడపురుగు మాట వింటే ముఖ్యమంత్రే నష్టపోతారని తెలిపారు.
* కేంద్రం నుంచి ఎన్ని నిధులు వచ్చాయని అడిగితే రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది డొంక తిరుగుడు సమాధానాలు చెప్పడంతో హైకోర్టు న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారని తెలిపారు. ఉపాధిహామీ నిధులపై తాను కేంద్రమంత్రులను ఇటీవల కలిస్తే తాము మొత్తం చెల్లించామని వారు చెప్పారన్నారు. సంపాదించి ఖర్చు పెట్టాలి గానీ అప్పులు చేసి పంచే ప్రతి దానికీ జగనన్న పేరు పెట్టొద్దని సూచించారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని